నకిలీ గుట్టు రట్టు
ఖమ్మం వ్యవసాయం : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. ఆరుగాలం కష్టపడి పనిచేసినా వాతావరణం అనుకూలించక.. పెట్టుబడులు కూడా రాక అష్టకష్టాలు పడుతున్న రైతులను నకిలీ విత్తనాలతో నిలువునా మోసం చేస్తున్న వైనం బట్టబయలయింది. ఈ విత్తనాలను అమ్ముతున్న ఓ డీలర్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి...కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగు(సిద్ధిక్‌నగర్)కు చెందిన సత్తెనపల్లి లక్ష్మణాచారి గతంలో ఒడిషాలోని మల్కాన్‌గిరి బేయర్ కంపెనీలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. కర్ణాటకలోని గజేంద్ర సీడ్స్, చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలోని ఆధార్ సీడ్స్ కంపెనీలో మూడేళ్లు పనిచేశారు.
అనంతరం ఉద్యోగం వదిలి అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే దురాశతో ఆయన సోదరుడు పవన్‌కుమార్ సహకారంతో నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. రైతులు అధికంగా కొనుగోలు చేసే అజిత్ సీడ్స్‌ను పోలిన నకిలీ విత్తనాలు తయారు చేసి సుమారు 300 ప్యాకెట్లు జిల్లాకు తీసుకొచ్చాడు. అందులో 100 ప్యాకెట్లు ఖమ్మం అర్బన్ మండలం పాపటపల్లిలోని శ్రీవెంకటేశ్వర పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ యజమాని బానోతు నరేష్‌కు అందించాడు. మిగిలిన 200 ప్యాకెట్లను లక్ష్మణాచారి సోదరుడు పవన్‌కుమార్, ఆయన బంధువు మాధవాచారి కలిసి కొణిజర్ల, ఏన్కూరు, కామేపల్లి మండలాల్లో విక్రయించారు.
నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారం తెలుసుకున్న ఖమ్మం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం వ్యవసాయశాఖాధికారులతో కలిసి పాపటపల్లిలోని శ్రీవెంకటేశ్వర పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాపుపై దాడిచేసి 48 అజిత్ 155 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్‌లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 52 ప్యాకెట్లను రైతులకు ఒక్కో ప్యాకెట్ రూ.900 చొప్పున అమ్మినట్లు అధికారులు గుర్తించారు. షాపు యజమాని బానోతు నరేష్, పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
కాగా, లక్ష్మణాచారి, మాధవాచారి పరారీలో ఉన్నారు. పట్టుబడిన ప్యాకెట్‌లను ఖమ్మం ఏడీఏ కార్యాలయానికి తరలించారు. వాటిని ఖమ్మం అర్బన్ వ్యవసాయాధికారి కె.అరుణకు అప్పగించి పంచనామా చేయించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ వెంకటేష్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని, దీనివల్ల రైతులు డబ్బులతోపాటు సంవత్సరకాలం పంటను కూడా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అమ్మితే షాపును సీజ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 48 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 252 ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఆ పత్తి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు తొందరపడి నాటవద్దని సూచించారు. ఈ దాడిలో విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ నారాయణరెడ్డి, ఏవో కె.అరుణ తదితరులు పాల్గొన్నారు.