అడ్డొస్తాడని అంతమొందించారు | Shepherd Murder for Fornication | Sakshi
Sakshi News home page

అడ్డొస్తాడని అంతమొందించారు

Published Fri, Sep 20 2019 8:03 AM | Last Updated on Fri, Sep 20 2019 8:03 AM

Shepherd Murder for Fornication - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ షాకీర్‌హుస్సేన్‌

రాజోళి (అలంపూర్‌): వివాహేతర సంబంధమే ఓ అమాయకుడి హత్యకు దారితీసింది. మాటలతో కలిసిన పరిచయం, ఫోన్‌లో సంభాషణ, ఆపై నేరుగా కలుసుకోవడం.. అనంతరం అడ్డుగా వస్తాడనే ఉద్దేశంతో ప్రియురాలి భర్తను అంతమొందించేలా చేసింది. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్‌ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దతాండ్రపాడుకు చెందిన మిషేక్‌(28) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజూలాగానే ఈ నెల పదో తేదీన సొంత పనిమీద బయటకు వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో మిషేక్‌ అన్న అశోక్‌ రాజోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామంలోని ఇద్దరు యువకులు బోయ లక్ష్మన్న(22), బోయ మధు(20)లపై అనుమానాలు వ్యక్తం కాగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అయిజ మండలం వెంకటాపురం వద్ద వారిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజోళి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. 

వివాహేతర సంబంధం.. 
గ్రామంలో ఆటో నడుపుతూ ఫిల్టర్‌ నీటిని సరఫరా చేసే బోయ లక్ష్మన్నకు మిషేక్‌ భార్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనకు, తన ప్రియురాలికి మిషేక్‌ ఎప్పుడైనా అడ్డేనని భావించిన బోయ లక్ష్మన్న అతన్ని అడ్డు తొలగించేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న గొర్రెలకు కాపలాగా వెళ్లిన మిషేక్‌ తనతోపాటు ఉండే మిగతా వారికి భోజనం తీసుకువచ్చేందుకు చింతల్‌ క్యాంపు పరిసరాల నుంచి గ్రామంలోకి వచ్చి వెళ్తుండగా.. సీతారామయ్య తోట దగ్గర అతని కోసం ముందుగా వ్యూహం రచించుకుని సిద్ధంగా ఉన్న బోయ లక్ష్మన్న, బోయ మధు టవల్‌తో మిషేక్‌కు ఊపిరి ఆడకుండా టవల్‌తో మెడకు గట్టిగా బిగించారు. అనంతరం అతని ఛాతి, ముఖంపై బలంగా మోదడంతో ఊపిరి అందక మృతిచెందాడు.

ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి తనగల శివారులో గల తుమ్మిళ్ల లిఫ్టు పైపులో పడేశారు. పైపులైన్‌ లోతు ఎక్కువగా ఉండటం, నాలుగు రోజులుగా మృతదేహం అందులోనే ఉండటంతో నల్లబడిపోయింది. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల రైతులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు మిషేక్‌ మృతదేహంగా నిర్ధారించారు. ఈ విషయమై నిందితులు తెలిపిన వివరాల మేరకు మిషేక్‌ భార్యపై కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి ఛేదించిన శాంతినగర్‌ సర్కిల్‌ సీఐ వెంకటేశ్వర్లు, రాజోళి ఎస్‌ఐ శ్రీనివాస్, శిక్షణ ఎస్‌ఐ శ్రీహరిలను ఆయన అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement