నకిలీ కలకలం
► గతేడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతన్న
► ఈ ఏడాది మళ్లీ పట్టుబడుతున్నరూ.కోట్ల విలువైన విత్తనాలు
► తాజాగా గుంటూరులో పత్తి విత్తనాల స్వాధీనం
► ఇప్పటికైనా సర్కారు కళ్లు తెరిచేనా?
నకిలీ విత్తనాలు రైతుల్లో కలవరం రేపుతున్నాయి. జిల్లాలో వరుసగా పట్టుబడుతున్న ఘటనలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది నకిలీ విత్తనాలు సాగు చేసి వేలాది మంది రైతులు ఆర్థికంగా చితికిపోయారు. పంటలకు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితుల్లో మళ్లీ నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయనే సమాచారం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుంటూరులో 135 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడటం కలకలం రేపింది.
సాక్షి, అమరావతి బ్యూరో : ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే జిల్లాలోకి నకిలీ విత్తనాలొచ్చేస్తున్నాయి. ఈ ఏడాదీ అంతే తంతు కొనసాగింది. మరో రెండు వారాల్లో పొలం పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇప్పటికే నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి ప్రవేశించాయి. అక్రమార్కులు బస్తాలకొద్దీ నకిలీ పత్తి, మిర్చి విత్తనాలు రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకూ తరలిస్తున్నారు.
సాగుకు సిద్ధమవుతున్న రైతన్న...
సీజన్‌కు ముందే తెనాలి ప్రాంతంలో మినుము, నరసరావుపేట ఏరియాలో నువ్వుల పంటలు సాగు చేసేందుకు అన్నదాతలు భూములను దుక్కి దున్ని సిద్ధం చేశారు. ప్రధానంగా జూన్ మొదటి వారంలో వర్షాలు కురిస్తే, రెండో వారం నుంచి జిల్లాలో పత్తి పంటను సాగు చేస్తారు. అందుకనుగుణంగా పొలాలను సిద్ధంలో చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు, ఎరువులనూ సమకూర్చుకుంటున్నారు. జూన్ రెండో వారం నుంచి మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి నారు పోసుకుంటారు. నకిలీ విత్తనాల వల్ల గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలు మళ్లీ మార్కెట్‌లోకి వస్తున్నాయనే సమాచారంతో అన్నదాతలు హడలిపోతున్నారు. వ్యవసాయ శాఖ గట్టి చర్యలు తీసుకోకపోతే మార్కెట్‌లో నకిలీ విత్తనాలు స్వైరవిహారం ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.
వరుసగా ఘటనలు...
= గుంటూరులో సోమవారం పట్టాభిపురంలోని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కార్యాలయంలో 135 బీటీ–2 నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి, విజిలెన్స్ ఏవో వెంకట్రావు, గుంటూరు ఏడీ ఎన్.వెంకటేశ్వర్లు, సీడ్స్ ఏవో రమణకుమార్, పట్టాభిపురం సీఐ కోటేశ్వరరావు, ఎస్సైలు శ్రీనివాసరావు, జిలానిబాషా దాడులు చేసి ఈ విత్తనాలను సీజ్ చేశారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి బుక్ చేసినట్లు తెలిసింది. బీటీ–2 పత్తి విత్తనాల ప్యాకెట్ 450 గ్రాములు ఉంటుంది. ఈ విత్తనాలు పాలిథీన్ కవర్‌లో ఎటువంటి లేబుల్ లేకుండా 850 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు.
= మే 13న ఆటోనగర్‌లో అక్రమంగా నిల్వ చేసిన రూ.4.63 కోట్ల విలువైన 59 వేల బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్లు విజిలెన్స్ అధికారుల దాడుల్లో పట్టుబడ్డాయి.
= ఈ ఏడాది ఫిబ్రవరిలో శాంభవి కోల్డ్ స్టోరేజీలో గడువు తీరిన మిర్చి విత్తనాలు దొరికాయి. శేషసాయి కోల్డ్‌స్టోరేజీలో ఓ రైతు పేరుతో 13,500 కిలోల విత్తనాలను నిల్వ చేసి ఉండగా గుర్తించారు.
= మార్చి నెలలో బెంగళూరు నుంచి గుంటూరుకు తరలిస్తున్న 52 కిలోల మిర్చి విత్తనాలను వ్యవసాయాధికారులు పట్టుకొన్నారు.
= ఏప్రిల్‌లో అటోనగర్‌లోనే రూ.67 లక్షల విలువైన నిర్మల సీడ్స్ విత్తనాలు దొరికాయి. ఈ కంపెనీకి లైసెన్సు గడువు ముగిసినట్లు సమాచారం.
ఇలా వరుసగా నకిలీ, అనధికార విత్తనాలు పట్టుబడుతుండటంతో అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు.
అందని పరిహారం.. కోర్టుకెళుతున్న కంపెనీలు..
గత ఏడాది నకిలీ పత్తి, మిరప విత్తనాలతో రైతులు నిండా మునిగారు. చిలకలూరిపేట, అచ్చంపేటలో జాదు పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 665 ఎకరాల్లో పంట దెబ్బతిందని, చిలకలూరిపేటలో ఎకరాకు రూ.10,500, అచ్చంపేటలో రూ.9,500 వంతున రూ.66.47 లక్షల పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ విత్తన కంపెనీని ఆదేశించింది. కంపెనీ వారు వర్షాభావ పరిస్థితులు, ఆ ప్రాంతంలో నేలలోని లింట్‌తో మొక్కలు ఎర్రబారాయని, విత్తనాలలో నాణ్యత బాగానే ఉందని కోర్టుకు నివేదించారు. రైతులకు మాత్రం నష్టపరిహారం అందలేదు. మిరపకు సంబంధించి బ్రహ్మపుత్ర కంపెనీకి చెందిన నకిలీ విత్తనాల వల్ల తాడికొండ, గుంటూరు రూరల్, మేడికొండూరు ప్రాంతాల్లో 2677 ఎకరాల్లో రైతులు నష్టపోయారు.
పంట చేతికొచ్చేదశలో దెబ్బతినడంతో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. 732 మంది రైతులకు ఎకరాకు రూ.36 వేల వంతున రూ.9.63 కోట్ల పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ కంపెనీకి ఆదేశించింది. ఇదే తరహాలో మిర్చిలోనే జీవా కంపెనీకి చెందిన నకిలీ మిర్చి విత్తనాలతో అమరావతి, మేడికొండూరు, పెదకూరపాడు ప్రాంతాల్లో 171 మంది రైతులు నష్టపోయారు. వీరికి రూ.1.84 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. కంపెనీల వారు కోర్టుకెక్కడంతో రైతులకు పరిహారం అందలేదు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన సమయంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హడావిడి చేయడం తప్ప, రైతులకు మాత్రం ఇంతవరకు పరిహారం దక్కలేదు. అప్పట్లో నకిలీలను అడ్డుకుంటామంటూ పాలకులు, అధికారులు ఆర్భాటంగా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు.
ప్రత్యేక చర్యలు తీసుకున్నాం...
నకిలీ విత్తనాలపై నిఘా ఉంచాం. అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. రైతులు లూజు, కంపెనీ ప్యాకింగ్ లేని విత్తనాలు తీసుకోవద్దు. పత్తి, మిరప విత్తనాలు మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడే విధంగా సరఫరా చేస్తామని కంపెనీలు ఇప్పటికే తెలిపాయి. – రామలింగయ్య, వ్యవసాయ శాఖ డీడీ, గుంటూరు