
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై విరిగిపడిన విద్యుత్ స్తంభం
రాజాపూర్/మాగనూర్/కల్వకుర్తి రూరల్/సూర్యాపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతిచెందగా సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలుల తీవ్రతకు భారీ స్థాయిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం మర్రిబాయితండాకు చెందిన శత్రునాయక్ (60) ఆదివారం సాయంత్రం శివారులోని తన పొలంలో ఉండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగుపడి ఆయన మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మాగనూర్‌లోని కొత్త రైల్వేస్టేషన్ సమీపంలో కుర్వ పరమేశ్ అలియాస్ లింగప్ప (20) గొర్రెలను మేపుతుండగా పిడుగు పడటంతో మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం కురుమిద్దకు చెందిన సాంబశివ (8) తల్లిదండ్రులతో కలసి పొలం వద్దకు వెళ్లగా పిడుగు పడి అక్కడికక్కడే చనిపోయాడు.
మరోవైపు సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), నూతనకల్, మద్దిరాల, మోతె మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వీచిన ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు తీగలు తెగిపోయాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. జిల్లా కేంద్రంలో హోర్డింగులు నేలకూలాయి. చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్‌లో చెట్టు విరిగి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంపై పడింది. పలు గ్రామాల్లో మామిడి, నిమ్మ, సపోట తోటల్లో కాయలు నేలరాలాయి. నూతనకల్‌లో వడగండ్ల వర్షం కురిసింది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సుమారు వందవరకు విద్యుత్ స్తంభాలు కూలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment