మృతి చెందిన శ్రీకాంత్ గౌడ్
అలంపూర్ : ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాల్లో తీరని శోకం అలుముకుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్నబిడ్డలను బావి రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో ముగినిపోయారు. ఉండవల్లి మండలం కంచుపాడులో సరదా కోసం ఈతకు వెళ్లి మృతిచెందిన ఇద్దరు చిన్నారుల అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామంలో పూర్తయ్యాయి. ఉండవల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 6వ తరగతి చదువుతున్న చాకలి పవన్(12), శ్రీకాంత్ గౌడ్(12) శనివారం ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డారు. గ్రామస్తులు బావిలో గాలింపు చర్యలు చేపట్టగా చాకలి పవన్ మృతదేహం ముందుగా లభ్యమైంది.
శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ రాత్రి 11గంటల తర్వాత లభించింది. సీఐ రజితారెడ్డి, ఎస్‌ఐ చంద్రమోహన్‌రావు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అబ్రహం, తహసీల్దార్ మదనమోహన్ రావు, ఎంఈఓ శివప్రసాద్, ఉండవల్లి జెడ్పీహెచ్‌ఎస్ ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రామలక్ష్మారెడ్డి గ్రామాన్ని సందర్శించి కుటుంబాలను ఓదార్చారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఫోన్ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఆదుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment