సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ మాన్ నియమాకమయ్యారు.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం బదిలీ చేసిన విషయం తెలసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. నేటి సాయంత్రం 5 గంటలలోగా బదిలీ అయిన వారి స్థానాల్లో ఒక్కోపోస్టుకు ముగ్గురి చొప్పున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లను తమకు ప్రతిపాదించాలని సర్కారుకు స్పష్టం చేసింది.
డీజీపీ ఉత్తర్వులు
ఈ నేపథ్యంలో బదిలీ అయినవారి స్థానంలో ఇన్‌చార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్, వరంగల్ సీపీగా డీ.మురళీధర్, నిజామాబాద్ సీపీగా ఎస్.జయరాంను నియమించారు. సూర్యాపేట ఎస్పీగా ఎం.నాగేశ్వర్‌రావు, సంగారెడ్డి ఎస్పీగా పీ.అశోక్, కామారెడ్డి ఎస్పీగా కే.నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ఆర్.ప్రభాకర్‌రావు, మహబూబ్‌నగర్ ఎస్పీగా అందెరాములు, నాగర్‌కర్నూల్ ఎస్పీగా సీహెచ్.రామేశ్వర్, గద్వాల ఎస్పీగా ఎన్ వి, మహబూబాబాద్ ఎస్పీగా జే.చెన్నయ్య, నారాయణ్‌పేట ఎస్పీగా కే.సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఏ.రాములును నియమించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కూడిన బృందం ఈనెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది.ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, నిబంధనల అతిక్రమణ, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాల ఆధారంగానే పెద్ద సంఖ్యలో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.
మరో నాలుగు రాష్ట్రాల్లోనూ బదిలీలు..
తెలంగాణతోపాటు శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో వేటుపడిన వారిలో 9 మంది కలెక్టర్లతోపాటు పలువురు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment