
సాక్షి, భూత్పూర్ (మహబూబ్‌నగర్) : తనకు భయపడే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో కలుపుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతారని జ్యోతిష్యుడు చెప్పడంతోనే కేసీఆర్ ముందుస్తుకు అడుగేసారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘మీ ఆశీర్వాదం పొందడానికి మళ్లీ వచ్చాను. ఐదేళ్లు రేయింబవళ్లు కష్టపడ్డాను. చౌకీదారుగా 60 నెలలు నా పనితీరును చూశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. గతంలో దేశంలో బాంబు పేలుళ్లు జరిగేవి. గత ఐదేళ్లలో పేలుళ్లు జరగకుండా చూశాం. ఉగ్రవాదన్ని కశ్మీర్‌కే పరిమితం చేశాం. దేశ భద్రత, అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తోంది. తెలంగాణలో ముందుస్తు ఎన్నికలు ఎందుకు జరిపారో అర్థం కావడం లేదు. జ్యోతిష్యులు చెప్పినట్టు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఉంటే ప్రజాధనం వృథా అయ్యేది కాదు. తెలంగాణ ప్రజల భవితను నిర్ణయించుకోవాల్సింది వాళ్లా ..? లేక ఓ జ్యోతిష్యుడా? దేశ అభివృద్ధితో పాటు తెలంగాణ భవిత కోసం బీజేపీతో కలిసి రండి. కాంగ్రెస్ టీఆర్‌ఎస్ ఒకే గూటి పక్షులే.
సర్జికల్ దాడులపై ఆధారాలు అడిగి కాంగ్రెస్ తన నీచ రాజకీయాలను రుజువుచేసుకుంది. నీతి మాలిన రాజకీయాలు నడిపిన కాంగ్రెస్‌ను జనం సాగనంపుతున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. కేసీఆర్‌ను గెలిపించిన పాలమూరు ప్రజలను మర్చిపోయారు. తమ స్వప్రయోజనాల కోసమే టీఆర్‌ఎస్-ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయి. నేడు పాలమూరును నిర్లక్ష్యం చేసిన వాళ్లు ఒకవైపు ఉంటే.. పాలమూరు ప్రజల పక్షాన నిలిచిన మేం మరోకవైపు ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, నిధులు కేటాయించాం. మునిరాబాద్ టూ సికింద్రాబాద్ రైల్వే లైన్.. సికింద్రాబాద్ టూ పాలమూరు డబుల్ లైన్ ఏర్పాటు చేశాం.. మా పథకాలన్ని కేసీఆర్ తానే చేశాని చెప్పుకుంటున్నారు. దేశంలో కోటిన్నర మందికి ఇళ్లు కట్టించాం’ అని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment