ఇద్దరు చంద్రులు గురుశిష్యులే
వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులిద్దరూ గురుశిష్యులేనని టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనపై ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే.. ఒకరు ఓటుకు నోటు.. మరొకరు ఫోన్ ట్యాపింగ్ అంటూ వివాదం సృష్టించారన్నారు. తెలంగాణ బిల్లులో సెక్షన్-8 చేర్చినప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేయలేదనీ, ఇపుడు ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని చెప్పే దమ్ము సీఎం కేసీఆర్‌కు ఉందా? అన్నారు. ఇద్దరు సీఎంలు తమ పదవులకు రాజీనామా చేసి క్షమించమని ప్రజలను కోరాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఈ తతంగం చేస్తున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకుంటున్నారని, ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.