alampoor
-
అడ్డొస్తాడని అంతమొందించారు
రాజోళి (అలంపూర్): వివాహేతర సంబంధమే ఓ అమాయకుడి హత్యకు దారితీసింది. మాటలతో కలిసిన పరిచయం, ఫోన్లో సంభాషణ, ఆపై నేరుగా కలుసుకోవడం.. అనంతరం అడ్డుగా వస్తాడనే ఉద్దేశంతో ప్రియురాలి భర్తను అంతమొందించేలా చేసింది. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దతాండ్రపాడుకు చెందిన మిషేక్(28) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజూలాగానే ఈ నెల పదో తేదీన సొంత పనిమీద బయటకు వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో మిషేక్ అన్న అశోక్ రాజోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామంలోని ఇద్దరు యువకులు బోయ లక్ష్మన్న(22), బోయ మధు(20)లపై అనుమానాలు వ్యక్తం కాగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అయిజ మండలం వెంకటాపురం వద్ద వారిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజోళి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వివాహేతర సంబంధం.. గ్రామంలో ఆటో నడుపుతూ ఫిల్టర్ నీటిని సరఫరా చేసే బోయ లక్ష్మన్నకు మిషేక్ భార్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనకు, తన ప్రియురాలికి మిషేక్ ఎప్పుడైనా అడ్డేనని భావించిన బోయ లక్ష్మన్న అతన్ని అడ్డు తొలగించేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న గొర్రెలకు కాపలాగా వెళ్లిన మిషేక్ తనతోపాటు ఉండే మిగతా వారికి భోజనం తీసుకువచ్చేందుకు చింతల్ క్యాంపు పరిసరాల నుంచి గ్రామంలోకి వచ్చి వెళ్తుండగా.. సీతారామయ్య తోట దగ్గర అతని కోసం ముందుగా వ్యూహం రచించుకుని సిద్ధంగా ఉన్న బోయ లక్ష్మన్న, బోయ మధు టవల్‌తో మిషేక్‌కు ఊపిరి ఆడకుండా టవల్‌తో మెడకు గట్టిగా బిగించారు. అనంతరం అతని ఛాతి, ముఖంపై బలంగా మోదడంతో ఊపిరి అందక మృతిచెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి తనగల శివారులో గల తుమ్మిళ్ల లిఫ్టు పైపులో పడేశారు. పైపులైన్ లోతు ఎక్కువగా ఉండటం, నాలుగు రోజులుగా మృతదేహం అందులోనే ఉండటంతో నల్లబడిపోయింది. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల రైతులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు మిషేక్ మృతదేహంగా నిర్ధారించారు. ఈ విషయమై నిందితులు తెలిపిన వివరాల మేరకు మిషేక్ భార్యపై కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి ఛేదించిన శాంతినగర్ సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, రాజోళి ఎస్ఐ శ్రీనివాస్, శిక్షణ ఎస్ఐ శ్రీహరిలను ఆయన అభినందించారు. -
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
సాక్షి, గద్వాల : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో వరుసగా పట్టుబడుతున్న నకిలీ పత్తి విత్తనాలు సోమవారం జిల్లాకేంద్రంలో దొరికాయి. టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు వెంకటేష్, పెద్ద స్వాములు, నజీర్లకు వచ్చిన సమాచారంతో స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో వెంకట్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నకిలీ పత్తివిత్తనాలు పట్టుబడ్డాయి. విత్తనాలకు కలర్ వేసి ప్యా కెట్లలో ప్యాకింగ్ చేసి అమ్మేందుకు తయారు చేస్తు న్న విత్తనాలను గుర్తించారు. కలర్ కలిపిన విత్తనాలు 25 కిలోలు, కలర్ కలపనివి 100 కిలోలు మొత్తం 125 కిలోల పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏఓ భవానీ, వీఆర్ఓలు పంచనామా నిర్వహించి వాటి విలువ రూ.10 లక్షల విలువ ఉంటుందని తేల్చారు. విత్తనాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఫర్టిలైజర్ షాపులపై దాడులు మక్తల్ : పట్టణంలో పురుగు మందు షాపులపై ఏఎస్పీ, జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారి వెంకటేశ్వర్లు, టీం అధికారి వెంకటేశం సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని బాబా, వెంకటేశ్వర, కోరమాండల్ షాపుల్లో పత్తి విత్తనాలను, గోదాంలలో స్టాకును పరిశీలించారు. అయి తే విత్తనాలు, మందులు ఒకే దగ్గరకు చేర్చితే సక్రమంగా ఉండవన్నారు. వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం అందించాలని కోరారు. అనుమతి ఉన్న షాపుల్లోనే రైతులు వ్తితనాలను కొనుగోలు చేయాలని, తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మక్తల్ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. అయిజ (అలంపూర్): స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం సోమవారం మండలంలోని మేడికొండలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఉప్పరి నాగరాజు నివాసంలో 15 బస్తాలు (10.50 క్విం టాళ్ల) ఫెయిల్ అయిన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఓ శంకర్‌లాల్ ఫిర్యాదు మేరకు నాగరాజుపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ సమీపంలో.. ధరూరు (గద్వాల): ఇటీవల నకిలీ పత్తి విత్తనాల స్థావరాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భయాందోళనకు గురైన గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలను మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద పారబోశారు. ర్యాలంపాడు గ్రామ శివారులో ఉన్న రిజర్వాయర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను పారబోసి వెళ్లారు. రిజర్వాయర్ వద్ద కు వెళ్లిన గ్రామస్తులు వాటిని గమనించి టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని పత్తి విత్తనాలను పరిశీలించారు. రంగులు కలిపి రైతులకు అమ్మడానికి సిద్ధం చేసి ఉంచిన విత్తనాలను పోలీసుల కేసులకు భయపడి పారిబోసినట్లు గుర్తించారు. అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. పక్కనే పడి ఉన్న గోనె సంచులను, వాటిపై ఉన్న పత్తి విత్తనాల లాట్ నంబర్లను గుర్తించారు. త్వరలోనే నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. లభ్యమైన పత్తి విత్తనాల విలువ దాదాపు రూ.లక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి భవాని, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేష్, కానిస్టేబుళ్లు నజీర్, స్వాములు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని బాలుడి మృతి
అయిజ (అలంపూర్) : ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని పెద్ద ధన్వాడకు చెందిన మద్దిలేటి, సుజాత దంపతుల కుమారుడు మహేష్(15), హరికృష్ణలు మంగళవారం స్వ గ్రామం నుంచి అయిజకు బైక్‌పై వస్తుండగా చిన్నతాండ్రపాడు వద్ద వెనకనుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. మహేష్ అక్కడికక్కడే మృతిచెందగా బైక్ నడుపుతున్న హరికృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ సంఘటనపై కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించినట్టు ఏఎస్ఐ శేషిరెడ్డి తెలిపారు. -
కుటుంబాల్లో తీరని శోకం
అలంపూర్ : ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాల్లో తీరని శోకం అలుముకుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్నబిడ్డలను బావి రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో ముగినిపోయారు. ఉండవల్లి మండలం కంచుపాడులో సరదా కోసం ఈతకు వెళ్లి మృతిచెందిన ఇద్దరు చిన్నారుల అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామంలో పూర్తయ్యాయి. ఉండవల్లి జెడ్పీహెచ్ఎస్లో 6వ తరగతి చదువుతున్న చాకలి పవన్(12), శ్రీకాంత్ గౌడ్(12) శనివారం ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డారు. గ్రామస్తులు బావిలో గాలింపు చర్యలు చేపట్టగా చాకలి పవన్ మృతదేహం ముందుగా లభ్యమైంది. శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ రాత్రి 11గంటల తర్వాత లభించింది. సీఐ రజితారెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్‌రావు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అబ్రహం, తహసీల్దార్ మదనమోహన్ రావు, ఎంఈఓ శివప్రసాద్, ఉండవల్లి జెడ్పీహెచ్ఎస్ ఇన్చార్జ్ హెచ్ఎం రామలక్ష్మారెడ్డి గ్రామాన్ని సందర్శించి కుటుంబాలను ఓదార్చారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఫోన్ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఆదుకుంటామని పేర్కొన్నారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వినతి
అలంపూర్: కేజీ టు పీజీ గురుకుల పాఠశాలను నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అలంపూర్ నాయకులు సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. కేజీటూ పీజీ పాఠశాల ఏర్పాటుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5 ఎకరాల రెండు కుంటల స్థలం ఉందని తెలిపారు. అందుకు సంబంధించిన భూమి పత్రాలను అందజేశారు. అలంపూర్ విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి సహాయ సహకారాలను అందించాలని కోరారు. అలంపూర్‌కు మంజూరైన పాఠశాలను ఇక్కడికే తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని విన్నవించారు. స్పందించిన ఆయన సెప్టెంబర్ 5వ తేదిన కేజీటూ పీజీ గురుకుల పాఠశాలను అలంపూర్‌లో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రSమంలో సర్పంచ్ జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్, సీపీఎం నాయకులు రేపల్లె దేవదాసు, టీఆర్ఎస్ నాయకులు జాన్, పోలీస్ చెన్నయ్య, గురుదేవ్ పాఠశాల ప్రిన్సిపాల్ నంద కుమార్, మైనార్టీ నాయకులు షేక్ అహ్మద్ తదితరులు ఉన్నారు.