గుజరాత్, మహారాష్ట్రల నుంచి ముంచెత్తుతున్న నకిలీ పత్తి విత్తనాలు
రాష్ట్రంలో పెద్దఎత్తున రైతులకు అంటగట్టిన దళారులు
దళారుల ఒత్తిడితో పట్టించుకోని వ్యవసాయాధికారులు
గతేడాది లక్షలాది ఎకరాల్లో నిషేధిత హెచ్‌టీ కాటన్ సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు అన్నదాతను ముంచేస్తున్నాయి. వ్యవసాయశాఖ కొరడా ఝుళిపించకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా రైతులకు అంటగడుతున్నారు. వానాకాలం పంటల సీజన్ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే లక్షలాది మంది రైతుల చెంతకు నకిలీ పత్తి విత్తనాలు చేరినట్లు సమాచారం. దళారుల ఒత్తిడితో కీలక సమయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం రైతుల పాలిట శాపంగా మారింది.
తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని, కొందరు అధికారులు లంచాలు పుచ్చుకొని దళారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు ఇప్పటివరకు కేవలం రూ.1.19 కోట్ల విలువైన 78 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అయితే వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలు దొంగచాటుగా రైతులకు చేరుతున్నాయి.
గుజరాత్, మహారాష్ట్రల నుంచి రాక
ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా. మార్కెట్లో ఎంఎస్‌పీ కంటే అధిక ధర రావడంతో అన్నదాతలు పత్తిపై ఎక్కు వగా ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగా అధికారులు 1.20 కోట్ల విత్తనాల ప్యాకెట్లను రైతుల కు అందుబాటులో ఉంచారు. అయితే, ఇదే అదను గా ఆయా కంపెనీలు నకిలీ, నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్రల నుంచి తరలించి జిల్లాల్లో దళారులకు అప్పగించా యి.
చాలాచోట్ల రైతులకు అంటగట్టాయి. ఈ సీజన్‌లో వర్షం పడితే మొదటగా వేసేది పత్తే కాబట్టి ఇప్పటికే హెచ్‌టీ కాటన్ విత్తనాలు సరఫరా అయ్యా యి. గతేడాది ఎన్ని దాడులు చేసినా లక్షలాది ఎకరా ల్లో హెచ్‌టీ కాటన్ సాగైనట్లు సమాచారం. దీంతో అనేకచోట్ల రైతులు పంట పండక నష్టపోయారు.
నకిలీకి లాభమెక్కువ...
అదును రాగానే రైతులు గ్రామంలోని షావుకార్ల వద్దనో.. విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచ్చినప్పుడు అప్పు తీర్చేలా ఒ ప్పందం చేసుకుంటారు. ఎలా గూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతు లు తీసుకుంటున్నారు. వీటికి ఎలాంటి రశీదు లు ఉండవు. డీలర్ నిబంధనల ప్రకారం అమ్మితే ఒక విత్తన ప్యాకెట్‌కు రూ.25–30 లాభం వస్తుంది.
అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే రూ.500, లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 చొప్పున ఆదాయం సమకూరుతోంది. వ్యవసాయ గణాంకాల ప్రకారం గ్రామాల్లో ప్రతి 100 మంది రైతుల్లో 47 మంది మండల కేంద్రాల్లోని అధికారిక దుకాణల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా... 53 మంది షావుకార్లు, ఇతర వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకుంటున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు వడ్డీ వ్యాపారులు, విత్తన వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు.
రీసైక్లింగ్ విత్తనాలు
కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాక రైతాంగం నష్టాల ఊబిలో చిక్కుకుంటోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటలకు సంబంధించి రీసైక్లింగ్ విత్తనాలనే పలు కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఈ రీసైక్లింగ్ కుంభకోణంలో బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం నివ్వెరపరుస్తోంది.
రాష్ట్రంలో సరఫరా చేసే వాటిలో 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్ విత్తనాలే ఉంటాయని అంచనా. గతంలో విజిలెన్స్ దాడుల్లో ఈ విషయాలు బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment