కొబ్బరిచెట్టుపై పిడుగుపడి నిప్పంటుకున్న బాణసంచా
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
ఉండ్రాజవరం/సాక్షి, అమరావతి: దీపావళి పండుగ వారి జీవితాల్లో అమావాస్యను మిగిల్చింది. కూటికోసం కూలికొచ్చిన ఇద్దరు మహిళల్ని పిడుగుపాటు సజీవదహనం చేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు వారిని కాల్చేశాయి. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపాలెంలో జనావాసాలకు దూరంగా వేగిరోతు రామశివాజీ ఆధ్వర్యంలో సాయి ఫైర్‌వర్క్స్ పేరిట దీపావళి బాణసంచా తయారీ కేంద్రం కొనసాగుతోంది.
తణుకు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, పురుషులు ఇక్కడ పనిచేస్తున్నారు. గురువారం దీపావళి నేపథ్యంలో బాణసంచా తయారీ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం ఆ కేంద్రం సమీపంలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. ఆ నిప్పురవ్వలు బాణసంచా తయారీ కేంద్రం మీద పడ్డాయి. బాణసంచా అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న వేగిరౌతు శ్రీవల్లి (50), గుమ్మడి సునీత (35) సజీవంగా కాలిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయి.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సూర్యారావుపాలెంలో పిడుగుపాటుతో బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయపడిన వారికి తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment