సాక్షి, హైదరాబాద్ : ఔర్ ఏక్ బార్.. కేసీఆర్ సర్కార్ అంటున్నాయి ఎగ్జిట్‌పోల్ సర్వేలు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజున ప్రముఖ ఇంగ్లిష్ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ టీఆర్‌ఎస్‌కే కాస్త అటు ఇటుగా అధికారం దక్కడం ఖాయమని అంచనా వేశాయి. రిపబ్లిక్‌టీవీ, టైమ్స్‌నౌ, ఇండియాటుడే, న్యూస్‌ఎక్స్.. ఇలా దాదాపు అన్ని జాతీయ చానళ్ల సర్వేలూ కేసీఆర్‌దే విజయమని సూచించాయి. టీఆర్‌ఎస్ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టైమ్స్‌నౌ, ఇండియాటుడే చానళ్లు చెప్పగా, రిపబ్లిక్ టీవీ 50–65 స్థానాలు, న్యూస్‌ఎక్స్ చానల్ 57 స్థానాలు టీఆర్‌ఎస్‌కు వస్తాయని పేర్కొంది.
కేసీఆర్ హవా ముందు ఏ శక్తీ నిలబడలేదని, ఆయనకు తెలంగాణ ప్రజలతో భావోద్వేగ సంబంధముందని వెల్లడించాయి. కాంగ్రెస్–టీడీపీల పొత్తే.. కేసీఆర్ విజయాన్ని సులభతరం చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని.. ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో వెల్లడైంది. కేసీఆర్ హాయాంలో అమలయిన సంక్షేమ పథకాలు కూడా మేలుచేకూర్చాయని, కేసీఆర్‌ది కుటుంబ పాలన అని, అవినీతి జరిగిందన్న ఆరోపణలను తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని తేల్చిచెప్పాయి. (‘మరోమారు కారుదే కుర్చీ’)
అంతా బాబే చేశాడు
జాతీయ చానెళ్ల ఎగ్జిట్‌పోల్స్ సందర్భంగా చర్చల్లో పాల్గొన్న రాజకీయ విశ్లేషకులు, నిపుణులు కూడా టీఆర్‌ఎస్ విజయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే పూర్తి కారణమని పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసిందని, తెలంగాణ వ్యతిరేకిగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తిగా ముద్రపడిన బాబుతో దోస్తీయే.. కాంగ్రెస్ పుట్టి ముంచిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన టీజేఎస్‌తో పొత్తు కూడా ఉపయోగపడలేదని విశ్లేషించారు. (తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్)
గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైనందునే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సభలను ముగిస్తూ ‘జై తెలంగాణ’అని చంద్రబాబు ముగించినప్పటికీ ఆయన్ను తెలంగాణ ప్రజానీకం నమ్మలేదనేది ఎగ్జిట్‌పోల్స్‌తో స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. తమకు బాబు శత్రువే ఉన్న భావనలో ఇంకా తెలంగాణ ప్రజలున్నట్టు వారు వ్యాఖ్యానించారు. మొత్తంమీద ఈ ఫలితాలు రాజకీయంగా కాంగ్రెస్‌తో పాటు ఏపీలోనూ టీడీపీకి పెద్ద మొత్తంలో నష్టం చేకూరుస్తాయని పేర్కొన్నారు.
కేసీఆర్.. హార్ట్‌టచ్
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడని, ఆయనకు తెలంగాణ ప్రజలతో భావోద్వేగ సంబంధాలున్నాయని కూడా జాతీయస్థాయి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హాయాంలో కుటుంబ పాలన జరిగిందని, అవినీతి పెచ్చుమీరి పోయిందన్న ఆరోపణలున్నాయని, అయినా వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని, కేసీఆర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలనే భావనే పోలింగ్ సరళిలో కనిపించిందంటున్నారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించాయని, రైతు బంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయని పేర్కొన్నారు. (‘కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తాం’)
కేసీఆర్‌పై ఎన్ని ఆరోపణలున్నప్పటికీ ఆయన తెలంగాణ సమాజానికి కీడు చేసే వ్యక్తి కాదనే అభిప్రాయం కారణంగానే ప్రజలు టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపి ఉంటారని వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన సెటిలర్ల విషయంలో గత నాలుగేళ్లలో ఎలాంటి చిన్న ఘటనలు కూడా జరగలేదని, ఇది కూడా టీఆర్‌ఎస్‌కు లాభించిందని విశ్లేషించారు. గత నాలుగేళ్లలో రూ.3.5లక్షల కోట్లను ఖర్చు చేసి విద్యుత్ అందించారని, ఇది కూడా ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు చాలా బాగా కలిసొచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (అర్బన్ ఓటర్ సిగ్గుపడాలి: కొరటాల శివ)
బీజేపీకి నష్టమే.. కానీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు భంగపాటేనని జాతీయ రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కనీసం ప్రతిపక్ష స్థాయికి వెళ్లాలన్న ఆ పార్టీ ఆశలు మరోసారి అడియాశలు అయ్యాయని, బీజేపీని గట్టెక్కించాలని అమిత్‌షా చేసిన యత్నాలు కూడా ఫలించలేదని విశ్లేషించారు. తెలంగాణ యోగి (ఆదిత్యనాథ్)గా గుర్తింపు పొందిన స్వామి పరిపూర్ణానందను ఉపయోగించుకోవడంలో బీజేపీ విఫలం అయిందని చెప్పిన విశ్లేషకులు.. కేసీఆర్ రూపంలో భవిష్యత్ మిత్రుడు మాత్రం లభించాడని చెప్పడం విశేషం.
వివిధ జాతీయ చానళ్లు, సంస్థల ఎగ్జిట్ పోల్స్ వివరాలివీ
Comments
Please login to add a commentAdd a comment