నకిలీ పత్తి విత్తనాల పట్టివేత | Fake Cotton Seeds Seized | Sakshi
Sakshi News home page

 నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Published Tue, May 29 2018 1:17 PM | Last Updated on Tue, May 29 2018 1:17 PM

Fake Cotton Seeds Seized - Sakshi

మక్తల్‌ : ఫర్టిలైజర్‌ షాపులో విత్తనాలను పరిశీలిస్తున్న అధికారులు 

సాక్షి, గద్వాల : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో వరుసగా పట్టుబడుతున్న నకిలీ పత్తి విత్తనాలు సోమవారం జిల్లాకేంద్రంలో దొరికాయి. టాస్క్‌ఫోర్స్‌ టీం సభ్యులు వెంకటేష్, పెద్ద స్వాములు, నజీర్‌లకు వచ్చిన సమాచారంతో స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో వెంకట్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నకిలీ పత్తివిత్తనాలు పట్టుబడ్డాయి.

విత్తనాలకు కలర్‌ వేసి ప్యా కెట్లలో ప్యాకింగ్‌ చేసి అమ్మేందుకు తయారు చేస్తు న్న విత్తనాలను గుర్తించారు. కలర్‌ కలిపిన విత్తనాలు 25 కిలోలు, కలర్‌ కలపనివి 100 కిలోలు మొత్తం 125 కిలోల పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏఓ భవానీ, వీఆర్‌ఓలు పంచనామా నిర్వహించి వాటి విలువ రూ.10 లక్షల విలువ ఉంటుందని తేల్చారు. విత్తనాలను సీజ్‌ చేసి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 

ఫర్టిలైజర్‌ షాపులపై దాడులు

మక్తల్‌ : పట్టణంలో పురుగు మందు షాపులపై ఏఎస్పీ, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారి వెంకటేశ్వర్లు, టీం అధికారి వెంకటేశం సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని బాబా, వెంకటేశ్వర, కోరమాండల్‌ షాపుల్లో పత్తి విత్తనాలను, గోదాంలలో స్టాకును పరిశీలించారు. అయి తే విత్తనాలు, మందులు ఒకే దగ్గరకు చేర్చితే సక్రమంగా ఉండవన్నారు. వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం అందించాలని కోరారు. అనుమతి ఉన్న షాపుల్లోనే రైతులు వ్తితనాలను కొనుగోలు చేయాలని, తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మక్తల్‌ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. 

అయిజ (అలంపూర్‌): స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం సోమవారం మండలంలోని మేడికొండలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఉప్పరి నాగరాజు నివాసంలో 15 బస్తాలు (10.50 క్విం టాళ్ల) ఫెయిల్‌ అయిన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఓ శంకర్‌లాల్‌ ఫిర్యాదు మేరకు నాగరాజుపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ర్యాలంపాడు రిజర్వాయర్‌ సమీపంలో..

ధరూరు (గద్వాల): ఇటీవల నకిలీ పత్తి విత్తనాల స్థావరాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భయాందోళనకు గురైన గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు క్వింటాల్‌ నకిలీ పత్తి విత్తనాలను మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్‌ వద్ద పారబోశారు. ర్యాలంపాడు గ్రామ శివారులో ఉన్న రిజర్వాయర్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను పారబోసి వెళ్లారు. రిజర్వాయర్‌ వద్ద కు వెళ్లిన గ్రామస్తులు వాటిని గమనించి టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సమాచారం అందించారు.

దీంతో వారు అక్కడికి చేరుకుని పత్తి విత్తనాలను పరిశీలించారు. రంగులు కలిపి రైతులకు అమ్మడానికి సిద్ధం చేసి ఉంచిన విత్తనాలను పోలీసుల కేసులకు భయపడి పారిబోసినట్లు గుర్తించారు. అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. పక్కనే పడి ఉన్న గోనె సంచులను, వాటిపై ఉన్న పత్తి విత్తనాల లాట్‌ నంబర్లను గుర్తించారు. త్వరలోనే నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు.

లభ్యమైన పత్తి విత్తనాల విలువ దాదాపు రూ.లక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి భవాని, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేష్, కానిస్టేబుళ్లు నజీర్, స్వాములు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement