సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నకిలీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. అధికారుల దాడుల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ నకిలీ, కల్తీ విత్తనాలు వెలుగుచూస్తున్నాయి. అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాలూ దొరుకుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, విత్తన ప్రాసెసింగ్ కంపెనీలపై నిఘా లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఆ యూనిట్లపై సమగ్ర తనిఖీలు చేయకపోవడంతో అడ్డూఅదుపూ లేకుండా నకిలీ, కల్తీ విత్తనాలు రైతులకు చేరుతున్నాయంటున్నారు.
రాష్ట్రంలో 500 ప్రాసెసింగ్ యూనిట్లు
రాష్ట్రంలోని 500 విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో 200 యూనిట్లకు వ్యవసాయ శాఖ, 300 యూనిట్లకు విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ లైసెన్సులిచ్చాయి. వాటిలో 150 వరకు పత్తి విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల వరకు పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, అందులో రాష్ట్రం నుంచే 2 కోట్ల విత్తనాలు సరఫరా అవుతాయి. పత్తి విత్తనాన్ని ఎక్కువగా పాత మహబూబ్‌నగర్ జిల్లాలోనే సాగు చేస్తారు.
కానీ తాజాగా నకిలీ పత్తి విత్తనాలు వెలుగు చూస్తుండటంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోంది. అనుమతి లేని కల్తీ విత్తనంపై దుమారం చెలరేగుతోంది. దేశవ్యాప్తంగా బీజీ–3 పత్తి విత్తనాలు రాష్ట్రం నుంచే సరఫరా అవుతున్నాయని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సరైన తనిఖీలు లేకే కల్తీ, నకిలీ విత్తనాల ఘటనలు వెలుగు చూస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు.
40 అంశాల ప్రకారం తనిఖీలేవీ?
విత్తనాల ప్రాసెసింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే కల్తీ, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. 500 ప్రాసెసింగ్ యూనిట్లలో తూతూమంత్రంగానే తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. నిబంధనల ప్రకారం 40 అంశాల ఆధారంగా తనిఖీలు చేయాలి. రికార్డులన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలి. అలా చేస్తే ఒక్క కల్తీ, నకిలీ విత్తనం బయటకు రాదని.. కానీ ఇవేవీ చేయకుండానే అధికారులు లాలూచీ పడటంతో నకిలీ, కల్తీ విత్తనం మార్కెట్లోకి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment