fireworks factory
-
బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మహిళలు సజీవదహనం
ఉండ్రాజవరం/సాక్షి, అమరావతి: దీపావళి పండుగ వారి జీవితాల్లో అమావాస్యను మిగిల్చింది. కూటికోసం కూలికొచ్చిన ఇద్దరు మహిళల్ని పిడుగుపాటు సజీవదహనం చేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు వారిని కాల్చేశాయి. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపాలెంలో జనావాసాలకు దూరంగా వేగిరోతు రామశివాజీ ఆధ్వర్యంలో సాయి ఫైర్వర్క్స్ పేరిట దీపావళి బాణసంచా తయారీ కేంద్రం కొనసాగుతోంది. తణుకు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, పురుషులు ఇక్కడ పనిచేస్తున్నారు. గురువారం దీపావళి నేపథ్యంలో బాణసంచా తయారీ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం ఆ కేంద్రం సమీపంలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. ఆ నిప్పురవ్వలు బాణసంచా తయారీ కేంద్రం మీద పడ్డాయి. బాణసంచా అంటుకుని మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న వేగిరౌతు శ్రీవల్లి (50), గుమ్మడి సునీత (35) సజీవంగా కాలిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయి. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సూర్యారావుపాలెంలో పిడుగుపాటుతో బాణసంచా తయారీ కేంద్రంలో ఇద్దరు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయపడిన వారికి తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. -
అమలాపురంలో విస్ఫోటం
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని నల్ల వంతెన సమీపాన రావులచెరువు ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో విస్ఫోటం సంభవించింది. డాబా ఇల్లు నేల కూలి తునాతునాకలైంది. మొత్తం 14 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... రావులచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న గొవ్వాల నాగేశ్వరరావుకు చెందిన డాబా ఇంట్లో ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇల్లు పూర్తిగా ధ్వంసమై నేలకూలిపోయింది. ఇరుగు పొరుగున ఉన్న నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి నాగేశ్వరరావు ఇంట్లో ఉన్న నలుగురు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వారితోపాటు సమీపంలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రెండు బైక్‌లు కూడా ఎగిరి కింద పడి కాలిపోయాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన ఇంట్లో అప్పుడప్పుడూ బాణసంచా తయారు చేస్తారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ బి.కృష్ణారావు పరిశీలించారు. బాణసంచా పేలుడు వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎస్పీ తెలిపారు. విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపిస్తున్నామని, వారి నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో జి.కేశవవర్ధనరెడ్డి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. -
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
చెన్నై: భారతదేశంలో ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శివకాశీ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.విరుదునగర్ జిల్లా శివకాశీలోని చెంగమాల పట్టిలో శరవణన్ అనే వ్యక్తికి చెందిన 'శ్రీ సుదర్శన్' క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచాలో మందు నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మంది మహిళలతో సహా 8 మంది మరణించారు. మరో 12మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి బాణాసంచా ఫ్యాక్టరీలోని 6కు పైగా గదులు కూలిపోయాయి.ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. అయితే ఈ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం ఏమిటనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.#WATCH | Explosion occurs in a firecracker manufacturing unit in Tamil Nadu's Virudhunagar; details awaited pic.twitter.com/cALcg6A9Ow— ANI (@ANI) February 17, 2024 -
థాయ్‌లాండ్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని సుప్రాన్ బురీ ప్రావిన్స్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కారి్మకుల మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఘటన జరిగినపుడు ఫ్యాక్టరీలో దాదాపు 30 మంది కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం వరిపొలాలకు పెట్టిందిపేరు. పచ్చని పొలాల మధ్య బుధవారం మధ్యాహ్నంవేళ దట్టమైన నల్లని పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌చేసింది. చైనీయుల నూతన సంవత్సరం వచ్చే నెలలో థాయిలాండ్‌లోనూ ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాణసంచాకు భారీగా డిమాండ్ పెరగడంతో పెద్దమొత్తంలో బాణసంచాను హడావుడిగా తయారుచేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
టపాసుల దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
హోసూరు (తమిళనాడు): హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై తమిళనాడు సరిహద్దులో ఉన్న అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలతో సహా పలు వాహనాలు బూడిదయ్యాయి. 12 మంది కార్మికులు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం నవీన్ అనే వ్యక్తికి చెందిన టపాసుల గోదాములోకి లారీల్లో వచ్చిన స్టాక్‌ను 20 మందికి పైగా సిబ్బంది అన్లోడ్ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా ధాటికి చెలరేగిన మంటలు పక్క పక్కనే ఉన్న దుకాణాలకు, వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన బాణాసంచాతో పాటుగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. దుకాణ యజమాని సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండులారీలతో పాలు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం 12 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా తమిళనాడు వాసులే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టపాసులను అన్లోడ్ చేసే సమయంలో విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది దుర్మరణం
బరాసత్: పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం ఉదయం బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 8 మంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. దుత్తపుకుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీల్‌గుంజ్‌లోని కర్మాగారంలో ఘటన జరిగిన సమయంలో పలువురు సిబ్బంది పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కలున్న 50 నివాసాలు దెబ్బతిన్నాయని పోలీసు అధికారులు వివరించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కర్మాగారం యజమాని కొడుకు కూడా పేలుడులో చనిపోయాడన్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. అక్రమంగా నడుపుతున్న ఈ కర్మాగారంలో బాణాసంచా పేరుతో బాంబులు తయారు చేస్తున్నారా అన్న అనుమానాలకు దర్యాప్తులోనే సమాధానం దొరుకుతుందని చెప్పారు. పేలుడు అనంతరం స్థానికులు కర్మాగారం యజమాని ఇంటిని ధ్వంసం చేశారు. గత మేలో పూర్వ మేదినీపూర్ జిల్లాలోని ఈగ్రాలో బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో 12 మంది చనిపోయారు. -
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం ఎల్లకటవ గ్రామంలో బాణసంచా గోడౌన్ ప్రమాదం ఘటనలో ముగ్గురు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాణా సంచా గోడౌన్లో ప్రమాదంలో మరణించిన వారంతా చాలా పేదవాళ్లని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రోజువారీ కూలీలని సమాచారం తెలుసుకున్న సీఎం.. వెంటనే స్పందించారు. ఆయా కుటుంబాలను ఆదుకునేలా ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే ఎక్స్‌గ్రేషియాను వారి కుటుంబాలకు అందించాలన్నారు. చదవండి: ఏపీలో హై అలర్ట్.. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందే..! -
వేకువజామున భారీ విస్పోటనం.. నలుగురి మృతి.. ఛిద్రమైన..
సాక్షి, చెన్నై(సేలం): నామక్కల్ జిల్లా మోగనూరు శనివారం వేకువజామున బాణసంచా మోతతో దద్దరిల్లింది. ఓ వ్యాపారి ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులకు గ్యాస్ సిలిండర్ల పేలుడు తోడు కావడంతో భారీ విస్పోటనం జరిగింది. ఐదు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నలుగురి శరీరాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. కొన్ని గంటల పాటుగా శ్రమించి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. వివరాలు.. నామక్కల్ జిల్లా మోగనూరుకు చెందిన తిల్లైకుమార్ (35) బాణసంచా వ్యాపారి. ఆయనకు ఓడ పాళయంలో గోడౌన్ కూడా ఉంది. మోగనూరు మేట్టు వీధిలోని నివాసంలో భార్య ప్రియాంక(30), కుమార్తె సజనీ(4), తల్లి సెల్వి(55)తో తిల్లైకుమార్ నివాసం ఉన్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా బాణసంచా వ్యాపారం అధికంగా జరిగే అవకాశం ఉండడంతో శివకాశి నుంచి స్టాక్‌ను శుక్రవారం రాత్రి ఓ మినీ వ్యాన్‌లో మోగనూరుకు తెప్పించాడు. గోడౌన్‌కు తరలించకుండా ఇంటి వద్దే ఓ గదిలో స్టాక్‌ను ఉంచి నిద్రకు ఉపక్రమించాడు. ఉలిక్కి పడ్డ మోగనూరు.. శనివారం వేకువ జామున రెండున్నర గంటల సమయంలో మోగనూరు ఉలిక్కి పడింది. భారీ విస్పోటనం తరహాలో శబ్దాలు రావడంతో జనం నిద్ర నుంచి లేచి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తిల్లైకుమార్ ఇంటి నుంచి మంటలు చెలరేగుతుండడంతో అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. ఈ ఇంటికి పక్క పక్కనే ఉన్న ఇళ్లలోని వారంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. క్షణాల్లో బాణసంచా మోతకు తోడు గ్యాస్ సిలిండర్లు పేలిన శబ్దాలతో స్థానికుల్లో కలవరం బయలు దేరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. 3 గంటల పాటు బాణసంచా మోతతో సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. నాలుగు సిలిండర్లు కూడా.. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అనుమతి లేకుండా ఇంటిలో బాణసంచా ఉంచడంతో పాటు విద్యుత్ స్విచ్ బోర్డుల వద్ద టపాకాయల బాక్సులను ఉంచడంతో విద్యుదాఘాతం ఏర్పడి ఉండవచ్చుననే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న రెండు, పక్కింట్లో ఉన్న మరో రెండు సిలిండర్లు పేలడంతో భారీ విస్పోటనం జరిగినట్లు తేల్చారు. సమాచారం అందుకున్న మంత్రి మందివేందన్, ఎంపీ రాజేష్‌కుమార్, ఎమ్మెల్యే రామలింగం ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రు.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేసియా అందజేశారు. ఛిద్రమైన మృతదేహాలు.. ఈ పేలుడు ధాటికి తిల్లైకుమార్ ఇంటితో పాటు పక్క పక్కనే ఉన్న మరో నాలుగు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇళ్ల ఆనవాళ్లే లేని విధంగా పరిస్థితి మారింది. ఆ ఇంటికి 50 అడుగుల దూరంలో మరో ఇంటి పై కప్పు పై ఛిద్రమైన తిల్లైకుమార్ మృతదేహం బయట పడింది. మంటలకు అతడి భార్య ప్రియాంక, తల్లి సెల్వి సజీవ దహనమయ్యారు. అయితే వీరి ఇంటికి పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉన్న యువకుడు సాహసం చేసి రక్షించడంతో సజినీ గాయాలతో బయట పడింది. మరో ఇంట్లో ఉన్న పెరియక్క(73) ప్రమాద సమయంలో బీరువాలో ఉన్న నగదు కోసం లోనికి వెళ్లి పేలుడు కారణంగా మరణించింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుగా నమోదైంది. పక్క పక్క ఇళ్లల్లో ఉన్న కార్తికేయన్(28) అన్బరసి (25), సెంథిల్(45), పళనియమ్మాల్ (60) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. అలాగే, సుమిత్ర(38), రమేష్ (44), ముత్తులక్ష్మి (60), ప్రియాంక(22) జయమణి (50), సౌందరరాజన్ (50), ధనం (44), షణ్ముగ పెరుమాల్ (40), సజినీతో పాటు ఓ యువకుడు స్వల్పంగా గాయపడ్డారు. -
బాణసంచా పేలి ముగ్గురు మృతి
తాడేపల్లిగూడెం/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మరణించాడు. 80 శాతం గాయాలపాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. గ్రామంలోని రాజం చెరువు సమీపంలో ఉన్న ఈ కేంద్రంలో బాణసంచాను ఓ వాహనంలోకి లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఒక మహిళ వంట చేసుకోవడానికి ఇంటికి వెళ్లడంతో.. అలాగే మరొకతను టిఫిన్ తేవడానికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల శరీర భాగాలు తునాతునకలై చెల్లాచెదురయ్యాయి. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలపాలైన ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యాళ్ల ప్రసాద్(28), అనంతపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి సోలోమన్రాజులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే యాళ్ల ప్రసాద్ చనిపోయాడు. సోలోమన్‌రాజు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరానికి తరలించారు. గూడెం పరిసర ప్రాంతాల్లోని అనంతపల్లి, జగ్గన్నపేట, అల్లంపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఈ బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడానికి వస్తున్నారు. తయారీ కేంద్ర నిర్వాహకుడుగా చెబుతున్న పండూరి అన్నవరం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఘటనా స్థలాన్ని సందర్శించారు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పారు. తాను గడపగడపకు కార్యక్రమంలో ఉండగా సమాచారం తెలిసిందని.. వెంటనే అధికారులను హుటాహుటిన ఘటనాస్థలానికి పంపించి సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. క్షతగాత్రులకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. పరిమితికి మించి బాణసంచాను నిల్వ చేయడమే భారీ పేలుడుకు కారణమైందా అనే కోణంలో కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: ('చంద్రబాబు దోచుకున్న వాటితో పోలిస్తే ఇవి చాలా తక్కువే') -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఐదుగురు మృతి
సాక్షి, తమిళనాడు: మదురైలోని తిరుమంగళం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అగుజైలు గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా,15మందికి గాయపడ్డారు. వీపీఎం బాణాసంచా కర్మాగారంలోని మూడు భవనాల్లో వల్లరసు అనే కార్మికుడితో సహా నలుగురు పురుషులు, ఒక మహిళ పనిచేస్తుండగా ఒక్కసారిగా భవనంలో పటాకులు పేలి మూడు భవనాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో అమ్మాసి, వల్లరసు, గోబి, విక్కీ, ప్రేమ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు -
విషాదం: బాణసంచా పేలి ఆరుగురు మృతి
సాక్షి, చెన్నై: విరుదునగర్ జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలో మూడో ప్రమాదం గురువారం చోటుచేసుకుంది. బాణసంచా పరిశ్రమలోని పది గదులు నేలమట్టం కావడంతో ఆరుగురి మృతదేహాలు బయటపడ్డాయి. పదిహేను మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విరుదునగర్ జిల్లా శివకాశి పరిసరాలు బాణసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వారం రోజుల వ్యవధిలో మూడో ప్రమా దం చోటుచేసుకోవడం కలవరాన్ని రేపుతోంది. అతి పెద్ద ప్రమాదంలో ఇరవై మంది మేరకు మరణించిన సంఘటన మరవకముందే గురువారం సాయంత్రం శివకాశి సమీపంలోని కాలయార్ కురిచ్చిలో తంగరాజ్ పాండియన్‌కు చెందిన బాణసంచా పరిశ్రమలోపేలుడు జరిగింది. సహాయక చర్యలకు ఆటంకం.. నాలుగున్నర గంటల సమయంలో ఇక్కడ పేలుడు సంభవించినట్టు పరిసరవాసులు పేర్కొంటున్నారు. తొలుత ఓ గదిలో పేలుడు క్రమంగా పది గదులపై ప్రభావం చూపించింది. ఈ గదుల్లో ఉన్న కార్మికులను రక్షించ లేని పరిస్థితి. అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నా, బాణసంచాలు పేలుతూనే ఉండడంతో ఆటంకాలు తప్పలేదు. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ముందుకు దూసుకెళ్లారు. గాయాలతో పడి ఉన్న 15 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అలాగే సంఘటనా స్థలంలో ఆరుగురి మృతదేహాలు బయటపడ్డాయి. శిథిలాల కింద మృతదేహాలు ఉండ వచ్చన్న ఆందోళనతో సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పరిశ్రమకు అనుమతి ఉన్నా, పేలుడుకు గల కారణాలపై విచారణ సాగుతోంది. ఈ ప్రమాదంతో ఆ పరిసరాలు దట్టమైన పొగతో నిండాయి. ఇక్కడ ఫ్యాన్సీ రకం బాణసంచాలు తయారు చేస్తున్న దృష్ట్యా, వాటిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. చదవండి: ఆరవై ఏళ్ల వయస్సులో ఇదేం పాడుపని..! ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది... -
మళ్లీ టపాసుల చర్చ
గత కొన్నేళ్లుగా టపాసులు, బాణసంచా వినియోగంపై నియంత్రణ, నిషేధం వంటివి దీపావళి పండగ సమయానికి బాగా చర్చకొస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ, దాని శివారు ప్రాంతాల్లోనూ నాలుగేళ్లుగా పండగకు ముందు విధి, నిషేధాలు అమలవుతున్నాయి. ప్రభుత్వం చొరవ చూపని సందర్భంలో సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని ఉత్తర్వులివ్వడం కూడా ఒకటి రెండు సందర్భాల్లో చోటుచేసుకుంది. అయితే ఈసారి కరోనా వైరస్ మహమ్మారి విసిరిన పంజాతో మరికొన్ని రాష్ట్ర ప్రభు త్వాలు సైతం టపాసులు, బాణసంచా వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి. రాజస్తాన్, ఒడిశా, సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తాము తీసుకోదల్చుకున్న చర్యల్ని ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా నిషేధిస్తే, మరికొన్ని నియంత్రణలు విధించాయి. హరియాణా, మధ్యప్రదేశ్ ‘దిగు మతి చేసుకున్న’ టపాసులు పంపిణీ చేయొద్దని, వాడొద్దని నిషేధం పెట్టాయి. తాజాగా కర్ణాటక కూడా నిషేధించదలచుకున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. దీపావళికి మాత్రమే కాదు... కాళిపూజ, ఛాత్ పూజల్లో కూడా టపాసులు, బాణసంచా వాడరాదని ఉత్తర్వులిచ్చింది. మూడేళ్లక్రితం దీపావళికి టపాసులు వాడరాదని సుప్రీంకోర్టు నిషేధం విధించిన ప్పుడు హిందూ మత సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం హిందువుల ఆచారాలు, సంప్రదా యాల సమయాల్లోనే ఇలాంటివి గుర్తొస్తాయా అని ప్రశ్నించాయి. అసలు టపాసులు, బాణసంచా కాల్చడం ఎప్పటినుంచి దీపావళికి సంప్రదాయమైందో చెప్పడానికి పెద్దగా ఆధారాల్లేవు. చైనాలో 10 లేదా 11వ శతాబ్దంలో తుపాకి మందు కనిపెట్టాక అక్కడినుంచి భారత్, యూరప్‌లకు అది చేరిందని, ఆ తర్వాత చాన్నాళ్లకు టపాసులు వినియోగంలోకొచ్చాయని మహారాష్ట్రకు చెందిన చరిత్రకారుడు పీకే గోడే అభిప్రాయపడ్డారు. కనుక ఆ తర్వాతకాలంలో ఎప్పుడో పండగలకు బాణసంచా, టపాసులు వాడటం మొదలైవుండొచ్చన్నది ఆయన అంచనా. మొగల్ చక్రవర్తి షా జహాన్ కుమారుడు దారా షికో పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అమ్మాయి తరఫువారు బాణసంచాతో స్వాగతం పలుకుతున్నట్టు తెలిపే ఒక పెయింటింగ్ ఢిల్లీ జాతీయ మ్యూజియంలో వుంది. కాలుష్యం పెను సమస్యగా మారిందనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయం వుండదు. దీపావళి పండగ సమయంలో భారీగా టపాసులు, బాణసంచా అధికంగా వుంటుంది కనుక ఆ కాలుష్యం మరిన్ని రెట్లు పెరుగుతుంది. వాయు కాలుష్యంతోపాటు శబ్దకాలుష్యం కూడా ఎక్కువే వుంటుంది. రెండేళ్లక్రితం తొలిసారి సుప్రీంకోర్టు ‘హరిత దీపావళి’ జరుపుకోవాలని సూచించింది. అంటే తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని, బాణసంచాను మాత్రమే ఉత్పత్తి చేయాలని, వాటినే అమ్మాలని తెలిపింది. అలాగే రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే వాటిని కాల్చాలని కూడా పరిమితి విధించింది. అయితే దాన్ని పెద్దగా పాటించినవారు లేరు. దీపావళి రాత్రి మోగిన టపాసులు, ఆ మర్నాడు వెలువడిన కాలుష్యం గణాంకాలు ఆ సంగతిని తెలియజెప్పాయి. ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టపాసుల వాడకాన్ని పూర్తిగా ఆపేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ తీవ్రతనూ, కాలుష్యం వల్ల ఢిల్లీ ఊపిరాడకుండా మారిన వైనాన్ని అందరూ చూశారు గనుక టపాసులకు దూరంగా వుండటం క్షేమదాయకమని చెప్పారు. అయితే మన ప్రభుత్వాలతో సమస్యేమంటే... పండగకు వారం, పదిరోజుల ముందు మాత్రమే వాటికి నిషేధం ఆలోచనమొదలవుతుంది. వాస్తవానికి పండగకు చాలా చాలా ముందుగానే వ్యాపారులు సరుకు కోసం ఆర్డర్లు ఇస్తారు. ఆ తర్వాత వారి నుంచి రిటైల్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. టపాసుల పరిశ్రమలు అధికంగా వుండే తమిళనాడులోని శివకాశి వంటిచోట ఏడాది పొడ వునా వాటి తయారీ ఉంటుంది. ప్రభుత్వాలు ఈ కాలమంతా మౌనంగా వుంటాయి. వాటికి నిజంగానే కాలుష్యంపై ఆందోళన వున్నప్పుడు ప్రక్రియ మొదలైనప్పుడే దాన్ని నియంత్రించే చర్యలు ప్రారం భించాలి. కానీ అది జరగదు. తీరా సరుకంతా రిటైల్ దుకాణాలకు చేరాక పాలకుల ప్రకటనలు ప్రారం భమవుతాయి. న్యాయస్థానాల ఆంక్షలు కూడా అప్పుడే వెలువడతాయి. సహజంగానే అప్పటికే పెట్టు బడి పెట్టిన దుకాణాల వారు ఆ విధినిషేధాలను పట్టించుకోరు. ఇది ఏటా పునరావృతమవుతున్నా పరిస్థితి మారడం లేదు. ఈసారి కరోనా వైరస్ ప్రభావం వల్ల వేరే రాష్ట్రాలు సైతం టపాసులు, బాణసంచా వినియోగాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అవి కూడా పండగ ముంగిట్లో వుండగానే మేల్కొన్నాయి. టపాసులు, బాణసంచా వినియోగం వల్ల భారీ మొత్తంలో రసాయనాలు వాతావరణంలో కలుస్తాయి. ముఖ్యంగా టపాసుల్లోవాడే కార్బన్, సల్ఫర్, కాడ్మియం... వేర్వేరు రంగుల కాంతులు వెదజల్లేందుకు, అవి కాంతిమంతంగా వుండేందుకు తోడ్పడే ఇతర రసాయనాలు ప్రమాదకరమైనవి. ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో ఇలాంటి రసాయనాల వల్ల కలిగే కీడును ఎదుర్కొనగల సామర్థ్యం తక్కువగా వుంటుంది గనుక వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం వుంటుంది. వారిలో శారీరక, మానసిక సమస్యలు మొదలవుతాయి. ఈ రసాయనాలవల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, చూపు మసకబారటం, బధిరత్వం, ఊపిరితిత్తుల వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, కేన్సర్లు, కండరాల బలహీనత, హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వంటివి ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. గర్భస్థ శిశువులకూ, నవజాత శిశువులకూ కూడా అనేక సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మనుషులకే కాదు... జంతువులకూ, మొక్కలకూ కూడా ప్రమాదమేనంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఒక్క దీపా వళి సమయంలో మాత్రమే కాదు... సాధారణ రోజుల్లో సైతం టపాసులు, బాణసంచా వినియోగం తగ్గించడంపై శ్రద్ధ పెట్టాలి. మొత్తంగా అన్ని రకాల కాలుష్యాన్ని అరికట్టడానికి నిరంతర చర్యలుండాలి. అప్పుడు మాత్రమే ప్రజానీకంలో టపాసులు, బాణ సంచా వల్ల కలిగే అనర్థాలపై నిజమైన అవగాహన ఏర్పడుతుంది. -
భారీ పేలుడు ఐదుగురు సజీవ దహనం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించడంతో.. అందులో పనిచేస్తున్న కార్మికుల్లో ఐదురుగు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విరుదునగర్ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. డి.కల్లూపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమ కుటుంబాలపై దేవుడు పగబట్టాడని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
విషాదం: ఏడుగురు దుర్మరణం
చెన్నై: తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. టపాసుల కర్మాగారంలో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యజమాని సహా ఏడుగురు మృతి చెందారు. మరో నలుగు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. మృతులంతా మహిళలే. (చదవండి: ఆయిల్ ట్యాంకర్లో అగ్ని ప్రమాదం) ఈ ఘటన గురించి కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్ మాట్లాడుతూ.. ‘‘కట్టుమన్నార్‌కోలికి సమీపంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉంది. మృతులంతా అక్కడ పనిచేసే వాళ్లే. నాటు బాంబులు తయారు చేస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నాం. పరిమితికి మించి పేలుడు పదార్థాలు వాడినందు వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నాం. లోతుగా దర్యాప్తు చేస్తాం’’అని పేర్కొన్నారు. కాగా కరోనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వివిధ ఫ్యాక్టరీల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరిపేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
టపాసుల తయారీలో పేలుడు
సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నేల టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించి భార్యా భర్తలతోపాటు మరో మహిళ మృతి చెందారు. చిన్నారి స్వల్పంగా గాయపడింది. ఈ సంఘటన చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఎన్టీఆర్ కాలనీలో గాలేటి నాగార్జున (32), భార్య ఆదిలక్ష్మి (28), నాలుగేళ్ల కుమార్తె శృతి, తల్లి పద్మతో కలసి నివాసం ఉంటున్నాడు. ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగించే ఇతను దీపావళి సమయాల్లో రహస్యంగా నేల టపాసులు తయారు చేసి దుకాణదారులకు విక్రయిస్తాడు. ఈ విషయం చుట్టపక్కల వారికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ శబ్దంతో నాగార్జునకు చెందిన సిమెంటు రేకుల పైకప్పు కుప్పకూలింది. ఇంటి పైకప్పు రేకు శకలాలు కాలనీలో రెండు లైన్లు అవతల పడ్డాయి. ఈ సంఘటనలో నాగార్జున, భార్య ఆదిలక్ష్మి, నేల టపాసులు తయారీలో పాల్గొనేందుకు వచ్చిన అదే కాలనీకి చెందిన చెల్లి దివ్య(28) అక్కడికక్కడే మృతి చెందారు. దివ్య మృతదేహం ఛిద్రమైంది. చెల్లి దివ్య కాలు భాగం సమీపంలో ఉన్న పార్కులో ఎగిరి ఫర్లాంగు దూరంలో పడింది. తొలుత ఇంట్లోనే ఉన్న నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుమార్తె నాలుగేళ్ల శృతి కూడా గాయాలపాలైంది. పేలుడు శబ్దానికి బయటకు వచ్చిన స్థానికులు ఇంటి శిథిలాల నుంచి నాగార్జునను, శృతిని బయటకు తీసి పేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగార్జున పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అనంతరం మంగళవారం అర్ధరాత్రి 11.30 గంటలకు నాగార్జున మృతి చెందాడు. ప్రమాద సమయంలో వృద్ధాప్య పెన్షన్ తెచ్చుకొనేందుకు బయటకు వెళ్లిన నాగార్జున తల్లి పద్మ ప్రాణాలతో బయట పడింది. మరో వైపు కూలికి వచ్చి ఈ ప్రమాదంలో మృతి చెందిన చెల్లి దివ్య భర్త రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తాడు. ఆమెకు తొమ్మిదేళ్ల మిన్ను, ఎనిమిదేళ్ల హన్య అనే కుమార్తెలు ఉన్నారు. నాగార్జునతోపాటు ఆయన తల్లి పద్మ చెప్పిన మాటల ప్రకారం తొలత అంతా గ్యాస్ సిలిండర్ పేలిందనుకున్నారు. అయితే పేలుడు ఆనవాళ్లు తప్పించి ఎలాంటి మంటలు చెలరేగకపోవటంతో పోలీసు విచారణలో బాణసంచా సామగ్రి కారణంగా పేలుడు జరిగినట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణం నాగార్జున ఇంట్లో సూరే కారం, భాస్వరం ఆనవాళ్లు లభించాయి. నాగార్జునకు గతంలో బాణసంచా తయారీ కంపెనీలో పని చేసిన అనుభవం ఉందని పోలీసులు నిర్ధారించారు. సూరేకారం మిక్సీలో వేయడంతో పేలుళ్లు సంభవించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఇంటితోపాటు సమీపంలోని కుమ్మరకాలనీలో ఓ ఇంటిలో నేల టపాసులు తయారు చేయిస్తున్నారు. కుమ్మరకాలనీలో బాణసంచా తయారీ సామగ్రిని అర్బన్ సీఐ వీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. మృతులు సాధారణ వ్యక్తులు కావటంతో వీరి వెనకాల ఎవరున్నారనేది తేలాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని నరసరావుపేట డీఎస్పీ ఎం వీరారెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి వీ శ్రీనివాసులురెడ్డి, అర్బన్ సీఐ వీ సూర్యనారాయణ, స్థానిక అగ్నిమాపక అధికారి కే సునీల్‌కుమార్ పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నేతల పరామర్శ ఎమ్మెల్యే విడదల రజని బాధిత కుటుంబాలను పరామర్శించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురి మృతి
సాక్షి,చెన్నై: ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటన శివకాశి జిల్లాలోని రాముదేవపట్టిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలివి.. రాముదేవిపట్టిలో ఏఆర్వీ, ఎస్ ఏఎస్ బాణాసంచా తయారీ కర్మాగారాలు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో దాదాపుగా 50మంది కార్మికులు పని చేస్తున్నారు. బాణసంచా తయారు చేస్తున్న సమయంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఆ మంటల్లో నలుగురు కార్మికలు దుర్మరణం చెందారు. గాయపడిన వారిని శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాణాసంచా తయారీ ఆ కార్మికుల పాలిట మృత్యువుగా మారింది. మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
శివకాశి బాణసంచా ఫ్యాకర్టీలో భారీ పేలుడు..
-
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : ముగ్గురు మృతి
బీజింగ్ : తూర్పు చైనా జింయాగ్జి ప్రావిన్స్‌లోని కున్షాన్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. హంగ్షెంగ్ బాణాసంచా ఫ్యాక్టరీకి చెందిన వర్క్‌షాపులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా... మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు అత్యవసర నిర్వహణ కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఈ ఘటనలో గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ ప్రమాద సమయంలో సదరు పరిసర ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మంది ప్రజలు ఉన్నారని... వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అత్యవసర నిర్వహణ కార్యాలయం పేర్కొంది. మరో 21 మందిని ఈ ప్రమాదం నుంచి రక్షించినట్లు తెలిపింది. ఒకరి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదని చెప్పింది. ఈ పేలుళ్ల దాటికి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లుకు బీటలు ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. దాదాపు 300 ఏళ్లుగా యంగ్కొ టౌన్షిప్లో బాణాసంచా తయారీ చేస్తున్న విషయం విదితమే. ఈ ప్రాంతంలో దాదాపు 31 బాణాసంచా తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. -
ముచ్చటైన గ్రామం..నేడు మృత్యుధామం
పిఠాపురం :మృత్యువు సాగించిన మారణసేద్యానికి ఫలసాయంలా.. పంటపొలాల్లో దొరికే మాంసపు ముద్దలు, చెట్ల కొమ్మలకు వేలాడే శరీరావశేషాలు.. చిమ్మిన నెత్తుటితో ఎర్రబారిన ఆకుపచ్చని వరిదుబ్బులు..శోకించి, శోకించి, కన్నీరు చారికలు కట్టిన ముఖాలు- ఇదీ ఇప్పుడు కొత్తపల్లి మండలం వాకతిప్ప ముఖచిత్రం. 17 మందిని పొట్టన పెట్టుకుని, 30 కుటుంబాలను కన్నీటి కడలిలోకి నెట్టిన బాణసంచా విస్ఫోటం మిగిల్చిన దుర్భర దృశ్యం. పచ్చని పైరులతో, పంట కాలువలతో చూడముచ్చటగా ఉండే ఊరి గుండెల్లో రేగిన కార్చిచ్చులా సోమవారం సంభవించిన ఘోరం వాకతిప్పతో పాటు మరో రెండు గ్రామాలను కలచివేస్తూనే ఉంది. దుర్ఘటనలో వాకతిప్ప, పెదకలవలదొడ్డి, నిదానందొడ్డి గ్రామాలకు చెందిన 17 మంది మృత్యువాత పడగా.. ఓ బాలిక ఆచూకీ లేకుండా పోయింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ గ్రామాల వారు.. కన్నీటిని తుడుచుకుంటూ, శోకాన్ని ఆపుకొంటూ పొలాల్లో, కాలువలో ఇంకెవరైనా అభాగ్యులు విగతజీవులుగా పడి ఉన్నారేమోనని దుర్ఘటన స్థలం పరిసరాల్లో వెతుకుతున్నారు. కారణం.. విస్ఫో టం సంభవించిన బాణసంచా తయారీకేంద్రానికి దాదాపు అరకిలోమీటరు దూరంలో ఓ మహిళ మృతదేహం కాళ్లు తెగిన స్థితిలో మంగళవారం కనిపించడమే. ఆమెను వాసంశెట్టి రాఘవగా కుమారుడు గుర్తించాడు. అంత దూరం ఎగిరిపడిందంటే పేలుడు స్థాయి అర్థమవుతుంది. భారీ మందుపాతర స్థాయిలో విస్ఫోటం.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సంభవించిన పెను విస్ఫోటం ధాటికి సంఘటనాస్థలం నుంచి సుమారు 500 మీటర్ల వ్యాసార్ధంలో పొలాలు, కొబ్బరి తోటలకు నెత్తుటి మరకలంటాయి. పొలాల్లో అక్కడక్కడా మృతుల శరీర భాగాలు, మాంసపు ముద్దలు కనిపిస్తున్నాయి. కొన్ని అవశేషాలు పరిసరాల్లోని చెట్లకు వేలాడుతున్నాయి. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న పంటపొలంలో సుమారు అరెకరం వ్యాసార్ధంలో గొయ్యి పడడం చూస్తే..అక్కడ భారీ మందుపాతరను పేల్చినట్టనిపిస్తోంది. పరిసరాల్లోని కొబ్బరి, మామిడి, టేకు చెట్లు నిలువునా దగ్ధమయ్యాయి. దుర్ఘటన స్థలాన్ని చూసిన నిపుణులు సుమారు 1000 కేజీల మందుగుండుతో పేల్చిన మందుపాతర స్థాయిలో విధ్వంసం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. చుట్టూ ఉన్న చెట్లు విస్ఫోటంతో ఎగసిన అగ్నికీలలను, బాణసంచాను దూరానికి వెళ్లకుండా నిరోధించాయని, లేకుంటే దగ్గరలో ఉన్న గ్రామానికి కూడా ముప్పు వాటిల్లేదని అగ్నిమాపకాధికారులు అంటున్నారు. ముందు రోజు జరిగి ఉంటే.. సోమవారంనాటి పేలుడు ముందు రోజైన ఆది వారం జరిగి ఉంటే.. పసివాళ్ల పాలిట మరణశాసనమై ఉండేదని స్థానికులు దడదడలాడే గుండెలతో చెపుతున్నారు. ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో పేద కుటుంబాలకు చెందిన దాదాపు 150 మంది విద్యార్థులు బాణసంచా తయారీ పనికి వెళ్లారు. మతాబులు కూరితే రూ.వంద వరకు కూలి వస్తుందని, అది దీపావళి సరదాకు ఉపయోగపడుతుందని వారి ఆశ. పేలుడు తర్వాత వారి తల్లిదండ్రులు ఘోరం ఒకరోజు ముందు సంభవించి ఉంటే తమ బిడ్డలు ఏమైపోయే వారోనని ఊహించుకుని, భీతావహులవుతున్నారు. దేవుడే దయ తలచాడని దండాలు పెడుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనం దుర్ఘటన స్థలానికి తరలి వస్తున్నారు. మంగళవారం నాటికీ భయానకంగా కనిపిస్తున్న అక్కడి దృశ్యాల్ని చూసి తల్లడిల్లిన పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. చెల్లాచెదురుగా కనిపిస్తున్న మాంసం ముద్దలను చూసి గగుర్పాటు చెందుతున్నారు. విస్ఫోటం తీవ్రతకు మూగజీవులూ బలయ్యాయి. దుర్ఘటన స్థలానికి దగ్గరలో ఉన్న రెండు కుక్కలు చనిపోగా..మరొకటి తీవ్రంగా గాయపడింది. సమీపంలోని పొలా ల్లో కట్టి ఉన్న పాడిపశువులు మంటల తీవ్రతకు విలవిలలాడుతుంటే.. స్థానికులు చూసి కట్టు విప్పడంతో పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాయి. -
బాణాసంచా కర్మాగారంలో పేలుడు: 12 మంది మృతి
బీజింగ్: మధ్య చైనా హ్యూనన్ ప్రావెన్స్లో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇద్దరు గల్లంతయారని చెప్పారు. కర్మాగారం సమీపంలో నడుచుకుంటు వెళ్తున్న మూగ్గురు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. మరో ముగ్గురు మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, స్వల్పగాయాలపాలైన వారు ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఇంటికి వెళ్లారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆ పేలుళ్ల దాటికి కర్మాగారం సమీపంలోని భవనాలు, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయని వెల్లడించారు. ఈ బాణాసంచా కర్మాగారం యజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 15 మంది మృతి
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న ఓ బాణాసంచా కార్మాగారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద కారణాలు వెంటనే తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కర్మాగారం యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు: ఒకరు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో బాణాసంచా మార్కెట్లో శనివారం పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు వెంటనే స్పందించి ఇటు పోలీసులు, అటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. అలాగే గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోటలోని బాణాసంచా కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. ఆ ఘటనలో భార్యభర్తలతోపాటు బాలుడుకి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటురు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాకటాలు బాణాసంచా కర్మాగారం వద్దకు చేరుకుని ఎగిసి పడుతున్న అగ్నికిలలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.