గాలిగత్తర కావద్దు! | Cm kcr blames on mahakutami | Sakshi
Sakshi News home page

గాలిగత్తర కావద్దు!

Published Fri, Nov 30 2018 1:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Cm kcr blames on mahakutami - Sakshi

రామగుండంలో..
కేసీఆర్‌ మీ బిడ్డ.. ఏరోజైనా.. మీ మేలు కోరుతానే తప్ప.. ప్రాణంపోయినా నష్టం రానివ్వా. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. గోల్‌మాల్‌ గాళ్లు ఏదో చెప్తే నమ్మొద్దు. ఆలోచించి ఓటేయండి.

బెల్లంపల్లిలో.. 
కాంగ్రెస్, బీజేపీలు దుర్మార్గమైన, ఛండాలమైన రాజకీయాలు చేస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర పాలన రావాల్సిన అవసరం ఉంది. అందుకు నేనే నాయకత్వం వహించబోతున్నా. కాంగ్రెస్, బీజేపీల ఆటలు సాగనివ్వం.

కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లో..
హైదరాబాద్‌ను నేనే కట్టిన అని చంద్రబాబు చెప్పకుంటడు. హైదరాబాద్‌ అసలు నిర్మాత కులీకుతుబ్‌షా ఏడ పోవాలే? ఆయనే గదా హైదరాబాద్‌ నిర్మించింది. మాట్లాడితే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నేనే పెట్టిన అని చంద్రబాబు అంటడు.. నువ్వు పెట్టి నవో సచ్చినవో మరి కరెంట్‌ ఏడ దాచి పెట్టినవ్‌? 

మందమర్రి, మంచిర్యాలలో..
తెలంగాణ తెచ్చిందే ఆకుపచ్చగా కావాలని. అం దుకే కోటి ఎకరాల్లో సాగునీటిని అందించాలి. ఎక్కడికక్కడ పంటలు పండాలి. రైతులు క్షేమంగా ఉండాలి. దళితులు, గిరిజనులు,  మైనార్టీలు అందరూ బాగుండాలి. మహిళలు సుఖంగా ఉండాలి. అలాంటి తెలంగాణ కోసం తిప్పలు పడుతున్నాం. కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు కచ్చితంగా రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంటు ఇస్తాం. 

సాక్షి నెట్‌వర్క్‌: ‘పరిణితి చెందిన ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలుస్తరు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. 58 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కావాల్నా... 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించి, నాలుగేళ్లు పరిపాలన చేసిన టీఆర్‌ఎస్‌ కావాల్నా తేల్చుకోవాలి. గాలిగత్తరతో ఓటేస్తే ఐదేళ్లు గాలిగత్తరే అయితది’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేసీఆర్‌ ఆదిలాబాద్, సిర్పూర్‌ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, రామగుండం లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలిగత్తర కాకుండా ఆలోచించి ఓట్లేయాలని పిలుపునిచ్చారు. ‘నిన్న అమిత్‌షా, మొన్న మోదీ వచ్చిన్రు. అమిత్‌షా ఆదిలాబాద్‌ల కమ్యూనిటీహాల్‌ గురించి, మోదీ నిజామాబాద్‌ల మోరీలు లేవని మాట్లాడుతున్నరు. ఇవాళ దేశంలో 19 రాష్ట్రాల్లో మీ పార్టీ అధికారంలో ఉంది. ఒక్క రాష్ట్రంలోనైనా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్రా? రైతులకు ఒక్క రూపాయి అయినా మాఫీ చేసిన్రా? ఒంటరి మహిళలకు పెన్షన్‌ ఇచ్చే దమ్ముందా? గిరిజన, ముస్లిం రిజర్వేషన్లు పెంచమంటే ప్రధాని మోదీ, అమిత్‌షా పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా పక్కన పెట్టిన్రు’ అని కేసీఆర్‌ అన్నారు. ఆయా సభల్లో ఇంకా ఆయనేమన్నారంటే...

ఆదిలాబాద్‌ సభలో...
కరెంటు తెస్తామంటే జానారెడ్డి ఎగతాళి చేసిండు. ఎంతో చిత్తశుద్ధితో కాపలాదారుల్లాగా పనిచేస్తే 24 గంటల విద్యుత్తు ఇచ్చుకోగలుగుతున్నం. సాధ్యమైనంత వరకు చాలా చేశాం. ఈ నాలుగున్నరేళ్లలో ప్రణాళికలకే ఎక్కువ సమయం సరిపోయింది. తప్పులు చేయకూడదన్న ఉద్దేశంతో అలా పనిచేయాల్సి వచ్చింది. మీ దయ వల్ల మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తది. ఎన్నికల తర్వాత సీఎస్, కేబినెట్‌ మంత్రులతో వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉంటా. ఇక్కడున్న సమస్యలు స్వయంగా పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చిపోతా. ఆదిలాబాద్‌ పట్టణంలో బస్తీల్లో కరెంటు ఎట్లుండె, ప్రస్తుతం ఎట్లున్నదో మనకు తెలుసు. గతంలో అనేక రకాల పేదరికం, అన్ని వృత్తులు నాశనం చేసిన్రు. చేనేత, యాదవులు, మత్స్యకారులు, గీత కార్మికుల బతుకులు దుర్భరమయ్యాయి. ప్రతి ఎన్నికల్లో లోయర్‌ పెన్‌గంగ పేరుతో ఓట్లు దండుకొనేవారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చనకా కొరటా బ్యారేజీ కడుతున్నాం. సాత్నాల వాగుపై చెక్‌డ్యాం నిర్మిస్తాం. సోత్నాల, సోమాల మండలాలను ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తాం. పద్మశాలీల కోరిక మేరకు ఆదిలాబాద్‌లో మినీ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తాం. 

కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ సభల్లో.. 
హైదరాబాద్‌ను నేనే కట్టిన అని చంద్రబాబు చెప్పకుంటడు. హైదరాబాద్‌ అసలు నిర్మాత కులీకుతుబ్‌షా ఏడ పోవాలే? ఆయనే గదా హైదరాబాద్‌ నిర్మించింది. మాట్లాడితే హైదరాబాద్‌ సిటీని ప్రపంచ పటంలో నేనే పెట్టిన అని చంద్రబాబు అంటడు.. నువ్వు పెట్టినవో సచ్చినవో మరి కరెంట్‌ ఏడ దాచి పెట్టినవ్‌? షానా మేధావిని, తెలివి కల్లోలం అని చెప్పుకునేటోళ్లు మీ హయాంలో 24 గంటల కరెంట్‌ ఎందుకు ఇయ్యలే? ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో పది లక్షల నగదు జమ అయ్యేవరకు ఉచిత కరెంట్‌ ఇస్తాం. వచ్చే టర్మ్‌లో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తెచ్చి ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు సాధిస్తాం. 

మందమర్రి, మంచిర్యాల సభల్లో.. 
ఎన్నికల్లో ఎప్పుడూ కన్‌ఫ్యూజన్‌లో ఓటు వేయవద్దు. ఓటును తమాషా కోసం వేస్తే, తరువాత ఐదేళ్లు మనం బాధపడాల్సి వస్తుంది. ఇందుకోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గత ఎన్నికల్లో గెలిచిన నేను నాలుగేళ్లు పూర్తిగా అభివృద్ధి ప్రణాళికపైనే దృష్టి పెట్టాను. తెలంగాణ తెచ్చిందే ఆకుపచ్చగా కావాలని. అందుకే కోటి ఎకరాల్లో సాగునీటిని అందించాలి. ఎక్కడికక్కడ పంటలు పండాలి. రైతులు క్షేమంగా ఉండాలి. మన దళితులు, మన గిరిజనులు, మన మైనార్టీలు అందరూ బాగుండాలి. మహిళలు సుఖంగా ఉండాలి. అలాంటి తెలంగాణ కోసం తిప్పలు పడుతున్నాం. కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు కచ్చితంగా రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంటు ఇస్తాం. రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తాం.

రామగుండం సభలో... 
కేసీఆర్‌ మీ బిడ్డ.. ఏరోజైనా.. మీ మేలు కోరుతానే తప్ప.. ప్రాణం పోయినా నష్టం రానివ్వా. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంట్‌ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. గోల్‌మాల్‌ గాళ్లు ఏదో చెప్తే నమ్మొద్దు. ఆలోచించి ఓటేయండి.

బెల్లంపల్లి సభలో.. 
జాతీయ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు దుర్మార్గమైన, ఛండాలమైన రాజకీయాలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో తిరుగుతూ అడ్డం దిడ్డంగా మాట్లాడుతున్నరు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర పాలన రావాల్సిన అవసరం ఉంది. అందుకు నేనే నాయకత్వం వహించబోతున్నా. కాంగ్రెస్, బీజేపీలు దేశానికి పట్టిన చీడ. ఇన్నాళ్లుగా కర్ర పెత్తనం చేస్తున్నాయి. ఇక ఆ ఆటలు సాగబోనివ్వం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement