మాట్లాడుతున్న డీసీపీ మల్లారెడ్డి, చిత్రంలో డీఆర్‌డీఓ జయచంద్రారెడ్డి
జనగామ అర్బన్ : పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూపు–4 పోటీ పరీక్షల కోసం అర్హులైన వారికి 60 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీసీపీ మల్లారెడ్డి, డీఆర్‌డీఓ మేకల జయచంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ, పోలీస్‌శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘వారధి’ సంస్థ కరీంనగర్ సహకారంతో సుమారు 400 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇందుకు సంబంధించిన ఖర్చులను సదరు సంస్థ భరిస్తుందని తెలిపారు. శిక్షణార్థులకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థల ప్రతినిధులు తరగతులు బోధిస్తారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్‌న్లలో ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని తమ పేర్లను నమోదు చేసుకుని, వెంటనే అర్హత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ పొందవచ్చునని తెలిపారు.
అదేవిధంగా వీఆర్వో, గ్రూపు–4 పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలోని చాకలి అయిలమ్మ జిల్లా సమాఖ్యలో ఈనెల 22 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని డీఆర్‌డీఓ మేకల జయచంద్రారెడ్డి కోరారు. ఈనెల 24న యశ్వాంతాపూర్ గ్రామ శివారులోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం కానిస్టేబుల్స్ అభ్యర్థులకు, మధ్యాహ్నం వీఆర్వో, గ్రూపు–4 అభ్యర్థులకు అర్హత పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు.
అభ్యర్థులు కూడా ఉచిత శిక్షణ అని అనుకోవద్దని, ప్రమాణాలు పాటించి నిష్ణాతులైన వారిచే బోధించనున్న తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే పీహెచ్‌సీ (వికలాంగ) అభ్యర్థులకు వసతి కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో మాలతి, ఏసీపీ బాపురెడ్డి, డీఆర్‌డీఓ కార్యాలయ అధికారి రాజేంద్రప్రసాద్, ఈజీఎస్ ప్రతినిధులు, ఆయా మండలాల పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment