సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నకిలీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. గ్రామగ్రామాన వరదై పారుతున్నాయి. మాయమాటలతో దళారులు రైతులకు నకిలీలను అంటగడుతున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 8 ప్రాం తాల్లో నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు బయటపడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్యాకెట్‌పై కంపెనీ పేరు కూడా లేకుండా పంపిణీ చేస్తుండటంతో బీటీ–2 ఏవో, బీటీ–3 ఏవో కూడా అధికారులకు అంతుబట్టడం లేదు.
గుజరాత్, ఏపీల నుంచే
గుజరాత్, ఏపీల నుంచే భారీగా నకిలీ విత్తనాలు రాష్ట్రానికి వస్తున్నాయని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20 ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొని నకిలీ విత్తన ప్యాకెట్ల తయారు చేస్తున్నారని తేలింది. దీనిపై స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో నకిలీ విత్తనాలు రైతు ముంగిట్లోకి వచ్చేశాయి.
ఏరిన పత్తి నుంచి దూదిని వేరు చేసే సమయంలో పత్తి గింజలను ముఠాదారులు సేకరిస్తుంటారు. వాటికి రంగులద్ది ప్యాకెట్లలో నింపి బీటీ–2 విత్తనాలుగా విక్రయిస్తుంటారు. ఒక్కో ప్యాకె ట్‌కు రూ.100 నుంచి రూ.150 ఖర్చు అవుతుంటే రైతులకు రూ.800 నుంచి రూ. 900కు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ప్యాకెట్‌పై స్థానిక వ్యవసాయాధికారులకు రూ.50 వరకు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసుల కూ రూ.25 వరకు ఇస్తున్నట్లు సమాచారం.
గతేడాదీ ఇంతే...
గత ఖరీఫ్‌లోనూ నకిలీ, అనుమతి లేని విత్తనాలు మార్కెట్లో వరదై పారాయి. నకిలీ విత్తనాలు కంపెనీలు మార్కెట్లోకి వదిలినా చర్యలు తీసుకోని అధికారులు తనిఖీలకే పరిమితమయ్యారని విమర్శలున్నాయి. గత ఖరీఫ్‌లో 47 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. అందుకు కోటి విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా బీటీ–2 పత్తి విత్తనాలకే అనుమతి ఉన్నా వాటిల్లోనూ నకిలీవి వెలుగుచూశాయి.
వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం రూ. 15.19 కోట్ల విలువైన 2.37 లక్షల నకిలీ విత్తన ప్యాకె ట్లు సీజ్ చేశారు. అనుమతి లేని బీటీ–3 పత్తి విత్తనాలనూ కంపెనీలు అక్రమంగా సరఫరా చేశాయి. 10 లక్షల ఎకరాల్లో బీటీ–3 వేసినట్లు అంచనా. తనిఖీల సమయంలో అధికారులకు కంపెనీలు ముడుపులు చెల్లించి దందా సాగించినట్లు విమర్శలున్నాయి. గతేడాదిలాగే ఈ సారీ తూతూమంత్రంగానే అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
90 లక్షల విత్తన ప్యాకెట్లు సిద్ధం
వచ్చే ఖరీఫ్‌కు 90 లక్షల బీజీ–2 పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ఇండెంట్ తీసుకుంది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్లను క్రోడీకరించి ఆ మేరకు విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని కంపెనీలను కోరనుంది. ఈనెల 9న జరగబోయే సమావేశంలో ఏ కంపెనీ ఎన్ని ప్యాకెట్లు సరఫరా చేయాలో ఖరారు చేస్తారు. ఇదిలావుంటే కంపెనీలు కోటిన్నర విత్తన ప్యాకెట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. డిమాండ్‌ను బట్టి సరఫరా చేసేలా ప్రణాళిక రచించాయి.
Comments
Please login to add a commentAdd a comment