మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూర్‌లో పట్టుబడిన నకిలీ విత్తనాలతో అధికారులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో ఎందరో రైతులు ఏటా నకిలీ విత్తనాలతో నష్టపోతున్నారు. మరోపక్క ఏటా మాదిరిగానే ఈసారీ రాష్ట్రవ్యాప్తంగా పత్తి నకిలీ విత్తన మాఫియా భారీ దందాకు తెర లేపింది. దళారులు, సీడ్ ఆర్గనైజర్లు, ఏజెంట్లతో కూడిన పటిష్ట నెట్‌వర్క్‌తో నకిలీ విత్తన విక్రయాలు కొనసాగిస్తోంది. ఇలా ప్రతి సీజన్లో నకిలీ విత్తన వ్యాపారం రూ.2 వేల కోట్లకుపైనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే రూ.700 కోట్ల వరకు జరుగుతోంది. వానాకాలం సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుండగా.. అధికారులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 200 క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో 1,900, ఆదిలాబాద్ జిల్లాలో 141 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నియంత్రిత సాగు పద్ధతి నకిలీ విత్తన మాఫియాకు వరంగా మారింది.
ప్రభుత్వ ఆదేశాలతో ప్రధానంగా పత్తి, వరి (సన్నరకం), కందులు, వేరుశనగ సాగుకు రైతులు ఉద్యుక్తులవుతున్నారు. దీంతో పత్తి, వరి సాగు ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 21,26,621 హెక్టార్లలో పత్తి, 16,31,151 హెక్టార్లలో వరి వేశారు. ఈసారి పత్తి సుమారు 32 లక్షలు, వరి 25 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా. గత వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2,73,699 హెక్టార్లలో పత్తి సాగైంది. నాగర్‌కర్నూల్‌లో 1,42,192, ఆదిలాబాద్‌లో 1,40,332, సంగారెడ్డిలో 1,40,009, కొమురంభీం ఆసిఫాబాద్ 1,24,884, ఖమ్మం 1,00,370 హెక్టార్లలో సాగైంది. ఈసారి ఆయా జిల్లాల్లో పత్తి సాగు 20 నుంచి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. సాధారణంగా ఎకరాకు 900 గ్రాముల చొప్పున పత్తి విత్తనాలు అవసరం. గతేడాది పత్తి సాగు లెక్కలనే తీసుకుంటే.. 53,16,553 కిలోల విత్తనాలు కావాలి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 30 లక్షల కిలోలకు మించి అందుబాటులో లేవు. ఈ లోటునే నకిలీ విత్తన మాఫియా ‘మార్కెట్’గా మలుచుకుంటోంది.
నడిగడ్డే అడ్డాగా..
దక్షిణ భారతదేశంలోనే ఉమ్మడి పాలమూరులోని నడిగడ్డ (జోగుళాంబ గద్వాల జిల్లా) నాణ్యమైన కాటన్ సీడ్ ఉత్పత్తికి పెట్టింది పేరు. ఏటా 40వేల ఎకరాల్లో కాటన్ సీడ్ సాగవుతుండగా, రూ. 2వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. 30 వేల రైతు కుటుంబాలు దీన్నే ప్రధాన పంటగా సాగు చేస్తుండగా, మరో 50 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ కాటన్ సీడ్ వ్యాపారంలో సీడ్ ఆర్గనైజర్ల వ్యవస్థ కీలకం. వంద మంది వరకు సీడ్ ఆర్గనైజర్లు కాటన్‌సీడ్ ఉత్పత్తి సంబంధిత లావాదేవీల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. మరోవైపు నకిలీ సీడ్ మాఫియా సైతం నడిగడ్డేనే అడ్డాగా చేసుకుని నకిలీ దందా సాగిస్తోంది. ఇక్కడ ఏటా రూ.200 కోట్లపైనే ఈ దందా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాను తీసుకుంటే ఈ మొత్తం రూ.700కోట్ల వరకు ఉంటుంది. 2006లో గద్వాలకు చెందిన కొందరు సీడ్ ఆర్గనైజర్లు తయారుచేసి విక్రయిస్తున్న నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వీటి విలువ అప్పట్లోనే సుమారు రూ.15 కోట్లుపైనే. ఇప్పటికీ ఈ వ్యాపారం ఇక్కడ గుట్టుగా సాగుతోంది.
అవీ..ఇవీ కలిపి, రంగులద్ది..
కాటన్‌సీడ్ పంటలో ఫలవంతం కాని 5–10 శాతం విత్తనాలు 10–20 లక్షల (450 గ్రాముల పాకెట్లు) క్వింటాళ్లు, కమర్షియల్ సీడ్ పంట ద్వారా పండిన 7 లక్షల క్వింటాళ్ల విత్తనాలను నకిలీ వ్యాపారులు ఎంచుకుంటారు. ఈ రెండు రకాలు పంటసాగుకు యోగ్యం కావు. కమర్షియల్ పంట ద్వారా పండిన విత్తనాలు నూనె తయారీ, పశువుల దాణాగా ఉపయోగపడతాయి. ఈ రెండు రకాలను కలిపి గుర్తుపట్టరాకుండా రంగులద్ది ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన పాకెట్లల్లో నింపుతారు. కొందరు సీడ్ ఆర్గనైజర్లు, బడా రైతుల ద్వారా వీటిని రైతులకు అంటగడతారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఎమ్మిగనూరు, గుంటూరు, కర్ణాటకలోని రాయచూరు, మహారాష్ట్రలోని పుణె, ముంబై ప్రాంతాల్లో ఈ తయారీ కేంద్రాలున్నాయి. కేంద్ర విత్తన చట్టం ప్రకారం కల్తీ విత్తనాల విక్రేతకు కనీసం 6 నెలల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా వి«ధించాలి. డీలర్‌షిప్‌ను పూర్తిగా రద్దుచేయాలి. పీడీ యాక్టు కిందా కేసులు నమోదు చేయవచ్చు. కానీ ఈ చట్టం అమలుకు నోచుకోవట్లేదు.
నకిలీ విత్తనం తయారీ ఇలా..
ఫలవంతం కాని విత్తనాలే అక్రమార్కుల చేతిలో ‘నకిలీ’గా మారుతున్నాయి. నడిగడ్డలో ఏటా కాటన్‌సీడ్ సాగు ద్వారా రెండు కోట్ల పాకెట్ల (450 గ్రాముల చొప్పున) దిగుబడి వస్తుంది. ఈ 450 గ్రాముల పాకెట్‌ను కనిష్టంగా రూ.410, గరిష్టంగా రూ.470కి విక్రయిస్తారు. వాస్తవానికి విత్తనానికి జెర్మినేషన్ ప్రక్రియ చేసినపుడు 75శాతంపైగా జెర్మినేషన్ వస్తే ఫలవంతమైన (మొలకెత్తే) విత్తనాలనీ, అంతకంటే తక్కువ వస్తే ఫలవంతం కాని (మొలకెత్తని) విత్తనాలనీ లెక్క. ఇలా దిగుబడైన 2 కోట్ల పాకెట్ల విత్తనాలలో సుమారు 5 శాతం నుంచి 10 శాతం విత్తనాలు జెర్మినేషన్‌లో 75శాతం కంటే తక్కువగా వస్తాయి. ఇవే నకిలీ విత్తనాలుగా మార్కెట్‌ను ముంచెత్తుతూ, రైతుల్ని ముంచుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment