తాడేపల్లిగూడెం/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మరణించాడు. 80 శాతం గాయాలపాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. గ్రామంలోని రాజం చెరువు సమీపంలో ఉన్న ఈ కేంద్రంలో బాణసంచాను ఓ వాహనంలోకి లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాద సమయంలో ఒక మహిళ వంట చేసుకోవడానికి ఇంటికి వెళ్లడంతో.. అలాగే మరొకతను టిఫిన్ తేవడానికి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల శరీర భాగాలు తునాతునకలై చెల్లాచెదురయ్యాయి. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలపాలైన ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యాళ్ల ప్రసాద్(28), అనంతపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి సోలోమన్‌రాజులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే యాళ్ల ప్రసాద్ చనిపోయాడు.
సోలోమన్‌రాజు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరానికి తరలించారు. గూడెం పరిసర ప్రాంతాల్లోని అనంతపల్లి, జగ్గన్నపేట, అల్లంపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఈ బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడానికి వస్తున్నారు. తయారీ కేంద్ర నిర్వాహకుడుగా చెబుతున్న పండూరి అన్నవరం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఘటనా స్థలాన్ని సందర్శించారు సహాయక చర్యలను పర్యవేక్షించారు.
అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పారు. తాను గడపగడపకు కార్యక్రమంలో ఉండగా సమాచారం తెలిసిందని.. వెంటనే అధికారులను హుటాహుటిన ఘటనాస్థలానికి పంపించి సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. క్షతగాత్రులకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. పరిమితికి మించి బాణసంచాను నిల్వ చేయడమే భారీ పేలుడుకు కారణమైందా అనే కోణంలో కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చదవండి: ('చంద్రబాబు దోచుకున్న వాటితో పోలిస్తే ఇవి చాలా తక్కువే')
బాణసంచా పేలి ముగ్గురు మృతి
Published Thu, Nov 10 2022 8:56 PM | Last Updated on Fri, Nov 11 2022 6:58 AM
Comments
Please login to add a commentAdd a comment