పంచాయతీలకు పగ్గాలు | Panchayats Play Important Role In Completing The Undertakings | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు పగ్గాలు

Published Mon, Jun 17 2019 10:10 AM | Last Updated on Mon, Jun 17 2019 10:10 AM

Panchayats Play Important Role In Completing The Undertakings - Sakshi

వనపర్తి మండలంలో చెరువు పూడికతీత పనుల్లో  ఉపాధి కూలీలు

గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పూర్తిస్థాయిలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పనుల పర్యవేక్షణ, గుర్తింపు బాధ్యతలను గ్రామ పాలక వర్గాలకు ఇవ్వనుంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచే ఈ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించినా వరుస ఎన్నికల నేపథ్యంలో వీలుకాలేదు. ప్రస్తుతం అవి పూర్తి కావడంతో త్వరలోనే కొత్త విధానాన్ని  ప్రవేశపెట్టనుంది. 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కొత్త విధానంలో ఫీల్డ్‌ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ కీలకం కానున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా గ్రామాలకు ఏయే పనులు కావాలో, ఎంతమంది కూలీలు అవసరమో, ఏ పనులు చేపడితే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందో పాలక వర్గాలు సమగ్రంగా చర్చించిన తర్వాతే పనులను కేటాయిస్తారు. ఇంతవరకు ఈ పనుల్లో కీలకంగా వ్యవహరించిన మండల పరిషత్‌లు ఇక కేవలం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం వరకే పరిమితం కానున్నాయి. పనుల గుర్తింపు, చేపట్టిన వాటిని పూర్తి చేయడంలో పంచాయతీలు కీలకపాత్ర పోషిస్తాయి. మరోవైపు ఉపాధిహామీ పనుల్లో అవినీతి, అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం ఫిర్యాదల పెట్టె ఏర్పాటు చేస్తారు. ప్రజలు, కూలీలు, రైతులు ఎవరైనా పనుల్లో చోటు చేసుకునే లోపాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఇప్పటికే డీఆర్‌డీఓలకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇది క్షేత్రస్థాయిలో అమలైతే మరింత ప్రయోజనం చేకూరనుంది. 

ఉపాధి హామీలో పారదర్శకత 
2005 నుంచి ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూనే ఉంది. మండల పరిషత్తు అధికారుల పర్యవేక్షణలో పనులు చేస్తున్నా.. గ్రామీణ స్థాయిలో మాత్రం పారదర్శకత లోపించింది. పలుచోట్ల అవతవకలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పనులు చేపట్టకున్నా జరిగినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని భావిస్తోంది. గతంలో మట్టిపనులకే పరిమితమైన ఈ పథకంలో వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉండే పనులను సైతం చేపడుతుంది. పూడికతీత, సేద్యపు కుంటలు, కాల్వలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, ఇంకుడుగుంతలు, వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు చెక్‌డ్యాంల నిర్మాణం, హరితహారం వంటి 74 రకాల పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి.. వాటి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు.  

6.85లక్షల జాబ్‌కార్డులు 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,698 గ్రామ పంచాయతీల్లో 6,85,377 లక్షల జాబ్‌కార్డులు, 14,73,999లక్షల మంది కూలీలు ఉన్నారు. కొత్త విధానం ప్రకారం పనులన్నీ గ్రామ పంచాయతీల వారీగా జరుగుతాయి. పాత గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉన్నారు. కొత్త పంచాయతీల్లో కార్యదర్శే ఉపాధిహామీని పర్యవేక్షించనున్నారు. అలాగే కూలీలకు వేతన స్లిప్‌లను వారు అందజేస్తారు. పనులు లేనప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్లి అడిగితేవెంటనే ‘ఉపాధి’కి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేపట్టాల్సిన పనులను గుర్తించి నామమాత్రంగా గ్రామ సభ నిర్వహించి వాటికి ఆమోదం పొందినట్లు రికార్డులు నమోదు చేసేవారు. ఇకపై అలాంటి వాటికి చెక్‌ పడనుంది. పంచాయతీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను గుర్తిస్తారు. ఆ తర్వాతా గ్రామసభ నిర్వహించి అవసరమైన వాటికే ఆమోదం తెలుపుతారు. ఇలా చేయడం వల్ల సకాలంలో పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పనులను పంచాయతీలకు అప్పగిస్తే ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గ్రామ పంచాయతీల వద్దే ఉంటారు. ఉదయం ఏడు గంటలకే కూలీలకు అందుబాటులోకి రావాలి. ఇందుకోసం అతనికి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేస్తారు. అందులో పనికి సంబంధించిన రికార్డులు, కూలీల హాజరు రిజిస్టర్లు, ఇతర ఫైళ్లు ఉంటాయి. వాటిని సర్పంచి, పంచాయతీ కార్యదర్శి తనిఖీ చేసే అధికారం ఉంటుంది. 

ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టె 
గ్రామీణ నిరుపేదలకు కనీస పనిదినాలు కల్పించే ఈ ఉపాధిహామీ పథకంలో ఇక నుంచి మండల పరిషత్‌ ఆజమాయిషీ తగ్గి పంచాయతీ పాలక వర్గాలకే పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఏయే పనులు చేపడితే కూలీలకు ఉపాధి దొరుకుతుందో వాటిని మాత్రమే చేసేలా చర్చించాలి. గతంలో కొన్ని చోట్ల అవసరం లేని పనులు సైతం చేపట్టడంతో ప్రజాధనం వృథా అయింది. కోట్లాది రూపాయలు వెచ్చిం చినా గ్రామీణులు సంపూర్ణమైన ఫలితాలు పొందలేక పోయారనే ఫిర్యాదులు వచ్చాయి. ఉపాధిహామీ పనుల్లో అవినీతి, అక్రమాలను నివారించేందుకుగాను గ్రామ పంచాయతీల్లో ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement