సంఘటన స్థలం
సాక్షి, చెన్నై: విరుదునగర్ జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలో మూడో ప్రమాదం గురువారం చోటుచేసుకుంది. బాణసంచా పరిశ్రమలోని పది గదులు నేలమట్టం కావడంతో ఆరుగురి మృతదేహాలు బయటపడ్డాయి. పదిహేను మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విరుదునగర్ జిల్లా శివకాశి పరిసరాలు బాణసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వారం రోజుల వ్యవధిలో మూడో ప్రమా దం చోటుచేసుకోవడం కలవరాన్ని రేపుతోంది. అతి పెద్ద ప్రమాదంలో ఇరవై మంది మేరకు మరణించిన సంఘటన మరవకముందే గురువారం సాయంత్రం శివకాశి సమీపంలోని కాలయార్ కురిచ్చిలో తంగరాజ్ పాండియన్‌కు చెందిన బాణసంచా పరిశ్రమలోపేలుడు జరిగింది.
సహాయక చర్యలకు ఆటంకం..
నాలుగున్నర గంటల సమయంలో ఇక్కడ పేలుడు సంభవించినట్టు పరిసరవాసులు పేర్కొంటున్నారు. తొలుత ఓ గదిలో పేలుడు క్రమంగా పది గదులపై ప్రభావం చూపించింది. ఈ గదుల్లో ఉన్న కార్మికులను రక్షించ లేని పరిస్థితి. అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నా, బాణసంచాలు పేలుతూనే ఉండడంతో ఆటంకాలు తప్పలేదు. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ముందుకు దూసుకెళ్లారు. గాయాలతో పడి ఉన్న 15 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అలాగే సంఘటనా స్థలంలో ఆరుగురి మృతదేహాలు బయటపడ్డాయి. శిథిలాల కింద మృతదేహాలు ఉండ వచ్చన్న ఆందోళనతో సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పరిశ్రమకు అనుమతి ఉన్నా, పేలుడుకు గల కారణాలపై విచారణ సాగుతోంది. ఈ ప్రమాదంతో ఆ పరిసరాలు దట్టమైన పొగతో నిండాయి. ఇక్కడ ఫ్యాన్సీ రకం బాణసంచాలు తయారు చేస్తున్న దృష్ట్యా, వాటిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి.
చదవండి:
ఆరవై ఏళ్ల వయస్సులో ఇదేం పాడుపని..!
ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది...
Comments
Please login to add a commentAdd a comment