సాక్షి, కాకినాడ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు కూటమి రాజకీయాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. కూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేయడం ప్రజలెవరూ ఆమోదించలేదు. టీఆర్‌ఎస్ పార్టీ దరిదాపుల్లోకి కూడా ‘కూటమి’ చేరలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ పాలన గాలికొదిలేసి బాబు పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడమేంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని కాపు ఉద్యమనేత మద్రగడ పద్మనాభం అన్నారు. తెలంగాణలో టీడీపీ ఓటమిపై ఆయన స్పందిస్తూ.. టీడీపీ పని గోవిందా గోవిందా అంటూ కాపు నేతలతో కలిసి నినాదాలు చేశారు. కిర్లంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్‌కు నా అభినందనలు. ఓ గజ దొంగను అధికారంలో పాలుపంచుకోనివ్వకుండా కొలుకోలేని దెబ్బ కొట్టిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఎందరో త్యాగాల ఫలంతో రాష్ట్రం సాధించుకున్నారు. అటువంటి తెలంగాణలో వేలు పెట్టడం ఎంతవరకు సమాంజసమో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏపీలో ఉన్న వనరులు సరిపోక తెలంగాణలో ఉన్న వనరులపై కన్నేసిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్పారు’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment