నాగర్‌కర్నూల్: సూర్యుడి పేరిట దేవాలయాలు ఉండటం అత్యంత అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన సూర్యనారాయణుడి ఆలయం నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం బలాన్‌పల్లిలో కొలువుదీరడం విశేషంగా నిలుస్తోంది. సూర్యనారాయణుడు ఇక్కడ స్వయంభుగా కొలువుదీరడం అరుదైన విషయమని చరిత్రకారులు చెబుతున్నారు.
ఏడు గుర్రాలు వాహనంగా, ఛాయాదేవీ, సంధ్యాదేవి సమేతంగా సూర్యభగవానుడు స్వయంభుగా వెలసిన విగ్రహం రాష్ట్రంలో ఎక్కడా కన్పించదని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు గ్రామస్తులు ఈ ఆలయాన్ని చెన్నకేశవ ఆలయంగా భావించి పూజలు నిర్వహిస్తుండగా, మూడేళ్ల కిందటే దీనిని సూర్యనారాయణుడి ఆలయంగా గుర్తించడం గమనార్హం. ఇలాంటి పురాతన ఆలయాన్ని సంరక్షించి ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయాలన్న అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది.
► వెలుగులోకి రాని ఆలయం..
రాష్ట్రంలోనే అరుదైన సూర్యనారాయణుని ఆలయం ఇన్నాళ్లుగా వెలుగులోకి రాకుండాపోయింది. ఏళ్ల పాటు ఈ ఆలయాన్ని చెన్నకేశవస్వామి ఆలయంగా భావించిన స్థానికులు ఆ పేరుతోనే పిలుచుకున్నారు. ఇక్కడి సమీపంలోని చెరువును సైతం చెన్నకేశవ చెరువుగా గ్రామస్తులు పిలుస్తున్నారు. అయితే నాలుగేళ్ల కిందట గ్రామానికి వచ్చిన పరిశుద్దానంద స్వామి ఈ విగ్రహాన్ని పరిశీలించి సూర్యనారాయణుడిగా తేల్చారు. అప్పటి నుంచి గ్రామస్తుల సహకారంతో శిథిలమైన ఆలయ శిఖరాన్ని మళ్లీ నిర్మించారు.
తమ చేనులో సూర్యనారాయణుడు కొలువుదీరడంతో ఆ భూమి యజమాని మాదాసు యాదయ్య సైతం ఎకరం భూమిని ఆలయ అభివృద్ధి కోసం కేటాయించారు. ఏటా రథసప్తమి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆదివారాల్లో మాత్రమే ఇక్కడి సూర్యనారాయణుడు పూజలందుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా ఆరుచోట్ల మాత్రమే సూర్యుడి కోసం ఆలయాలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది.
ఒడిశాలోని ప్రసిద్ధ కోణార్క్ దేవాలయం, జమ్ముకశ్మీర్‌లో మార్తండ సూర్యదేవాలయం, గుజరాత్‌లో మోఢేరా దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లో అరసవల్లి సూర్యనారాయణ ఆలయాలు మాత్రమే ఉన్నట్టు ప్రాచుర్యం పొందగా, రాష్ట్రంలో బలాన్‌పల్లిలోని సూర్యనారాయణుని ఆలయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం తిమ్మాపురంలో సూర్యనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించగా, స్వయంభుగా కొలువైన సూర్యనారాయణ ఆలయాలు అరుదుగా కన్పిస్తాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంపై మరింత పరిశోధన జరిపి, అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నిరాదరణలో కాటమయ్య విగ్రహం
సూర్యనారాయణస్వామి ఆలయానికి సమీపంలోని పంటచేళ్లలో కాటమయ్య విగ్రహంగా భావిస్తున్న అపురూప విగ్రహం నిరాదరణగా పడి ఉంది. ఎడమ చేతిలో కళ్లెం, కుడి చేతిలో కొడవలి, బొడ్డు సమీపంలో మరో కత్తి, గుర్రంపై దౌడు తీస్తున్నట్టుగా ఉన్న ఈ విగ్రహం సమీపంలో విసిరేసినట్టుగా పాదాలు సైతం ఉన్నాయి. ప్రధానంగా యాదవులు, గొర్రెల కాపరులు కాటమయ్యను ఆరాధిస్తారని చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి చెబుతున్నారు. అయితే ఈ విగ్రహం రాణి రుద్రమదేవి రూపాన్ని పోలి ఉండటంతో స్థానికులు రుద్రమదేవిగా పిలుచుకుంటున్నారు.
రాష్ట్రంలో అరుదైన ఆలయం..
బలాన్‌పల్లిలోని సూర్యనారాయణస్వామి విగ్రహం అత్యంత అరుదైనది. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం కన్పించదు. ఏడు గుర్రాలు, ఛాయాదేవి, సంధ్యాదేవి సమేతంగా సూర్యనారాయణుడు కొలువై ఉన్నాడు. ఇలాంటి అపురూప విగ్రహాలు ప్రభుత్వం సంరక్షించి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే సంరక్షణ చర్యలు తీసుకోవాలి. – రెడ్డి రత్నాకర్‌రెడ్డి, చారిత్రక పరిశోధకుడు
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..
మా గ్రామంలో ఏళ్ల కాలం నుంచి ఈ ఆలయం ఉంది. మొదట చెన్నకేశవ స్వామిగా భావించగా, ఇటీవల సూర్యనారాయణస్వామిగా తెలిసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆల య అభివృద్ధికి చొరవ తీసుకోవాలి. ఇక్కడి చరి త్ర, ఆలయ ప్రాముఖ్యతపై పరిశోధన జరగాలి. – వెంకటస్వామి, బలాన్‌పల్లి, తాడూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment