ప్రపంచవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం ఇండియా అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ), డీలర్ల మధ్య మార్జిన్‌లకు సంబంధించి ప్రభుత్వం చర్చలను ప్రోత్సహిస్తోందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు. అందుకు భిన్నంగా ప్రధాని తీసుకున్న సాహసోపేత, దూరదృష్టి నిర్ణయాల వల్ల భారత్‌లో వీటి ధరలు తగ్గుతున్నాయి. నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2024 మధ్యకాలంలో దేశంలో పెట్రోల్ ధరలు 13.65 శాతం, డీజిల్ ధరలు 10.97 శాతం తగ్గాయి. ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్‌లో 22.19 శాతం, జర్మనీలో 15.28 శాతం, ఇటలీలో 14.82 శాతం, స్పెయిన్‌లో 16.58 శాతం పెట్రోల్ ధర పెరిగింది. యూపీఏ ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్ల విలువైన ఫ్లోటింగ్ ఆయిల్ బాండ్లను(పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల ఓఎంసీ నష్టాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన బాండ్లు) జారీ చేసింది. దానికోసం ప్రస్తుతం రూ.3.5 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సి వస్తోంది’ అని మంత్రి వివరించారు.
డీలర్ల మార్జిన్ పెరుగుదలపై మంత్రి స్పందిస్తూ..‘ఇది ఓఎంసీలు, డీలర్లు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం. జులై 1, 2024 నాటికి దేశంలో 90,639 అయిల్ రిటైల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందినవి. చివరిసారిగా 2017లో డీలర్ల మార్జిన్లు పెరిగాయి. ఇటీవల నిర్దేశించిన మార్గదర్శకాల్లోని కొన్ని షరతులు కొంత కఠినంగా ఉన్నాయని డీలర్లు కోర్టుకు వెళ్లారు. డీలర్ల మార్జిన్లు పెంచితే వారి ఉద్యోగులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు పెంచాల్సి ఉంటుంది. దీన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నిబంధనలు సడలించి ఓఎంసీలు మార్జిన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి మధ్య చర్చలు సాగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అన్నారు.
ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’
పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గతంలో ఏర్పాటు చేసిన అపూర్వ చంద్ర కమిటీ నివేదికలోని వివరాల ప్రకారం.. డీలర్ల మార్జిన్ రివిజన్ సిఫార్సులను ఓఎంసీలు నిలుపుదల చేస్తున్నాయి. వీటిని ఏటా జనవరి, జులైలో రెండుసార్లు సవరించాలి. ఈమేరకు ఓఎంసీలు, డీలర్ల మధ్య నవంబర్ 4, 2016న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా, గత ఏడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా ఎలాంటి మార్జిన్లు పెంచలేదని డీలర్లు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment