కేబినెట్ సలహా మేరకే నడుచుకుంటా! | Will act according to cabinet advise, says pranab mukherjee | Sakshi
Sakshi News home page

కేబినెట్ సలహా మేరకే నడుచుకుంటా!

Published Tue, Nov 5 2013 2:29 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Will act according to cabinet advise, says pranab mukherjee

విభజనపై టీ కాంగ్ నేతలతో రాష్ట్రపతి
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు చర్యలు తీసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. తెలంగాణ అంశంపై 2000 సంవత్సరం నుంచీ తనకు పూర్తి అవగాహన ఉందని, అన్ని ప్రాంతాలు, వర్గాలు, పార్టీల నేతలతో మాట్లాడానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటానని చెప్పినట్టు ఆయనను కలిసిన అనంతరం నేతలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతిని కలిశారు. వారికంటే ముందు అపాయింట్‌మెంట్ ఉన్న నేతలంతా రాష్ట్రపతిని త్వరగా కలిసి వెళ్లిపోవడంతో నిర్ణీత సమాయానికి 20 నిమిషాల ముందే టీ కాంగ్రెస్ నేతలు ఆయనను కలిశారు. ఆ సమయానికల్లా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ సహా సుమారు 20 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రణబ్‌ను కలిశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఆ తర్వాత రావడంతో వారు రాష్ట్రపతిని కలవకుండానే వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రణబ్‌ను కలిసిన అనంతరం నేతల తరపున ఉత్తమ్, పాల్వాయి మాట్లాడారు. తెలంగాణ అంశంపై 2000 నుంచీ తనకు లోతైన అవగాహన ఉందని, జరిగిన వాస్తవ పరిణామాలన్నీ తనకు తెలుసని ఆయన చెప్పారని వివరించారు. ‘‘దీనిపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, పార్టీలు, వర్గాల ప్రజలతో గతంలో అనేకసార్లు మాట్లాడాను. రాష్ర్టపతిగా ఈ విషయంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడంతో పాటు కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు చర్యలు తీసుకుంటాను’ అని ప్రణబ్ స్పష్టం చేయడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపి వెనుదిరిగామన్నారు.
 
 రాష్ర్టపతితో డీఎస్ ప్రత్యేక భేటీ
  టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో పాటుగా రాష్ర్టపతిని కలవలేకపోయిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సోమవారం రాత్రి పదింటికి ఆయనతో ప్రత్యేకంగా భే టీ అయ్యారు. తెలంగాణ ఆవశ్యకతను ఆయనకు వివరించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు కూడా రాష్ట్రపతిని కలిసి, విభజన నిర్ణయం నేపథ్యంలో రాష్ర్టం ఇబ్బందుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని అనంతరం మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement