
సాక్షి, జడ్చర్ల : రాష్ట్ర విభజన జరిగినా చంద్రబాబు నాయుడు వదల బొమ్మాళి అంటున్నాడని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాను వలస జిల్లాగా మార్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు మరోసారి మహాకూటమి పేరుతో తెలంగాణలో చొరబడాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..
‘మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. కానీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు పదే పదే అడ్డుపడుతూ కేంద్రానికి లేఖలు రాశారు. అలాంటి చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. ప్రజలు ఒకసారి ఆలోచించాలి. డిపాజిట్ రాకుండా ఓడగొట్టి చంద్రబాబుకు బుద్ది చెప్పాలి. ఇక్కడి కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రాజెక్ట్‌పై 35 కేసులు వేసారు. భూసేకరణ విషయంలో ప్రజలకు అపోహలు సృష్టించి ప్రాజెక్ట్ నిర్మాణానికి అడుగడుగున అడ్డుపడ్డారు. పాత పాలమూరు జిల్లాను పాలన సౌలభ్యం కోసం నాలుగు జిల్లాలు చేసుకున్నాం. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. అప్పుడు 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చి చూపిస్తా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చే రూ. 200 పింఛన్‌కు రూ.1000 ఇస్తానంటే.. అందరూ ఎలా ఇస్తావని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే అన్న మాట ప్రకారం ఇచ్చాం. మళ్లీ ఫించన్లు పెంచుతాం. ప్రపంచంలోనే ఎక్కడ లేని గొప్ప స్కీం రైతు బంధు.. వచ్చే ఏడాది నుంచి ఈ స్కీం కింద ఎకరానికి 10వేలు ఇస్తాం. రైతుల గిట్టుబాటు కోసం అద్భుత కార్యాచరణ చేశాం. కంటి వెలుగు, కేసీఆర్ కిట్‌తో ప్రజలకు అండగా నిలిచాం. మీ జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలోనే అద్భుతంగా ఈ పథకాలు కొనసాగుతున్నాయి. ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లాడికి రూ.12 వేలిస్తూ.. అమ్మ ఒడి వాహనాల్లో ఇంటికి చేర్చుతున్నాం’ అని కేసీఆర్ తమ ప్రభుత్వ పథకాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment