Fake cotton seeds
-
విత్తనాలకు వి‘పత్తి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు అన్నదాతను ముంచేస్తున్నాయి. వ్యవసాయశాఖ కొరడా ఝుళిపించకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా రైతులకు అంటగడుతున్నారు. వానాకాలం పంటల సీజన్ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే లక్షలాది మంది రైతుల చెంతకు నకిలీ పత్తి విత్తనాలు చేరినట్లు సమాచారం. దళారుల ఒత్తిడితో కీలక సమయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం రైతుల పాలిట శాపంగా మారింది. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని, కొందరు అధికారులు లంచాలు పుచ్చుకొని దళారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు ఇప్పటివరకు కేవలం రూ.1.19 కోట్ల విలువైన 78 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అయితే వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలు దొంగచాటుగా రైతులకు చేరుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రల నుంచి రాక ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా. మార్కెట్లో ఎంఎస్పీ కంటే అధిక ధర రావడంతో అన్నదాతలు పత్తిపై ఎక్కు వగా ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగా అధికారులు 1.20 కోట్ల విత్తనాల ప్యాకెట్లను రైతుల కు అందుబాటులో ఉంచారు. అయితే, ఇదే అదను గా ఆయా కంపెనీలు నకిలీ, నిషేధిత హెటీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్రల నుంచి తరలించి జిల్లాల్లో దళారులకు అప్పగించా యి. చాలాచోట్ల రైతులకు అంటగట్టాయి. ఈ సీజన్లో వర్షం పడితే మొదటగా వేసేది పత్తే కాబట్టి ఇప్పటికే హెచ్‌టీ కాటన్ విత్తనాలు సరఫరా అయ్యా యి. గతేడాది ఎన్ని దాడులు చేసినా లక్షలాది ఎకరా ల్లో హెచ్‌టీ కాటన్ సాగైనట్లు సమాచారం. దీంతో అనేకచోట్ల రైతులు పంట పండక నష్టపోయారు. నకిలీకి లాభమెక్కువ... అదును రాగానే రైతులు గ్రామంలోని షావుకార్ల వద్దనో.. విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచ్చినప్పుడు అప్పు తీర్చేలా ఒ ప్పందం చేసుకుంటారు. ఎలా గూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతు లు తీసుకుంటున్నారు. వీటికి ఎలాంటి రశీదు లు ఉండవు. డీలర్ నిబంధనల ప్రకారం అమ్మితే ఒక విత్తన ప్యాకెట్‌కు రూ.25–30 లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే రూ.500, లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 చొప్పున ఆదాయం సమకూరుతోంది. వ్యవసాయ గణాంకాల ప్రకారం గ్రామాల్లో ప్రతి 100 మంది రైతుల్లో 47 మంది మండల కేంద్రాల్లోని అధికారిక దుకాణల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా... 53 మంది షావుకార్లు, ఇతర వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకుంటున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు వడ్డీ వ్యాపారులు, విత్తన వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు. రీసైక్లింగ్ విత్తనాలుకొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాక రైతాంగం నష్టాల ఊబిలో చిక్కుకుంటోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటలకు సంబంధించి రీసైక్లింగ్ విత్తనాలనే పలు కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఈ రీసైక్లింగ్ కుంభకోణంలో బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం నివ్వెరపరుస్తోంది. రాష్ట్రంలో సరఫరా చేసే వాటిలో 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్ విత్తనాలే ఉంటాయని అంచనా. గతంలో విజిలెన్స్ దాడుల్లో ఈ విషయాలు బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని అంటున్నారు. -
నకిలీ విత్తన ముఠా అరెస్ట్
నార్కట్‌పల్లి: నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న ఓ ముఠాను నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.80 కోట్ల విలువైన పది టన్నుల పత్తి విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ ఎస్పీ అపూర్వరావు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ హిల్స్ ప్రాంతానికి చెందిన గోరంట్ల నాగార్జున, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పెద్దకూరపాడు గ్రామానికి చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన మెరిగె వేణు, అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన నర్సింహ ఓ ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. ఈ ము ఠా సభ్యులు కర్ణాటకలో పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలో స్టోరేజీ చేశారు. అక్కడ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రైతులకు ఎక్కువ ధరకు అమ్మేందుకు హైదరాబాద్ మీదుగా తరలించాలని నిర్ణయించుకున్నారు. కారులో నాగార్జున, రవీంద్రబాబు, వేణు బయలుదేరారు. పక్కా సమాచారంతో బుధవారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు, టాస్‌్కఫోర్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఎర్టిగా కారును తనిఖీ చేయగా రెండు బస్తాల విత్తనాలు బయటపడ్డాయి. వాటిని వ్యవసాయ అధికారులు పరిశీలించి నకిలీ విత్తనాలుగా నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మిగతా విత్తనాలను కూడా స్వా«దీనం చేసుకున్నారు. మరో నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్ ప్రయోగించనున్నట్టు చెప్పారు. -
కర్నూలు జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు
-
పొంచి ఉంది.. విపత్తి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో ఎందరో రైతులు ఏటా నకిలీ విత్తనాలతో నష్టపోతున్నారు. మరోపక్క ఏటా మాదిరిగానే ఈసారీ రాష్ట్రవ్యాప్తంగా పత్తి నకిలీ విత్తన మాఫియా భారీ దందాకు తెర లేపింది. దళారులు, సీడ్ ఆర్గనైజర్లు, ఏజెంట్లతో కూడిన పటిష్ట నెట్‌వర్క్‌తో నకిలీ విత్తన విక్రయాలు కొనసాగిస్తోంది. ఇలా ప్రతి సీజన్లో నకిలీ విత్తన వ్యాపారం రూ.2 వేల కోట్లకుపైనే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే రూ.700 కోట్ల వరకు జరుగుతోంది. వానాకాలం సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుండగా.. అధికారులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 200 క్వింటాళ్లు, మంచిర్యాల జిల్లాలో 1,900, ఆదిలాబాద్ జిల్లాలో 141 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నియంత్రిత సాగు పద్ధతి నకిలీ విత్తన మాఫియాకు వరంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రధానంగా పత్తి, వరి (సన్నరకం), కందులు, వేరుశనగ సాగుకు రైతులు ఉద్యుక్తులవుతున్నారు. దీంతో పత్తి, వరి సాగు ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 21,26,621 హెక్టార్లలో పత్తి, 16,31,151 హెక్టార్లలో వరి వేశారు. ఈసారి పత్తి సుమారు 32 లక్షలు, వరి 25 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా. గత వానాకాలం సీజన్లో రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2,73,699 హెక్టార్లలో పత్తి సాగైంది. నాగర్‌కర్నూల్‌లో 1,42,192, ఆదిలాబాద్‌లో 1,40,332, సంగారెడ్డిలో 1,40,009, కొమురంభీం ఆసిఫాబాద్ 1,24,884, ఖమ్మం 1,00,370 హెక్టార్లలో సాగైంది. ఈసారి ఆయా జిల్లాల్లో పత్తి సాగు 20 నుంచి 60 శాతానికి పెరుగుతుందని అంచనా. సాధారణంగా ఎకరాకు 900 గ్రాముల చొప్పున పత్తి విత్తనాలు అవసరం. గతేడాది పత్తి సాగు లెక్కలనే తీసుకుంటే.. 53,16,553 కిలోల విత్తనాలు కావాలి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 30 లక్షల కిలోలకు మించి అందుబాటులో లేవు. ఈ లోటునే నకిలీ విత్తన మాఫియా ‘మార్కెట్’గా మలుచుకుంటోంది. నడిగడ్డే అడ్డాగా.. దక్షిణ భారతదేశంలోనే ఉమ్మడి పాలమూరులోని నడిగడ్డ (జోగుళాంబ గద్వాల జిల్లా) నాణ్యమైన కాటన్ సీడ్ ఉత్పత్తికి పెట్టింది పేరు. ఏటా 40వేల ఎకరాల్లో కాటన్ సీడ్ సాగవుతుండగా, రూ. 2వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. 30 వేల రైతు కుటుంబాలు దీన్నే ప్రధాన పంటగా సాగు చేస్తుండగా, మరో 50 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ కాటన్ సీడ్ వ్యాపారంలో సీడ్ ఆర్గనైజర్ల వ్యవస్థ కీలకం. వంద మంది వరకు సీడ్ ఆర్గనైజర్లు కాటన్‌సీడ్ ఉత్పత్తి సంబంధిత లావాదేవీల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. మరోవైపు నకిలీ సీడ్ మాఫియా సైతం నడిగడ్డేనే అడ్డాగా చేసుకుని నకిలీ దందా సాగిస్తోంది. ఇక్కడ ఏటా రూ.200 కోట్లపైనే ఈ దందా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాను తీసుకుంటే ఈ మొత్తం రూ.700కోట్ల వరకు ఉంటుంది. 2006లో గద్వాలకు చెందిన కొందరు సీడ్ ఆర్గనైజర్లు తయారుచేసి విక్రయిస్తున్న నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వీటి విలువ అప్పట్లోనే సుమారు రూ.15 కోట్లుపైనే. ఇప్పటికీ ఈ వ్యాపారం ఇక్కడ గుట్టుగా సాగుతోంది. అవీ..ఇవీ కలిపి, రంగులద్ది.. కాటన్‌సీడ్ పంటలో ఫలవంతం కాని 5–10 శాతం విత్తనాలు 10–20 లక్షల (450 గ్రాముల పాకెట్లు) క్వింటాళ్లు, కమర్షియల్ సీడ్ పంట ద్వారా పండిన 7 లక్షల క్వింటాళ్ల విత్తనాలను నకిలీ వ్యాపారులు ఎంచుకుంటారు. ఈ రెండు రకాలు పంటసాగుకు యోగ్యం కావు. కమర్షియల్ పంట ద్వారా పండిన విత్తనాలు నూనె తయారీ, పశువుల దాణాగా ఉపయోగపడతాయి. ఈ రెండు రకాలను కలిపి గుర్తుపట్టరాకుండా రంగులద్ది ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన పాకెట్లల్లో నింపుతారు. కొందరు సీడ్ ఆర్గనైజర్లు, బడా రైతుల ద్వారా వీటిని రైతులకు అంటగడతారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఎమ్మిగనూరు, గుంటూరు, కర్ణాటకలోని రాయచూరు, మహారాష్ట్రలోని పుణె, ముంబై ప్రాంతాల్లో ఈ తయారీ కేంద్రాలున్నాయి. కేంద్ర విత్తన చట్టం ప్రకారం కల్తీ విత్తనాల విక్రేతకు కనీసం 6 నెలల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా వి«ధించాలి. డీలర్‌షిప్‌ను పూర్తిగా రద్దుచేయాలి. పీడీ యాక్టు కిందా కేసులు నమోదు చేయవచ్చు. కానీ ఈ చట్టం అమలుకు నోచుకోవట్లేదు. నకిలీ విత్తనం తయారీ ఇలా.. ఫలవంతం కాని విత్తనాలే అక్రమార్కుల చేతిలో ‘నకిలీ’గా మారుతున్నాయి. నడిగడ్డలో ఏటా కాటన్‌సీడ్ సాగు ద్వారా రెండు కోట్ల పాకెట్ల (450 గ్రాముల చొప్పున) దిగుబడి వస్తుంది. ఈ 450 గ్రాముల పాకెట్‌ను కనిష్టంగా రూ.410, గరిష్టంగా రూ.470కి విక్రయిస్తారు. వాస్తవానికి విత్తనానికి జెర్మినేషన్ ప్రక్రియ చేసినపుడు 75శాతంపైగా జెర్మినేషన్ వస్తే ఫలవంతమైన (మొలకెత్తే) విత్తనాలనీ, అంతకంటే తక్కువ వస్తే ఫలవంతం కాని (మొలకెత్తని) విత్తనాలనీ లెక్క. ఇలా దిగుబడైన 2 కోట్ల పాకెట్ల విత్తనాలలో సుమారు 5 శాతం నుంచి 10 శాతం విత్తనాలు జెర్మినేషన్లో 75శాతం కంటే తక్కువగా వస్తాయి. ఇవే నకిలీ విత్తనాలుగా మార్కెట్‌ను ముంచెత్తుతూ, రైతుల్ని ముంచుతున్నాయి. -
నాణ్యమైన పత్తి విత్తనం దొరికేనా?
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నా.. అత్యధికంగా పత్తి పంట వేస్తారు. మొత్తం సాగులో పత్తి దాదాపు 45 నుంచి 50 శాతం ఉంటుంది. గత ఏడాది ఖరీఫ్‌లో 2,59,498 హెక్టార్లలో పత్తి సాగు కాగా ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు దొరకడం ప్రశ్నార్థకంగా మారింది. నకిలీ బీటీ పత్తి విత్తనాలు, హెచ్‌టీ విత్తనాలు చాప కింద నీరులాగా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ సారి ఇటు వ్యవసాయ అధికారులు, అటు విజిలెన్స్ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇప్పటికే ఆదోని, కర్నూలు డివిజన్లలోని అనేక గ్రామాల్లో పత్తి విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. జూన్ 1 నుంచి నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. తొలకరి పలకరిస్తే ముందస్తుగానే పత్తి వేసుందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గత ఏడాది నకిలీ పత్తి విత్తనాలతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినింది. ఈ సారి ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన వ్యవసాయశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గుట్టుగా సాగుతున్న హెచ్‌టీ పత్తి విత్తనాల దందా గ్లెపోసెట్ కలుపు మందును తట్టుకునే హెచ్‌టీ పత్తి విత్తనాలు అటు పర్యావరణానికి, ఇటు జీవవైవిధ్యానికి ప్రమాదమనే కారణంతో ఆ విత్తనాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. కానీ, జిల్లాలో 2017 ఖరీప్‌లో హెచ్‌టీ పత్తి సాగు భారీగానే అయింది. ఈ పత్తి విత్తనాలను సాగు చేసినా, విత్తనాలను మార్కెటింగ్ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ హెచ్చరించడమే తప్ప నియంత్రణకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నకిలీలకు కేంద్రంగా కర్నూలు రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ఇటు నకిలీ బీటీ పత్తి విత్తనాలకు, హెచ్‌టీ పత్తి విత్తనాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో ప్రధానంగా పత్తి గుంటూరు, ఒంగోలు, కృష్ణ జిల్లాల్లో సాగు అవుతోంది. ఆ జిల్లాలకు కర్నూలు జిల్లా నుంచే నకిలీ బీటీ విత్తనాలు, హెచ్‌టీ విత్తనాలు తరలుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలు నకిలీలకు పెట్టింది పేరుగా ఉన్నాయి. అనేక మంది అక్రమార్కులు జిన్నింగ్ మిల్లుల నుంచి పత్తి విత్తనాలు తెచ్చు కొని వాటిని ప్రాసెసింగ్ చేసి రంగు అద్దుతున్నారు. తర్వాత వాటిని ఆకర్షణీయమైన ప్యాకెట్లలో ప్యాక్ చేసి బ్రాండెడ్ విత్తనాలుగా మార్కెట్లోకి వదిలి ప్రత్యేక ఏజెంట్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. బ్రాండెడ్ విత్తనాలకు కొరత ఏర్పడే ప్రమాదం ! గత ఏడాది బీజీ–2 పేరుతో హెచ్‌టీ పత్తి విత్తనాలను మార్కెటింగ్ చేశారనే కారణంతో కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు చెందిన పలు కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. ఒక కంపెనీ లైసన్‌ను పూర్తిగా రద్దు చేయగా... దాదాపు 15 కంపెనీలకు చెందిన బీజీ–2 రకాలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఇందువల్ల ఈ సారి బ్రాంyð డ్ పత్తి విత్తనాలకు కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా పెంచుతున్నాం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. ముఖ్యంగా పత్తితో హెచ్‌టీ పత్తి విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఈ విత్తనాలు అమ్మినా.. మార్కెటింగ్ చేసినా, సాగు చేసినా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా నకిలీ విత్తనాలపై దృష్టి పెట్టాము. అన్ని ప్రాసెసింగ్ యూనిట్లను, ట్రాన్స్‌పోర్టు ఆఫీసులు తదితర వాటి తనిఖీలకు ఆదేశాలు ఇచ్చాం. –ఠాగూర్‌నాయక్, జేడీఏ -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
మంచిర్యాలక్రైం: నకిలీ పత్తి విత్తనాల రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పంజా విసిరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్ సమీపంలోని బ్యాట్కో ట్రాన్స్‌ఫోర్టు ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్స్‌ఫోర్స్ సీఐ బుద్దె స్వామి, పట్టణ సీఐ మహేశ్ ఆకస్మిక దాడి చేసి సుమారు రూ. 10లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు నకిలీ పత్తి విత్తనాలు (సిద్ధి 303) తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు ట్రాన్స్‌ఫోర్టుకు తీసుకువచ్చారని తెలిపారు. స్వాధీనం చేసుకున్న 20 బస్తాలను, తరలిస్తున్న మంచిర్యాలకు చెందిన అజయ్‌శర్మను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. -
మార్కెట్లో నకిలీ విత్తు!
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 36 వేల ఎకరాలు. గతేడాది 49,873 ఎకరాల్లో పంట సాగైంది. ఈసారి కూడా సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఎక్కువగా పత్తి సాగవుతుం దని భావిస్తున్నారు. విత్తనాల అవసరం ఎక్కు వగా ఉండడంతో నకిలీ విత్తనాల వ్యాపారులు జిల్లాపై కన్నేశారు. విత్తనం కొనుగోలు చేసిన రైతులకు విత్తనం అసలైనదో, నకిలీదో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టి దోచుకుంటున్నారు. ఇటీవల 44వ జాతీయ రహదారి మీదుగా కారులో నకిలీ విత్తనాలను తరలిస్తుండగా భిక్కనూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు. అందులో రూ. 2.20 లక్షల విలువైన 296 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లున్నాయి. హైదరాబాద్ నుంచి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విత్తనాలకు సంబంధించి సరైన పత్రా లు లేకపోవడంతో అవి అనుమతి లేని కంపెనీలకు చెందిన విత్తనాలని, నకిలీవని గుర్తించారు. నకిలీ విత్తనాలను కారులో సరఫరా చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఇరు రాష్ట్రాల నుంచి... పత్తి విత్తన కంపెనీలు ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు కామారెడ్డి జిల్లాకు వస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్దకొడప్ గల్, పిట్లం తదితర మండలాల్లో పత్తి పంట ఎక్కు వగా సాగవుతుంది. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి అక్కడి నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు చేరుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. పత్తి పూత దశకు వచ్చిన తరువాతే విత్తనం నాణ్యత తెలుస్తుంది. ఇప్పటికే విత్తనం వేసిన రైతులు మొలకలు రావడంతో పంటను సంరక్షించే పనిలో ఉన్నారు. మరికొందరు విత్తనం వేస్తున్నారు. కామారెడ్డి ప్రాంతంలోని గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి తదితర మండలాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి ఏపీ నుంచి ఎక్కువగా విత్తనాలు వస్తున్నాయి. ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ విత్తనాలతో రైతులు తెలియకుండానే మోసపోతున్నారు. నామమాత్రపు తనిఖీలు.. నకిలీ విత్తనాలకు సంబంధించి వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు జిల్లాలోని ఆయా మండలాల్లో తిరుగుతూ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే నేరుగా దందా చేసేవారు దుకాణాల్లో నకిలీ విత్తనాలను ఎవరూ నిల్వ ఉంచుకోరు. కానీ అధికారులు మాత్రం దుకాణాలను తనిఖీ చేసి వెళుతున్నారు. మద్యం బెల్టు దుకాణాల్లాగే నకిలీ విత్తనాలకు సంబంధించి ఎలాంటి లైసెన్సులు లేకుండానే గ్రామాల్లో కొందరు దళారులు విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాల్లో విత్తనాలు అమ్మేవారి ఇళ్లు, గోదాములపై దాడులు చేస్తే నకిలీ విత్తన గుట్టు రట్టయ్యేది. కాని అధికారులు అటువైపు వెళ్లడం లేదు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా నకిలీ విత్తనాలను పట్టుకున్న దాఖలాలు లేవు. జాతీయ రహ దారి మీదుగా నకిలీ విత్తనాలను తీసుకెళుతున్న కారును పోలీసులు పట్టుకుని విచారిస్తేగాని నకిలీ విత్తనాలని తేలలేదు. -
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
సాక్షి, గద్వాల : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. టాస్క్‌ఫోర్స్ దాడుల్లో వరుసగా పట్టుబడుతున్న నకిలీ పత్తి విత్తనాలు సోమవారం జిల్లాకేంద్రంలో దొరికాయి. టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు వెంకటేష్, పెద్ద స్వాములు, నజీర్లకు వచ్చిన సమాచారంతో స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో వెంకట్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నకిలీ పత్తివిత్తనాలు పట్టుబడ్డాయి. విత్తనాలకు కలర్ వేసి ప్యా కెట్లలో ప్యాకింగ్ చేసి అమ్మేందుకు తయారు చేస్తు న్న విత్తనాలను గుర్తించారు. కలర్ కలిపిన విత్తనాలు 25 కిలోలు, కలర్ కలపనివి 100 కిలోలు మొత్తం 125 కిలోల పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏఓ భవానీ, వీఆర్ఓలు పంచనామా నిర్వహించి వాటి విలువ రూ.10 లక్షల విలువ ఉంటుందని తేల్చారు. విత్తనాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఫర్టిలైజర్ షాపులపై దాడులు మక్తల్ : పట్టణంలో పురుగు మందు షాపులపై ఏఎస్పీ, జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారి వెంకటేశ్వర్లు, టీం అధికారి వెంకటేశం సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని బాబా, వెంకటేశ్వర, కోరమాండల్ షాపుల్లో పత్తి విత్తనాలను, గోదాంలలో స్టాకును పరిశీలించారు. అయి తే విత్తనాలు, మందులు ఒకే దగ్గరకు చేర్చితే సక్రమంగా ఉండవన్నారు. వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం అందించాలని కోరారు. అనుమతి ఉన్న షాపుల్లోనే రైతులు వ్తితనాలను కొనుగోలు చేయాలని, తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మక్తల్ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. అయిజ (అలంపూర్): స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం సోమవారం మండలంలోని మేడికొండలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఉప్పరి నాగరాజు నివాసంలో 15 బస్తాలు (10.50 క్విం టాళ్ల) ఫెయిల్ అయిన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఓ శంకర్‌లాల్ ఫిర్యాదు మేరకు నాగరాజుపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ సమీపంలో.. ధరూరు (గద్వాల): ఇటీవల నకిలీ పత్తి విత్తనాల స్థావరాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భయాందోళనకు గురైన గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలను మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద పారబోశారు. ర్యాలంపాడు గ్రామ శివారులో ఉన్న రిజర్వాయర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను పారబోసి వెళ్లారు. రిజర్వాయర్ వద్ద కు వెళ్లిన గ్రామస్తులు వాటిని గమనించి టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని పత్తి విత్తనాలను పరిశీలించారు. రంగులు కలిపి రైతులకు అమ్మడానికి సిద్ధం చేసి ఉంచిన విత్తనాలను పోలీసుల కేసులకు భయపడి పారిబోసినట్లు గుర్తించారు. అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. పక్కనే పడి ఉన్న గోనె సంచులను, వాటిపై ఉన్న పత్తి విత్తనాల లాట్ నంబర్లను గుర్తించారు. త్వరలోనే నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. లభ్యమైన పత్తి విత్తనాల విలువ దాదాపు రూ.లక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి భవాని, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేష్, కానిస్టేబుళ్లు నజీర్, స్వాములు తదితరులు పాల్గొన్నారు. -
తీగలాగితే డొంక కదిలింది
బెల్లంపల్లి: మొక్కజొన్నల మాటున అక్రమంగా రవాణా చేస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న ఘటన మరువకముందే బెల్లంపల్లి పోలీ సులు మరో గుట్టును రట్టు చేశారు. బుధవారం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి ఏకంగా ఓ గోదాంపై దాడిచేసి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న మెడిశెట్టి గోవింద్ అనే యువకుడు మొక్కజొన్నల మాటున హైదరాబాద్ నుంచి ఓ ఆటో ట్రాలీలో ఆసిఫాబాద్‌కు సోమవారం 800 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు (నాలుగు క్వింటాళ్లు) రవాణా చేస్తుండగా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై వినోద్‌కుమార్ ఆటోట్రాలీని ఆపి తనిఖీ చేయడంతో నకిలీ విత్తనాల గుట్టు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వెంటనే నిందితుడు గోవింద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా కొన్ని విషయాలు వెల్లడించడంతో ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజా దవ్ ఆదేశాల మేరకు సోమవారం టూటౌన్ ఎస్సై పోలీసు బృందంతో ఆంధ్రప్రాంతానికి వెళ్లింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లుపై బెల్లంపల్లి పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా, అక్కడ తయారు చేస్తున్న నకిలీ విత్తనాల ను చూసీ నిర్ఘాంతపోయారు. జిన్నింగ్ మిల్లు ను స్థావరంగా చేసుకుని పెద్ద ఎత్తున ఫ్యాకెట్లలో విత్తనాలు నింపి సీజ్ చేస్తుండగా నింది తులు అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. జిన్నింగ్ మిల్లు స్థావరంగా.. జిన్నింగు మిల్లును ప్రధాన స్థావరంగా చేసుకుని పెద్ద ఎత్తున నకిలీ బీజీ–3 పత్తి విత్తనాలను తయారు చేస్తుండటాన్ని బెల్లంపల్లి పోలీసుల బృందం కనిపెట్టింది. వెంటనే దాడి చేసి తయారీదారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిన్నింగ్ మిల్లులో బస్తాల కొద్ది విత్తనాలను సిద్ధం చేసుకుని ప్యాకెట్లలో నింపడానికి సిద్ధంగా ఉంచిన, ప్యాకెట్లలో నింపుతున్న నకిలీ బీజీ–3 పత్తి విత్తనాలు 142 బస్తాలను (10 టన్నులు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన వెంటనే అక్కడి ఏడీఏ రవికుమార్‌కు టూటౌన్ ఎస్సై వినోద్‌కుమార్ సమాచారం అందించి ఘటనాస్థలికి రప్పించారు. వెంటనే ఆ విత్తనాలను సీజ్ చేయించారు. ప్రధాన సూత్రధారి మల్లికార్జున్‌రావు? నకిలీ పత్తి విత్తనాలను ఆ ప్రాంతానికి చెందిన దొండపాటి మల్లికార్జునరావు అనే వ్యక్తి తయారు చేయిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. వెంటనే అతడిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లికార్జునరావు రహస్యంగా నకిలీ విత్తనాలను తయారు చేయించి, ఆ విత్తనాలను ప్యాకెట్లలో పొందుపర్చి బోల్‌గార్డ్ (బీజీ)–3 పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. నడికుడిలో తయారు చేసిన నకిలీ విత్తనాలను మల్లికార్జున్‌రావు ఎంతో నేర్పుగా ప్యాకెట్ల రూపంలో కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సరఫరా చేయడం గమనార్హం. కొందరు స్థానికులు, ఆంధ్ర వలసవాదులు, ఈ ప్రాంత రైతులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూడటంతోపాటు దందాలో భాగస్వాములెవరనేది బయటపడే అవకాశం ఉంది. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
చింతలమానెపల్లి(సిర్పూర్): చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పోలీసులు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నకిలీ విత్తనాలను తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన బోర్కుట్ ఓంకార్, జునుగరి శంకర్ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు విచారించగా కావ్య బీటీ పేరుతో ఉన్న 91 ప్యాకెట్ల బీటీ 3 (గ్లైసిల్) పత్తి విత్తనాల ప్యాకెట్లు వారి వద్ద లభించాయి. అదుపులోకి తీసుకున్న ఓంకార్, శంకర్‌ను పోలీసులు విచారించగా వీటిని కౌటాల మండల కేంద్రం నుంచి తీసుకువస్తున్నట్లు తెలిపారు. వీరు అందించిన సమాచారం మేరకు కౌటాలకు చెందిన రమేశ్‌గౌడ్ మారక్వార్, ఎల్ములే తులసీరాంను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న విత్తనాల ధర సుమారుగా రూ. లక్ష ఉంటుందని, వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యవసాయ అధికారి రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నకిలీ వి‘పత్తి’.. కల్తీ ముంచెత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నకిలీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. అధికారుల దాడుల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ నకిలీ, కల్తీ విత్తనాలు వెలుగుచూస్తున్నాయి. అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాలూ దొరుకుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, విత్తన ప్రాసెసింగ్ కంపెనీలపై నిఘా లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఆ యూనిట్లపై సమగ్ర తనిఖీలు చేయకపోవడంతో అడ్డూఅదుపూ లేకుండా నకిలీ, కల్తీ విత్తనాలు రైతులకు చేరుతున్నాయంటున్నారు. రాష్ట్రంలో 500 ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రంలోని 500 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో 200 యూనిట్లకు వ్యవసాయ శాఖ, 300 యూనిట్లకు విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ లైసెన్సులిచ్చాయి. వాటిలో 150 వరకు పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల వరకు పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, అందులో రాష్ట్రం నుంచే 2 కోట్ల విత్తనాలు సరఫరా అవుతాయి. పత్తి విత్తనాన్ని ఎక్కువగా పాత మహబూబ్‌నగర్ జిల్లాలోనే సాగు చేస్తారు. కానీ తాజాగా నకిలీ పత్తి విత్తనాలు వెలుగు చూస్తుండటంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోంది. అనుమతి లేని కల్తీ విత్తనంపై దుమారం చెలరేగుతోంది. దేశవ్యాప్తంగా బీజీ–3 పత్తి విత్తనాలు రాష్ట్రం నుంచే సరఫరా అవుతున్నాయని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సరైన తనిఖీలు లేకే కల్తీ, నకిలీ విత్తనాల ఘటనలు వెలుగు చూస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. 40 అంశాల ప్రకారం తనిఖీలేవీ? విత్తనాల ప్రాసెసింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కల్తీ, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. 500 ప్రాసెసింగ్ యూనిట్లలో తూతూమంత్రంగానే తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. నిబంధనల ప్రకారం 40 అంశాల ఆధారంగా తనిఖీలు చేయాలి. రికార్డులన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలి. అలా చేస్తే ఒక్క కల్తీ, నకిలీ విత్తనం బయటకు రాదని.. కానీ ఇవేవీ చేయకుండానే అధికారులు లాలూచీ పడటంతో నకిలీ, కల్తీ విత్తనం మార్కెట్లోకి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. -
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
తాండూర్ (బెల్లంపల్లి): ఆంధ్రా ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. రూ.1.06 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఈ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి తాండూర్ ఎస్ఐ కె.రవి సిబ్బందితో కలసి రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఉప్పు బస్తాల లోడ్‌తో వస్తున్న లారీని ఆపి తనిఖీలు చేశారు. అందులో ఉప్పు బస్తాల కింద 51.50 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.1.06 కోట్ల వరకు ఉంటుందని సీపీ తెలిపారు. లారీని తాండూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయానికి తరలించామని, పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించగా 29 క్వింటాళ్ల లూజ్ పత్తి విత్తనాలు, కావ్య అనే పేరుగల ప్యాకెట్లు 22.50 క్వింటాళ్లు గుర్తించామని తెలిపారు. -
మళ్లీ నకిలీ వి‘పత్తి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నకిలీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. గ్రామగ్రామాన వరదై పారుతున్నాయి. మాయమాటలతో దళారులు రైతులకు నకిలీలను అంటగడుతున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 8 ప్రాం తాల్లో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు బయటపడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్యాకెట్‌పై కంపెనీ పేరు కూడా లేకుండా పంపిణీ చేస్తుండటంతో బీటీ–2 ఏవో, బీటీ–3 ఏవో కూడా అధికారులకు అంతుబట్టడం లేదు. గుజరాత్, ఏపీల నుంచే గుజరాత్, ఏపీల నుంచే భారీగా నకిలీ విత్తనాలు రాష్ట్రానికి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20 ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొని నకిలీ విత్తన ప్యాకెట్ల తయారు చేస్తున్నారని తేలింది. దీనిపై స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో నకిలీ విత్తనాలు రైతు ముంగిట్లోకి వచ్చేశాయి. ఏరిన పత్తి నుంచి దూదిని వేరు చేసే సమయంలో పత్తి గింజలను ముఠాదారులు సేకరిస్తుంటారు. వాటికి రంగులద్ది ప్యాకెట్లలో నింపి బీటీ–2 విత్తనాలుగా విక్రయిస్తుంటారు. ఒక్కో ప్యాకె ట్‌కు రూ.100 నుంచి రూ.150 ఖర్చు అవుతుంటే రైతులకు రూ.800 నుంచి రూ. 900కు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ప్యాకెట్‌పై స్థానిక వ్యవసాయాధికారులకు రూ.50 వరకు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసుల కూ రూ.25 వరకు ఇస్తున్నట్లు సమాచారం. గతేడాదీ ఇంతే... గత ఖరీఫ్‌లోనూ నకిలీ, అనుమతి లేని విత్తనాలు మార్కెట్లో వరదై పారాయి. నకిలీ విత్తనాలు కంపెనీలు మార్కెట్లోకి వదిలినా చర్యలు తీసుకోని అధికారులు తనిఖీలకే పరిమితమయ్యారని విమర్శలున్నాయి. గత ఖరీఫ్‌లో 47 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. అందుకు కోటి విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా బీటీ–2 పత్తి విత్తనాలకే అనుమతి ఉన్నా వాటిల్లోనూ నకిలీవి వెలుగుచూశాయి. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం రూ. 15.19 కోట్ల విలువైన 2.37 లక్షల నకిలీ విత్తన ప్యాకె ట్లు సీజ్ చేశారు. అనుమతి లేని బీటీ–3 పత్తి విత్తనాలనూ కంపెనీలు అక్రమంగా సరఫరా చేశాయి. 10 లక్షల ఎకరాల్లో బీటీ–3 వేసినట్లు అంచనా. తనిఖీల సమయంలో అధికారులకు కంపెనీలు ముడుపులు చెల్లించి దందా సాగించినట్లు విమర్శలున్నాయి. గతేడాదిలాగే ఈ సారీ తూతూమంత్రంగానే అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 90 లక్షల విత్తన ప్యాకెట్లు సిద్ధం వచ్చే ఖరీఫ్‌కు 90 లక్షల బీజీ–2 పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ఇండెంట్ తీసుకుంది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్లను క్రోడీకరించి ఆ మేరకు విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని కంపెనీలను కోరనుంది. ఈనెల 9న జరగబోయే సమావేశంలో ఏ కంపెనీ ఎన్ని ప్యాకెట్లు సరఫరా చేయాలో ఖరారు చేస్తారు. ఇదిలావుంటే కంపెనీలు కోటిన్నర విత్తన ప్యాకెట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. డిమాండ్‌ను బట్టి సరఫరా చేసేలా ప్రణాళిక రచించాయి. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు భారీగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. రామగుండం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నకిలీ విత్తనాల గుట్టును రట్టు చేశారు. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న 13 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. బుధవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథితో కలసి బెల్లంపల్లి ఏసీపీ వి.బాలుజాదవ్ వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద కొందరు వ్యక్తులు కార్లలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులకు మంగళవారం సాయంత్రం సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో నాలుగు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. నాలుగు కార్లు, ఆటోలో ఉన్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. బెల్లంపల్లికి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ అనే ఫెర్టిలైజర్ షాపు యాజమానికి నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడానికి వచ్చినట్లు వారు తెలిపారని పోలీసు అధికారులు వివరించారు. వీరి వద్ద నుంచి 3.20 క్వింటాళ్ల నకిలీ లూజ్ విత్తనాలు, శ్రీపావని పేరుతో ఉన్న 600 నకిలీ విత్తనాల ప్యాకెట్లు (3 క్వింటాళ్లు), రూ.2.53 లక్షల నగదు, రూ.లక్ష విలువైన చెక్కు, 17 సెల్ఫోన్లు, నాలుగు కార్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాల విలువ మార్కెట్లో రూ.12.48 లక్షలు ఉంటుందని తెలిపారు. -
నకిలీ విత్తుకు నగరమే అడ్డా
► గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు కావ్య పేరుతో నకిలీ విత్తనాలు తరలింపు ► నగరం కేంద్రంగా 3 జిల్లాల్లో విక్రయం ► ముగ్గురి అరెస్టు,రూ.20 లక్షల సరుకు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: నగరం కేంద్రంగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. గుజరాత్లో తయారవు తు న్న వీటిని హైదరాబాద్ నుంచి మూడు జిల్లాల్లో విక్ర యిస్తున్నట్లు గుర్తించారు. డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తు న్న ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు. ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నా మన్నారు. రాజస్తాన్ నుంచి వచ్చి నగరంలో దందా... రాజస్తాన్‌కు చెందిన భరత్ పటేల్ సికింద్రాబాద్‌లోని హైదర్‌బస్తీలో ‘మహావీర్ ట్రేడర్స్’ పేరుతో సంస్థ ఏర్పాటు చేశాడు. 6 నెలలుగా గుజరాత్ నుంచి ‘కావ్య’ బ్రాండ్ పేరుతో ఉన్న నకిలీ పత్తి విత్తనాలను తీసుకువస్తున్నాడు. గాంధీనగర్ బన్సీలాల్‌పేటలో ఓ గోదాము ఏర్పాటు చేసి.. గుజరాత్‌కు చెందిన పటేల్ అమిత్‌కుమార్ చంద్రకాంత్, హార్ధిక్ పటేల్, వినయ్ ఆర్.షాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. వ్యవసాయ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా ‘కావ్య’ బ్రాండ్ పత్తి విత్తనాలను వీరు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని దుకాణాల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరతో రైతులకు ఎర... 450 గ్రాముల బరువుతో ఉన్న ఆకర్షణీయమైన ప్యాకె ట్లు, విడిగా కేజీల లెక్కన విత్తనాలు అమ్ముతున్నారు. ఈ ప్యాకెట్లపై ధర, తయారీ తేదీ తదితర వివరాలేవీ లేవు. ప్రభుత్వ సబ్సిడీ పత్తి విత్తనాల ధర 450 గ్రాములు రూ.800 వరకు ఉండగా.. రూ.200 నుంచి రూ.250కు వీరు అమ్ము తున్నారు. ముగ్గురి అరెస్టు.. : దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య బృందం వ్యవసాయ శాఖ అధికా రులతో కలిసి దాడి చేసి భరత్ పటేల్ మినహా మిగిలిన ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన 1,250 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ వేరే విత్తనాలు నాటాల్సి వచ్చిందని కరీంనగర్ రైతులు వాపోయారు. బీఎన్‌రెడ్డినగర్‌లో మరొకరి అరెస్టు.. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డినగర్‌లో వివిధ రకాల నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఎంఈ శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఇతడు బీఎన్‌రెడ్డినగర్, ఎస్కేటీనగర్లలో కార్యాల యాలు ఏర్పాటు చేసుకుని వివిధ కంపెనీలకు చెందిన కూరగాయలు, పత్తి తదితర విత్తనాలను అనుమతి లేకుండా మిక్సింగ్, ప్రాసెసింగ్ చేస్తూ విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో గురు వారం అతడిని అరెస్టు చేసి, రూ.27.86 లక్షల విలువైన నకిలీ విత్తనాల బ్యాగ్‌లు, మిక్సింగ్, ప్రాసెసింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి నట్టు చెప్పారు. గత నెలలో అత్తాపూర్ ఏజీ కాలనీలో అగ్రిబయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దందా నిర్వహిస్తున్న శివారెడ్డిని శంషా బాద్ పోలీసులు అరెస్టు చేశారని, బయటకొచ్చిన తరువాత మకాం మార్చి మళ్లీ నకిలీ విత్తనాల వ్యాపారం మొదలుపెట్టాడని వెల్లడించారు. -
నకిలీ కలకలం
► గతేడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్న ► ఈ ఏడాది మళ్లీ పట్టుబడుతున్నరూ.కోట్ల విలువైన విత్తనాలు ► తాజాగా గుంటూరులో పత్తి విత్తనాల స్వాధీనం ► ఇప్పటికైనా సర్కారు కళ్లు తెరిచేనా? నకిలీ విత్తనాలు రైతుల్లో కలవరం రేపుతున్నాయి. జిల్లాలో వరుసగా పట్టుబడుతున్న ఘటనలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది నకిలీ విత్తనాలు సాగు చేసి వేలాది మంది రైతులు ఆర్థికంగా చితికిపోయారు. పంటలకు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో మళ్లీ నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయనే సమాచారం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుంటూరులో 135 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడటం కలకలం రేపింది. సాక్షి, అమరావతి బ్యూరో : ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే జిల్లాలోకి నకిలీ విత్తనాలొచ్చేస్తున్నాయి. ఈ ఏడాదీ అంతే తంతు కొనసాగింది. మరో రెండు వారాల్లో పొలం పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇప్పటికే నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశించాయి. అక్రమార్కులు బస్తాలకొద్దీ నకిలీ పత్తి, మిర్చి విత్తనాలు రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకూ తరలిస్తున్నారు. సాగుకు సిద్ధమవుతున్న రైతన్న... సీజన్‌కు ముందే తెనాలి ప్రాంతంలో మినుము, నరసరావుపేట ఏరియాలో నువ్వుల పంటలు సాగు చేసేందుకు అన్నదాతలు భూములను దుక్కి దున్ని సిద్ధం చేశారు. ప్రధానంగా జూన్ మొదటి వారంలో వర్షాలు కురిస్తే, రెండో వారం నుంచి జిల్లాలో పత్తి పంటను సాగు చేస్తారు. అందుకనుగుణంగా పొలాలను సిద్ధంలో చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు, ఎరువులనూ సమకూర్చుకుంటున్నారు. జూన్ రెండో వారం నుంచి మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి నారు పోసుకుంటారు. నకిలీ విత్తనాల వల్ల గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలు మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయనే సమాచారంతో అన్నదాతలు హడలిపోతున్నారు. వ్యవసాయ శాఖ గట్టి చర్యలు తీసుకోకపోతే మార్కెట్లో నకిలీ విత్తనాలు స్వైరవిహారం ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. వరుసగా ఘటనలు... = గుంటూరులో సోమవారం పట్టాభిపురంలోని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కార్యాలయంలో 135 బీటీ–2 నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి, విజిలెన్స్ ఏవో వెంకట్రావు, గుంటూరు ఏడీ ఎన్.వెంకటేశ్వర్లు, సీడ్స్ ఏవో రమణకుమార్, పట్టాభిపురం సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు శ్రీనివాసరావు, జిలానిబాషా దాడులు చేసి ఈ విత్తనాలను సీజ్ చేశారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి బుక్ చేసినట్లు తెలిసింది. బీటీ–2 పత్తి విత్తనాల ప్యాకెట్ 450 గ్రాములు ఉంటుంది. ఈ విత్తనాలు పాలిథీన్ కవర్లో ఎటువంటి లేబుల్ లేకుండా 850 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. = మే 13న ఆటోనగర్‌లో అక్రమంగా నిల్వ చేసిన రూ.4.63 కోట్ల విలువైన 59 వేల బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్లు విజిలెన్స్ అధికారుల దాడుల్లో పట్టుబడ్డాయి. = ఈ ఏడాది ఫిబ్రవరిలో శాంభవి కోల్డ్ స్టోరేజీలో గడువు తీరిన మిర్చి విత్తనాలు దొరికాయి. శేషసాయి కోల్డ్‌స్టోరేజీలో ఓ రైతు పేరుతో 13,500 కిలోల విత్తనాలను నిల్వ చేసి ఉండగా గుర్తించారు. = మార్చి నెలలో బెంగళూరు నుంచి గుంటూరుకు తరలిస్తున్న 52 కిలోల మిర్చి విత్తనాలను వ్యవసాయాధికారులు పట్టుకొన్నారు. = ఏప్రిల్‌లో అటోనగర్లోనే రూ.67 లక్షల విలువైన నిర్మల సీడ్స్ విత్తనాలు దొరికాయి. ఈ కంపెనీకి లైసెన్సు గడువు ముగిసినట్లు సమాచారం. ఇలా వరుసగా నకిలీ, అనధికార విత్తనాలు పట్టుబడుతుండటంతో అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు. అందని పరిహారం.. కోర్టుకెళుతున్న కంపెనీలు.. గత ఏడాది నకిలీ పత్తి, మిరప విత్తనాలతో రైతులు నిండా మునిగారు. చిలకలూరిపేట, అచ్చంపేటలో జాదు పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 665 ఎకరాల్లో పంట దెబ్బతిందని, చిలకలూరిపేటలో ఎకరాకు రూ.10,500, అచ్చంపేటలో రూ.9,500 వంతున రూ.66.47 లక్షల పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ విత్తన కంపెనీని ఆదేశించింది. కంపెనీ వారు వర్షాభావ పరిస్థితులు, ఆ ప్రాంతంలో నేలలోని లింట్తో మొక్కలు ఎర్రబారాయని, విత్తనాలలో నాణ్యత బాగానే ఉందని కోర్టుకు నివేదించారు. రైతులకు మాత్రం నష్టపరిహారం అందలేదు. మిరపకు సంబంధించి బ్రహ్మపుత్ర కంపెనీకి చెందిన నకిలీ విత్తనాల వల్ల తాడికొండ, గుంటూరు రూరల్, మేడికొండూరు ప్రాంతాల్లో 2677 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. పంట చేతికొచ్చేదశలో దెబ్బతినడంతో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. 732 మంది రైతులకు ఎకరాకు రూ.36 వేల వంతున రూ.9.63 కోట్ల పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ కంపెనీకి ఆదేశించింది. ఇదే తరహాలో మిర్చిలోనే జీవా కంపెనీకి చెందిన నకిలీ మిర్చి విత్తనాలతో అమరావతి, మేడికొండూరు, పెదకూరపాడు ప్రాంతాల్లో 171 మంది రైతులు నష్టపోయారు. వీరికి రూ.1.84 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. కంపెనీల వారు కోర్టుకెక్కడంతో రైతులకు పరిహారం అందలేదు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన సమయంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హడావిడి చేయడం తప్ప, రైతులకు మాత్రం ఇంతవరకు పరిహారం దక్కలేదు. అప్పట్లో నకిలీలను అడ్డుకుంటామంటూ పాలకులు, అధికారులు ఆర్భాటంగా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక చర్యలు తీసుకున్నాం... నకిలీ విత్తనాలపై నిఘా ఉంచాం. అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. రైతులు లూజు, కంపెనీ ప్యాకింగ్ లేని విత్తనాలు తీసుకోవద్దు. పత్తి, మిరప విత్తనాలు మార్కెట్లో డిమాండ్‌కు సరిపడే విధంగా సరఫరా చేస్తామని కంపెనీలు ఇప్పటికే తెలిపాయి. – రామలింగయ్య, వ్యవసాయ శాఖ డీడీ, గుంటూరు -
నకిలీ గుట్టు రట్టు
ఖమ్మం వ్యవసాయం : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. ఆరుగాలం కష్టపడి పనిచేసినా వాతావరణం అనుకూలించక.. పెట్టుబడులు కూడా రాక అష్టకష్టాలు పడుతున్న రైతులను నకిలీ విత్తనాలతో నిలువునా మోసం చేస్తున్న వైనం బట్టబయలయింది. ఈ విత్తనాలను అమ్ముతున్న ఓ డీలర్‌ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి...కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగు(సిద్ధిక్‌నగర్)కు చెందిన సత్తెనపల్లి లక్ష్మణాచారి గతంలో ఒడిషాలోని మల్కాన్‌గిరి బేయర్ కంపెనీలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. కర్ణాటకలోని గజేంద్ర సీడ్స్, చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలోని ఆధార్ సీడ్స్ కంపెనీలో మూడేళ్లు పనిచేశారు. అనంతరం ఉద్యోగం వదిలి అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే దురాశతో ఆయన సోదరుడు పవన్‌కుమార్ సహకారంతో నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. రైతులు అధికంగా కొనుగోలు చేసే అజిత్ సీడ్స్‌ను పోలిన నకిలీ విత్తనాలు తయారు చేసి సుమారు 300 ప్యాకెట్లు జిల్లాకు తీసుకొచ్చాడు. అందులో 100 ప్యాకెట్లు ఖమ్మం అర్బన్ మండలం పాపటపల్లిలోని శ్రీవెంకటేశ్వర పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ యజమాని బానోతు నరేష్‌కు అందించాడు. మిగిలిన 200 ప్యాకెట్లను లక్ష్మణాచారి సోదరుడు పవన్‌కుమార్, ఆయన బంధువు మాధవాచారి కలిసి కొణిజర్ల, ఏన్కూరు, కామేపల్లి మండలాల్లో విక్రయించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారం తెలుసుకున్న ఖమ్మం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం వ్యవసాయశాఖాధికారులతో కలిసి పాపటపల్లిలోని శ్రీవెంకటేశ్వర పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాపుపై దాడిచేసి 48 అజిత్ 155 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 52 ప్యాకెట్లను రైతులకు ఒక్కో ప్యాకెట్ రూ.900 చొప్పున అమ్మినట్లు అధికారులు గుర్తించారు. షాపు యజమాని బానోతు నరేష్, పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. కాగా, లక్ష్మణాచారి, మాధవాచారి పరారీలో ఉన్నారు. పట్టుబడిన ప్యాకెట్లను ఖమ్మం ఏడీఏ కార్యాలయానికి తరలించారు. వాటిని ఖమ్మం అర్బన్ వ్యవసాయాధికారి కె.అరుణకు అప్పగించి పంచనామా చేయించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ వెంకటేష్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని, దీనివల్ల రైతులు డబ్బులతోపాటు సంవత్సరకాలం పంటను కూడా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అమ్మితే షాపును సీజ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 48 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 252 ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఆ పత్తి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు తొందరపడి నాటవద్దని సూచించారు. ఈ దాడిలో విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ నారాయణరెడ్డి, ఏవో కె.అరుణ తదితరులు పాల్గొన్నారు.