
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గెలుపే లక్ష్యంగా వ్యూహరచనలో నిమగ్నం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం కాంగ్రెస్ నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎంపికపై ఢిల్లీకి చేరిన ‘స్థానిక’ లొల్లి ఇంతవరకు కానరాని బీజేపీ జోష్ టికెట్ల కోసంఆశావహుల ప్రయత్నాలు... ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల్లో మరింత చలనం వచ్చింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉండడంతో టికెట్టు కోసం యత్నాలు ముమ్మరం చేశారు. అనంతరం వ్యవహరించాల్సిన వ్యూహంపై ఇప్పట్నుంచే ఆయా పార్టీల్లో చర్చలు ఊపందుకున్నాయి.
రాజధానిలో సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ తరఫున జిల్లాలోని మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్ స్థానానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడమేగాక లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యేలూ పనిచేయాలని ఆదేశించారు.
మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి తెరలేపిన గులాబీ పార్టీ ఈనెల 9న నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వనపర్తిలో తొలి సన్నాహకసదస్సును నిర్వహించింది. దీనికి హాజరైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలాఉండగా ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించిన పార్టీ అధినేత అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ఆరా తీస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ప్రస్తుత ఎంపీ జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి సీనియర్ నాయకుడు పోతుగంటి రాములు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటిరోజు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి రచ్చకెక్కింది. నాగర్‌కర్నూల్ ప్రస్తుత ఎంపీ నంది ఎల్లయ్య స్థానికేతరుడనీ ఆయనకు టికెట్ వద్దని స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగిన ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు తాజాగా సోమవారం ఢిల్లీకి చేరుకుని అక్కడి ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ఇటీవల అసెంబ్లీ ఫలితాల్లో కోలుకోలేని దెబ్బతిని లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరి స్తున్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సవాలుగా మారింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు జా ప్యం చేసిన ఆ పార్టీ ఈసారి పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌కు, అధికార టీఆర్‌ఎస్ పార్టీ కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినా.. ఇంతవరకు ప్రకటించలేకపోయింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ పార్టీ శ్రేణుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికే దాదాపు టికెట్టు ఖరారవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ నంది ఎల్లయ్య, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో పాటు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ మాదిగ పేర్లు సైతం ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయి.
కమలంలో కానరాని జోష్!
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సమాయత్తమవుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో మాత్రం జోష్ కానరావడం లేదు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఎవరిని ప్రకటిస్తుందో అనే చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా వ్యవహరిస్తున్న మహబూబ్‌నగర్ వాసి శాంతికుమార్ రేసులో ఉన్నారు. అధిష్టానం సైతం ఆయనకు టికెట్టు ఖాయం చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ కూతురు, ఎస్సీమోర్చా జాతీయ కార్యదర్శి శృతి నాగర్‌కర్నూల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment