జిల్లా సమీక్షా మండలి సమావేశం జరిగి రేపటికి ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం అక్టోబర్ 31న జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
సాక్షి, కరీంనగర్ : జిల్లా సమీక్షా మండలి సమావేశం జరిగి రేపటికి ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం అక్టోబర్ 31న జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పొన్నాల కన్నా ముందు జిల్లా ఇన్‌చార్జి లుగా ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, ముఖేష్‌గౌడ్ డీఆర్సీ సమావేశాల పట్ల ఆసక్తి ఊపలేదు. జూపల్లి కృష్ణారావు ఒకే సమావేశానికి పరిమితమయ్యారు. ఆయన రాజీనామా చేసిన తరువాత జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్‌గౌడ్ అసలు తన ముఖమే చూపించలేదు. ఇదే విషయాన్ని విపక్షసభ్యులు తొలి సమావేశంలోనే పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తెచ్చారు.
తాను పక్క జిల్లా వాణ్నేనని, మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తానని గట్టిగా చెప్పినా ఆయన కూడా పాత మిత్రుల బాటలోనే నడిచారు. జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు దిశానిర్ధేశం చేయడం, ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం, తక్షణ సమస్యలను చర్చించడం, వాటికి పరిష్కారాలను సూచించడం కోసం ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు జిల్లాస్థాయి అంశాలపై సూచనలు చేసేందుకు ఇవి దోహదపడతాయి. గత ఏడాది కాలంలో జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడినా వాటికి పరిష్కారం చూపాల్సిన డీఆర్సీ నిర్వహణపై ఇన్‌చార్జి మంత్రి నిర్లక్ష్యంగానే వ్యవహరించారు.
ఆగస్టు 17న డీఆర్సీ సమావేశానికి ఏర్పాట్లు చేసిన అధికారులు.. పొన్నాల లక్ష్మయ్య సమయం ఇవ్వకపోవడం వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. వివిధ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు గత నెల 27న జిల్లాకు వచ్చిన మంత్రి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. పనిలో పనిగా ప్రధాన శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. అక్కడే ఆయన డీఆర్సీ తేదీని ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారం ఈనెల 18న ఈ సమావేశం జరగాలి.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జైత్రయాత్ర కోసం ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. తర్వాత ఇన్‌చార్జి మంత్రి సమావేశం ఊసే మర్చిపోయారు. కేవలం మంత్రులకు తీరిక లేనందువల్ల కీలకమైన ఈ సమావేశాలు నెలల తరబడి జరగకపోవడం ప్రగతిపై ప్రభావం చూపుతోంది. అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు జిల్లా రైతాంగాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. అన్ని పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి తలుచుకుని చేసిన అప్పులు తీర్చేదెలాగో అర్థంకాక వారంలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేలాది మంది తమ రెక్కల కష్టం నీటిపాలై తల్లడిల్లుతున్నారు. వారికి అండగా నిలుస్తామన్న భరోసా నివ్వడానికైనా డీఆర్సీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.