
కోస్గి: ప్రేమ వ్యవహారంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తోగాపూర్‌లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోగాపూర్‌కి చెందిన యువకుడు సంపంగి రమేష్(20)కి 10 నెలల క్రితం గుండుమాల్‌కి చెందిన యువతితో వివాహం జరిగింది. కాగా అప్పటికే రమేష్‌కు ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉంది. ఈ నెల 5న తన బావ బాలకిష్టయ్యకు ఫోన్ చేసి తాను ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా.. ఈవిషయాన్ని బాలకిష్టయ్య అతని కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వారు గాలించగా తమ వ్యవసాయ పొలం సమీపంలోని గుట్టల్లో పురుగుమందు తాగి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి దేవమ్మ ఆదివారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు.
తాగుడుకు బానిసై మరో యువకుడు..
తాగుడుకు బానిసైన ఓ యువకుడు మతి స్థిమితం కోల్పోయి ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోస్గిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా..పట్టణంలోని వినాయక్ నగర్‌కు చెందిన హన్మంతు(28) హమాలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతడు తాగుడుకు బానిస కావడంతో అతని భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లి పోయింది. హన్మంతు గతకొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య