జైపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి కాంగ్రెస్ అమ్ముడపోయిందని ఆరోపిస్తున్న టీఆర్‌ఎస్‌పై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమిపై కొందరు పనికట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు సీఎం కేసీఆర్ తనకు నచ్చిన కంపెనీలకే ఇస్తున్నారని, కమీషన్లు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే కట్ట బెడుతున్నారని దుయ్యబట్టారు. దానిలో భాగంగానే మెగా కృష్ణా రెడ్డి కంపెనీలకు 43,436 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పనులు అప్పగించారని, నవయుగ కంపెనీకి 17 వేల కోట్లు, అదేవిధంగా ఒకే కంపెనీకి 60,436 కోట్ల విలువచేసే ప్రాజెక్టుల నిర్మాణాలను అప్పజెప్పాడాన్ని ఆయన ప్రశ్నించారు.
భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఒకే కంపెనీకి ఇంతలా పనులు ఇవ్వలేదని గుర్తుచేశారు. కంపెనీలకు అధిక లాభం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడింతలు పెంచిందని విమర్శించారు. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని.. మెగా కృష్ణా రెడ్డి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మెగా కృష్ణా రెడ్డి కేసీఆర్‌కు ఏజెంటని, మిగతా వారు సబ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. (‘ఆ మంత్రులు మా సర్పంచ్‌తో సమానం’)
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరిట పట్టపగలే నిలువుదోపిడి చేస్తోందని.. ఇదంతా సీఎం కేసీఆర్ కనుసన్నుల్లోనే జరుగుతుందని ఆరోపించారు. ఎక్కడ, ఎప్పుడు ఏ కంపెనీలు కేసీఆర్‌కు ఎంత కమీషన్లు ఇచ్చాయో లెక్కలతో సహా నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రభుత్వ సొమ్మును కట్టుబెడుతున్నారన్నారు. ఇవన్నీ చేస్తూ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నారని కేసీఆర్ ఎలా అంటాడని ప్రశ్నించారు. తాను అడిగిన వాటన్నింటికీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (కూటమి పొత్తుల్లో కొసమెరుపు!)
Comments
Please login to add a commentAdd a comment