commissinor
-
హైదరాబాద్ ఇన్చార్జి సీపీగా విక్రమ్‌సింగ్ మాన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ మాన్ నియమాకమయ్యారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం బదిలీ చేసిన విషయం తెలసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. నేటి సాయంత్రం 5 గంటలలోగా బదిలీ అయిన వారి స్థానాల్లో ఒక్కోపోస్టుకు ముగ్గురి చొప్పున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లను తమకు ప్రతిపాదించాలని సర్కారుకు స్పష్టం చేసింది. డీజీపీ ఉత్తర్వులు ఈ నేపథ్యంలో బదిలీ అయినవారి స్థానంలో ఇన్చార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్, వరంగల్ సీపీగా డీ.మురళీధర్, నిజామాబాద్ సీపీగా ఎస్.జయరాంను నియమించారు. సూర్యాపేట ఎస్పీగా ఎం.నాగేశ్వర్రావు, సంగారెడ్డి ఎస్పీగా పీ.అశోక్, కామారెడ్డి ఎస్పీగా కే.నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ఆర్.ప్రభాకర్‌రావు, మహబూబ్‌నగర్ ఎస్పీగా అందెరాములు, నాగర్‌కర్నూల్ ఎస్పీగా సీహెచ్.రామేశ్వర్, గద్వాల ఎస్పీగా ఎన్ వి, మహబూబాబాద్ ఎస్పీగా జే.చెన్నయ్య, నారాయణ్‌పేట ఎస్పీగా కే.సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఏ.రాములును నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కూడిన బృందం ఈనెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది.ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, నిబంధనల అతిక్రమణ, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాల ఆధారంగానే పెద్ద సంఖ్యలో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. మరో నాలుగు రాష్ట్రాల్లోనూ బదిలీలు.. తెలంగాణతోపాటు శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో వేటుపడిన వారిలో 9 మంది కలెక్టర్లతోపాటు పలువురు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఉన్నారు. -
ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్‌లో ఆడిట్ అధికారులు
సాక్షి, కణేకల్లు: కణేకల్లు వ్యవసాయ విత్తనోత్పత్తిక్షేత్రంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రంగంలో దిగిన ఆడిటర్లు తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారు. పూర్వ ఏడీఏ సనావుల్లా పదేళ్ల కాలంలో రికార్డులను సక్రమంగా నిర్వహించకుండా, ఆదాయ వ్యయాలు సరిగా చూపకుండా, నిధులను భారీస్థాయిలో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫారం బకాయిపడిన సొమ్మును ఓటీఎస్ ద్వారా రూ.78.36 లక్షలను ప్రభుత్వం ఇటీవలే చెల్లించగా... ఇందులో కూడా ఓ వ్యక్తి ఖాతా నుంచి తన భార్య ఖాతాకు రూ.13.85 లక్షలు మళ్లించుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్.. సనావుల్లా పని చేసిన సమయంలోని రికార్డులన్నీ పరిశీలించేందుకు ఆడిటర్లను నియమించింది. ఆడిటర్లు యోగానందరెడ్డి, రాంబాబు, మాధవి, అన్నపూర్ణ ఐదు రోజుల పాటు రికార్డులన్నీ క్షుణ్ణంగా ఆడిట్ చేశారు. నిధుల దుర్వినియోగంపై ఆడిటర్లను అడిగితే ‘ఆ ఒక్కటి అడక్కండి.. కమిషనర్‌కు నివేదిక అందజేస్తాం’ అని సమాధానమిచ్చారు. నివేదికలో ఏముంది.. పూర్వ ఏడీఏపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. (చదవండి: విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!) -
‘ఆ తర్వాతే ఆనందయ్య మందుల పంపిణీ’
విజయవాడ: ఆనందయ్య, నెల్లూరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన తర్వాతే మందుల పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులు తయారు చేశాడని, ఇందులో P, L, F, ఐ డ్రాప్స్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్‌కి పంపామన్నారు. ఈ మందుల పనితీరు పరిశీలించే క్రమంలో సెంట్రల్ ఆయుష్ రీసెర్చ్ సెంటర్ సహాయం కూడా తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఐ డ్రాప్స్‌కి అనుమతి ఇవ్వలేదు ఆనందయ్య మందుల్లో P, L, F రకం మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనందువల్ల వినియోగానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఇక ఆనందయ్య మందుల్లో బాగా ఫేమస్ అయిన ఐ డ్రాప్స్ వల్ల ఎటువంటి హాని జరగదు అనేందుకు ఇంకా పూర్తి స్థాయి ఆధారాలు లభించలేదని ఆయన వెల్లడించారు. అందుకే ఐ డ్రాప్స్ వినియోగించడంపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు వివరించారు. కె రకం మందు శాంపిల్స్‌ని తాము పరిశీలించలేదని ఆయన చెప్పారు. ఇదే విషయాలని హైకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చామని ఆయన వివరించారు. ఆయుర్వేదం కాదు ఆనందయ్య తయారు చేస్తున్న మందులు ఆయుర్వేద మందులు కాదని స్పష్టం చేశారు ఆయుష్ కమిషనర్. ఈ మందుల వల్ల కొవిడ్ తగ్గుతుందని ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న రోగులు, వైద్యులు సూచించిన ఔషధాలు వాడుతూ ఆనందయ్య మందును అదనంగా వాడటంలో ఇబ్బందులు లేవన్నారు. కానీ కేవలం ఆనందయ్య మందుపైనే పూర్తిగా ఆధారపడటం శ్రేయస్కరం కాదని ఆయన చెప్పారు. నేరుగా రావొద్దు ప్రస్తుతం ఆనందయ్య దగ్గరకు వస్తున్న రోగుల్లో ఎక్కువ మంది పీ,ఎల్,ఎఫ్ రకం మందులే అధికంగా వినియోగిస్తున్నారని రాములు వివరించారు. ఈ మందులు తీసుకునేందుకు రోగులు నేరుగా రావొద్దని సూచించారు ఆయుష్ కమిషనర్. రోగుల కుటుంబ సభ్యులు వచ్చి మందులు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలంటూ ఆయన చెప్పారు. -
‘రాష్ట్రంలో యూరియా కొరత లేదు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూరియా నిల్వలు ఖరీఫ్ సీజన్ అవసరాల మేరకు ఉన్నాయని వ్యవసాయశాఖ పేర్కొంది. వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యూరియా నిల్వలపై ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో యూరియాకు కొరత ఎక్కడా లేదని, ప్రస్తుతం రెండు లక్షల టన్నుల యూరియా నిల్వలు మార్క్‌ఫెడ్, డీలర్స్ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు సెప్టెంబర్ మాసంలో రాష్ట్ర వ్యవసాయ అవసరాల నిమిత్తం కేంద్రం మూడు లక్షల టన్నుల యూరియాను కేటాయించిందన్నారు. డీలర్లు అధిక ధరలకు యూరియాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుకు అవసరం లేని ఎరువులను బలవంతంగా అమ్మజూపినా డీలర్లపై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని అరుణ కుమార్ పేర్కొన్నారు. -
తిరుపతి కమిషనర్‌గా గిరీషా
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వరిస్తున్న పీఎస్ గిరీషా నియమితులయ్యారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. ఇందులో భాగంగా కొంతమందిని శుక్రవారం రాత్రి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ బదిలీల్లో తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న వి.విజయ్ రామరాజును రాష్ట్ర మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న గిరీషాను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలానే తుడా వైస్ చైర్మన్‌గానూ గిరీషాను నియమించారు. రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో సంయుక్త ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న మార్కండేయులును జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. జాయింట్ కలెక్టర్‌గా తనదైన మార్క్ అన్ని శాఖల్లో కీలకమైన రెవెన్యూ శాఖకు ఉన్నతాధికారిగా ఉండే జాయింట్ కలెక్టర్ పోస్టులో గత రెండు సంవత్సరాల్లో గిరీషా తనదైన మార్క్‌ను సంపాదించుకున్నారు. సంవత్సరాల కొద్ది పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణకు కృషి చేశారు. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ ఆర్వో, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించి ఎన్నికలను సజావుగా నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిలో భూములు కోల్పోయిన రైతులకు, ప్రజలందరికి నష్టపరిహారం అందించే విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. నూతన జేసీగా మార్కాండేయులు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సంయుక్త ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న మార్కాండేయులును జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. ఆయన సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నారు. ఎంతో సంతృప్తినిచ్చింది జిల్లాలో జేసీగా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. కార్పొరేషన్లో పనిచేయాలనే కోరిక ఉండేది అది ప్రస్తుతం లభించింది. సీఎం ఆశయాలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తాను. ఇన్నాళ్లు రెవెన్యూలో విధులు నిర్వహించాను. ఇకపై కార్పొరేషన్లో పనిచేయడం ఓ కొత్త అనుభూతినిస్తుందని భావిస్తున్నాను. సోమ లేదా మంగళవారంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తాను. – జాయింట్ కలెక్టర్ గిరీష కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించిన విజయ్‌రామరాజు 2018 మే12న తిరుపతి కమిషనర్‌గా విజయ్‌రామరాజు బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన రామజహేంద్రవరం కమిషనర్‌గా కమిషనర్‌గా పనిచేశారు. ఏడాదికి పైగా 40 రోజుల పాటు తిరుపతి కమిషనర్‌గా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలోని పలు కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. ఎలివేటెడ్ కారిడార్, మల్టీపర్పస్ కాంప్లెక్స, ఇండోర్ స్టేడియం, పార్కుల అభివృద్ధి, అండర్ కేబుల్ సిస్టమ్, ఈ స్కూటర్ వంటి పలు ప్రాజెక్టులను టెండర్ దశకు తీసుకెళ్లారు. స్వచ్చ సర్వేక్షన్ పోటీల్లో తిరుపతిని జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిపారు. ప్లాస్టిక్ నిషేధం అమలుకు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తిరుపతిని నిలిపి జాతీయ స్థాయిలో మరోసారి మంచి గుర్తింపు పొందేలా చేశారు. -
పంచాయతీలకు పగ్గాలు
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పూర్తిస్థాయిలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పనుల పర్యవేక్షణ, గుర్తింపు బాధ్యతలను గ్రామ పాలక వర్గాలకు ఇవ్వనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచే ఈ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించినా వరుస ఎన్నికల నేపథ్యంలో వీలుకాలేదు. ప్రస్తుతం అవి పూర్తి కావడంతో త్వరలోనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. సాక్షి, నాగర్‌కర్నూల్: కొత్త విధానంలో ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కీలకం కానున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా గ్రామాలకు ఏయే పనులు కావాలో, ఎంతమంది కూలీలు అవసరమో, ఏ పనులు చేపడితే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందో పాలక వర్గాలు సమగ్రంగా చర్చించిన తర్వాతే పనులను కేటాయిస్తారు. ఇంతవరకు ఈ పనుల్లో కీలకంగా వ్యవహరించిన మండల పరిషత్‌లు ఇక కేవలం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం వరకే పరిమితం కానున్నాయి. పనుల గుర్తింపు, చేపట్టిన వాటిని పూర్తి చేయడంలో పంచాయతీలు కీలకపాత్ర పోషిస్తాయి. మరోవైపు ఉపాధిహామీ పనుల్లో అవినీతి, అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం ఫిర్యాదల పెట్టె ఏర్పాటు చేస్తారు. ప్రజలు, కూలీలు, రైతులు ఎవరైనా పనుల్లో చోటు చేసుకునే లోపాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఇప్పటికే డీఆర్డీఓలకు పంచాయతీరాజ్ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇది క్షేత్రస్థాయిలో అమలైతే మరింత ప్రయోజనం చేకూరనుంది. ఉపాధి హామీలో పారదర్శకత 2005 నుంచి ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూనే ఉంది. మండల పరిషత్తు అధికారుల పర్యవేక్షణలో పనులు చేస్తున్నా.. గ్రామీణ స్థాయిలో మాత్రం పారదర్శకత లోపించింది. పలుచోట్ల అవతవకలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పనులు చేపట్టకున్నా జరిగినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని భావిస్తోంది. గతంలో మట్టిపనులకే పరిమితమైన ఈ పథకంలో వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉండే పనులను సైతం చేపడుతుంది. పూడికతీత, సేద్యపు కుంటలు, కాల్వలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, ఇంకుడుగుంతలు, వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు చెక్‌డ్యాంల నిర్మాణం, హరితహారం వంటి 74 రకాల పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి.. వాటి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. 6.85లక్షల జాబ్‌కార్డులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,698 గ్రామ పంచాయతీల్లో 6,85,377 లక్షల జాబ్‌కార్డులు, 14,73,999లక్షల మంది కూలీలు ఉన్నారు. కొత్త విధానం ప్రకారం పనులన్నీ గ్రామ పంచాయతీల వారీగా జరుగుతాయి. పాత గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. కొత్త పంచాయతీల్లో కార్యదర్శే ఉపాధిహామీని పర్యవేక్షించనున్నారు. అలాగే కూలీలకు వేతన స్లిప్‌లను వారు అందజేస్తారు. పనులు లేనప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్లి అడిగితేవెంటనే ‘ఉపాధి’కి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టాల్సిన పనులను గుర్తించి నామమాత్రంగా గ్రామ సభ నిర్వహించి వాటికి ఆమోదం పొందినట్లు రికార్డులు నమోదు చేసేవారు. ఇకపై అలాంటి వాటికి చెక్ పడనుంది. పంచాయతీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను గుర్తిస్తారు. ఆ తర్వాతా గ్రామసభ నిర్వహించి అవసరమైన వాటికే ఆమోదం తెలుపుతారు. ఇలా చేయడం వల్ల సకాలంలో పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పనులను పంచాయతీలకు అప్పగిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీల వద్దే ఉంటారు. ఉదయం ఏడు గంటలకే కూలీలకు అందుబాటులోకి రావాలి. ఇందుకోసం అతనికి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేస్తారు. అందులో పనికి సంబంధించిన రికార్డులు, కూలీల హాజరు రిజిస్టర్లు, ఇతర ఫైళ్లు ఉంటాయి. వాటిని సర్పంచి, పంచాయతీ కార్యదర్శి తనిఖీ చేసే అధికారం ఉంటుంది. ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టె గ్రామీణ నిరుపేదలకు కనీస పనిదినాలు కల్పించే ఈ ఉపాధిహామీ పథకంలో ఇక నుంచి మండల పరిషత్ ఆజమాయిషీ తగ్గి పంచాయతీ పాలక వర్గాలకే పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఏయే పనులు చేపడితే కూలీలకు ఉపాధి దొరుకుతుందో వాటిని మాత్రమే చేసేలా చర్చించాలి. గతంలో కొన్ని చోట్ల అవసరం లేని పనులు సైతం చేపట్టడంతో ప్రజాధనం వృథా అయింది. కోట్లాది రూపాయలు వెచ్చిం చినా గ్రామీణులు సంపూర్ణమైన ఫలితాలు పొందలేక పోయారనే ఫిర్యాదులు వచ్చాయి. ఉపాధిహామీ పనుల్లో అవినీతి, అక్రమాలను నివారించేందుకుగాను గ్రామ పంచాయతీల్లో ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయనున్నారు. -
అద్దెలపై బల్దియా దృష్టి
సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏళ్ల తరబడిగా ఖాళీగానే ఉంటున్న షట్లర్లను అద్దెలకు ఇచ్చేందుకు బల్దియా నడుం బిగించింది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఉన్న వనరులను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఉన్న రాజీవ్‌గాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న షట్టర్లను అద్దెలకు ఇచ్చేందుకు వేలం పాటకు సిద్ధపడుతున్నారు. వీటికి తోడు రెండేళ్ల క్రితం ఐడీఎస్ఎంటీ నిధులతో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా షట్టర్లను అద్దెలకు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అద్దెల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇన్నాళ్లు వేలం పాటలో ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఒకటి రెండు సార్లు దుకాణాలకు వేలం పాట వేస్తున్నామని హడావిడి చేసినప్పటికీ వేలం వేయకుండానే చేతులు దులుపుకున్నారు. మున్సిపల్ ఆవరణలో ఉన్న షాపింగ్‌కాంప్లెక్స్‌లో దాదాపు నాలుగేళ్లుగా పైఅంతస్తులో 14 గదులు ఖాళీగా ఉంటున్నాయంటే అధికారులు ఏమేరకు శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోంది. మున్సిపల్ పాత గెస్ట్‌హౌస్ స్థలంలో ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులు రూ.3.5కోట్లతో 42 షెట్టర్లను నిర్మించారు. అద్దెలకు ఇస్తే వాటిపై కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికే కాంప్లెక్స్ సెల్లార్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. గతంలో వేలం నిర్వహించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎవరూ అద్దెలకు రాలేదు. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాగైనా అద్దెలకు ఇవ్వాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు నగరపాలక సంస్థ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాలను కొంత మంది అద్దెలకు తీసుకుని ఇతరులకు ఎక్కువ కిరాయికి ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటి వారిపై ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినంగా ఉండి, అద్దె అగ్రిమెంట్ గడువు ముగియడంతోనే వారిని ఖాళీ చేయించేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. అద్దెలకు తీసుకున్న వారు తప్ప ఇతరులు ఎవరైనా ఆ దుకాణాల్లో వ్యాపారం నిర్వహిస్తే మున్సిపల్ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అద్దెలపై దృష్టి సారించాం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షెట్టర్లతోపాటు ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోనూ షెట్లర్లు అద్దెకు ఇచ్చేందుకు దృష్టిసారించాం. ప్రస్తుతం అద్దెలకు తీసుకున్న షెట్టర్లలో ఇతరులు వ్యాపారం చేస్తే ఖాళీ చేయిస్తాం. అదనపు అద్దెల కోసం అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి గడువు ముగిశాక ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడతాం. – సత్యనారాయణ, కమిషనర్ -
హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి బదిలీ
సాక్షి,హైదరాబాద్: హెచ్ఎండీఏ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డిని సాధారణ పరిపాలన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త అధికారిని నియమించేంత వరకు పూర్తి అదనపు బాధ్యతలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న జనార్దన్‌రెడ్డిని ఎన్నికల నిబంధనల్లో భాగంగా గతేడాది ఆగస్టు 23న హెచ్ఎండీఏ కమిషనర్‌గా బదిలీ చేశారు. కార్యనిర్వహణాదక్షుడిగా పేరొందిన ఆయన్ను నీటిపారుదల శాఖలో కీలకమైన పోస్టులో నియమించే అవకాశముందని సమాచారం. జనవరి 14 నుంచి అమెరికా పర్యటనలో ఉన్న జనార్దన్‌రెడ్డి సోమవారం నగరానికి చేరుకున్నారు. సీఐడీ ఎస్పీ రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ తెలంగాణ సీఐడీలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తున్న రామ్మోహన్ సోమ వారం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ ఆయ్యారు. పోలీస్ శాఖ విభజనలో భాగంగా రామ్మోహన్ ఏపీకి ఆప్షన్ ఇచ్చారు. ఇటీవలే విభజన అధికారికంగా పూర్తికావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన అయేషా మీరా హత్య కేసులో అప్పుడు ఫోరెన్సిక్ రిపోర్టు ఇచ్చింది రామ్మోహన్ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయేషా మీరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఆ కేసులో కీలకంగా పనిచేసిన అధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. -
ఎంబీఎంసీ కమిషనర్ బదిలీ
సాక్షి, ముంబై : మీరా–భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ)లో కమిషనర్ల బదిలీల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికార బీజేపీ, ఎంబీఎంసీ కమిషనర్ నరేశ్ గీతే మధ్య కొనసాగుతున్న వివాదం తారస్థాయికి చేరడంతో బదిలీ చేశారు. నరేశ్ గీతే కేవలం సంవత్సరన్నర కాలం మాత్రమే ఎంబీఎంసీలో విధులు నిర్వహించారు. వివిధ కారణాల వల్ల 2011 తరువాత ఒక్కరు కూడా పూర్తికాలం విధులు నిర్వహించలేకపోవడం గమనార్హం. దీంతో కమిషనర్ల బదిలీల సంఖ్య ఐదుకు చేరింది. ఒత్తిళ్లకు లొంగబోనని.. ఎంబీఎంసీలో బీజేపీ అధికారంలో ఉంది. కొద్ది రోజులుగా ఎంబీఎంసీ కమిషనర్ నరేశ్ గీతే, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతా మధ్య రాజీ కుదరలేదు. గీతే నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మెహతా ఆరోపించారు. పరిపాలన విభాగం విధించిన నియమాలకు లోబడి పనిచేస్తానని, మీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు తను భయపడడని కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడే గీతే అధికార పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం జరుగుతూనే ఉంది. ఫలితంగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. దీంతో వచ్చే ఆర్థిక బడ్జెట్ సమావేశంలో దీని ప్రభావం కచ్చితంగా చూపనుంది. వీరి మధ్య జరుగుతున్న వివాదం రోజురోజుకు తారస్థాయికి చేరుకుంది. పరిష్కారమయ్యే మార్గం కనిపించకపోవడంతో, అధికార పార్టీ కార్పొరేటర్లు నేరుగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. అందులో గీతే బదిలీ విషయంపై చర్చించి, ఆయన్ని బదిలీ చేశారు. కమిషనర్లపై బదిలీ వేటు.. 2011లో కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై కేవలం సంవత్సరన్నర కాలంలోనే బదిలీ వేటు పడింది. ఆ తరువాత వచ్చిన సురేశ్ కాకాణీ, సుభాష్ లాఖే, అచ్యుత్ హాంగే లపై కూడా సంవత్సరన్నర పదవీ కాలం పూర్తిచేయకుండానే బదిలీ చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారులకు కార్పొరేషన్ పనితీరును తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఆ తరువాత ఈ అధికారులు తమ పనిలో స్థిరపడతారు. కానీ, ప్రజా ప్రతినిధులతో ఎలా మసులుకోవాలి, వారితో కలిసి ఎలా పనిచేయాలో అప్పటికీ ఇంకా వీరికి తెలియదు. ఇది తెలుసుకునే లోపు వారి మధ్య విభేదాలు పొడచూపడం, వివాదానికి దారి తీయడం, బదిలీ వేటు పడటం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. -
కార్యాలయాలను పరిశీలించిన రాచకొండ కమిషనర్
భువనగిరి అర్బన్ : యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయనున్న పలు జిల్లా కార్యాలయాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ పరిశీలించారు. ఇందులో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి గ్రామంలో ఉన్న యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాన్ని చూశారు. అనంతరం అక్కడి నుంచి హన్మాపురం గ్రామ శివారులో ఉన్న జిల్లా పోలీస్ కార్యాలయం, భువనగిరిలో ఏర్పాటు అవుతున్న ఎస్పీ క్యాంపు, రాయగిరి గ్రామంలో ఉన్న పోలీస్ ఔట్ పోస్టు కార్యాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగ రోజున కార్యాలయాలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. భువనగిరి, చౌటుప్పల్‌లో ఏసీపీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలపై ఎస్పీ, డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ ఎం. శంకర్‌గౌడ్, రూరల్ సీఐ అర్జునయ్య, యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.