తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కిరణ్ సర్కార్‌లో పదవులను అనుభవించిన మంత్రులు.. ఇప్పుడెలా గొప్పవారయ్యారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కిరణ్ సర్కార్‌లో పదవులను అనుభవించిన మంత్రులు.. ఇప్పుడెలా గొప్పవారయ్యారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ‘పొన్నాల నన్ను విమర్శించేంత వాడయ్యాడా? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే అక్రమ ప్రాజెక్టును నిర్మించారు. వాటి విజయ యాత్రకు కూడా వెళ్లావు. అలాంటి వ్యక్తుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెడతామా?’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. పొన్నాలకు అప్పనంగా టీపీసీసీ పదవి వచ్చిందని వ్యాఖ్యానించారు. జగిత్యాలకు చెందిన డాక్టర్ సంజయ్ బుధవారం తన అనుచరులతో టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. మంచి నాయకత్వముంటేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతుందన్నారు. ‘విజన్ ఉన్నవాడే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించాలి. అప్పుడే అభివద్ధి సాధ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఊరికే ఇవ్వలేదు. ఉద్యమం ద్వారానే రాష్ర్టం సాకారమైంది. ఉద్యమాన్ని నడిపించిన టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివద్ధి సాధ్యమవుతుంది’ అని కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం...ఇక అభివద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. కాగా, మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ టికెట్‌ను లక్ష్మికే ఇవ్వాలంటూ ఆమె మద్దతుదారులు బుధవారం ఇక్కడి తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు. అయితే ఆ సమయంలో కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాన్ని అధినేత దష్టికి తీసుకెళతామని పార్టీ కార్యాలయ సిబ్బంది వారికి నచ్చజెప్పారు.