పట్టుకున్న నకిలీ విత్తనాల ప్యాకెట్లు ఇవే..
చింతలమానెపల్లి(సిర్పూర్): చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పోలీసులు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నకిలీ విత్తనాలను తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన బోర్‌కుట్ ఓంకార్, జునుగరి శంకర్ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు విచారించగా కావ్య బీటీ పేరుతో ఉన్న 91 ప్యాకెట్ల బీటీ 3 (గ్‌లైసిల్) పత్తి విత్తనాల ప్యాకెట్లు వారి వద్ద లభించాయి.
అదుపులోకి తీసుకున్న ఓంకార్, శంకర్‌ను పోలీసులు విచారించగా వీటిని కౌటాల మండల కేంద్రం నుంచి తీసుకువస్తున్నట్లు తెలిపారు. వీరు అందించిన సమాచారం మేరకు కౌటాలకు చెందిన రమేశ్‌గౌడ్ మారక్‌వార్, ఎల్ములే తులసీరాంను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న విత్తనాల ధర సుమారుగా రూ. లక్ష ఉంటుందని, వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యవసాయ అధికారి రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment