* సీమాంధ్రకు ఆదాయ లోటు పూడేందుకు 20 ఏళ్లు పడుతుంది
* రాష్ట్రపతి ప్రణబ్‌కు జగన్ లేఖ
* ఐదేళ్లు పరిశ్రమ నిర్మాణానికే చాలవు
* సహజ వాయువుపై ఆంధ్రప్రదేశ్‌కు రాయల్టీ ఇవ్వండి
* ప్రధాని ఇచ్చిన హామీలు బిల్లులో అంతర్భాగం కాదు
* ప్రతి హామీకీ చట్టబద్ధత కల్పించేలా చూడండి
* కెమెరాలు ఆపి, ఎంపీలను సస్పెండ్ చేసి విభజిస్తారా?
* మన అతి పెద్ద ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక బ్లాక్ డే
* మెజారిటీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా విభజన
* అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
* శాయశక్తులా కృషి చేసింది
* కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు దేనికి సంకేతం?
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రకటించిన ఐదేళ్ల ప్రత్యేక హోదా ఎంతమాత్రం సరిపోదని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి సోమవారం ఆయన సవివరమైన లేఖను రాశారు. విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం నేపథ్యంలో దీనిపై వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్‌మెంట్ కోరినా లభించకపోవడంతో లేఖ రాస్తున్నట్టు వివరించారు. ‘‘ఒక పరిశ్రమ నిర్మించాలంటేనే మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధికి వీలైన మరో వనరు వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు కూడా ఈ సమయం చాలదు. పైగా విభజన వల్ల ఏర్పడబోయే ఆదాయ లోటును పూరించుకోవడానికి కూడా కనీసం 20 ఏళ్లు పడుతుంది. అలాంటప్పుడు ఐదేళ్లు ఎలా సరిపోతుంది?’’ అని ప్రశ్నించారు. కాబట్టి 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు కనీసం 15 ఏళ్లు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరారు.
లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...
లోక్‌సభలో టీవీ కెమెరాలను ఆపేసి, సీమాంధ్ర ఎంపీలందరినీ సస్పెండ్ చేసి ఆమోదించిన తీరు చూసి దేశమంతా నివ్వెరపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న మన దేశంలో ఇదొక బ్లాక్ డే అని భావిస్తున్నాను. ఇలాంటి దాన్ని చూసి నాలాంటి యువ ఎంపీలు నేర్చుకునేది కూడా ఏమీ లేదు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ అడ్డగోలు విభజనను అడ్డుకునేందుకు మా పార్టీ శాయశక్తులా కృషి చేసింది. ఇలాంటి దుస్సంప్రదాయం ఏర్పడకుండా అడ్డుకోవడానికి అన్ని ప్రతిపక్షాల మద్దతూ కూడగట్టేందుకు మా పార్టీ ప్రయత్నం చేసినా ఆ కష్టం వృథా అయింది. రాజ్యాంగంలోని మూలసూత్రాలు, సంప్రదాయాలు, విధానాలు, పద్ధతులను గాలికొదిలేసి... అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కలసిపోయి విభజనకు పూనుకుంటే మాలాంటి వారు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.
అత్యంత తొందరపాటు చర్య
అధికారపక్షం అత్యంత తొందరపాటుతో, దేశ ప్రతిష్టను మట్టిలో కలిపేలా విభజన బిల్లును తీసుకొచ్చింది. లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించకుండా, బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చ జరగకుండా రాజ్యసభలో దాని ఆమోదానికి అనుమతించబోమన్న బీజేపీ ఒక్కసారిగా అధికార పక్షంతో ఎందుకు కలసిపోయిందో ఆ పార్టీకే తెలియాలి. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రాన్ని ఎలాంటి రాజ్యాంగ విధానాలు, సంప్రదాయాలు పాటించకుండా విభజించారు. కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే ఏదైనా కమిటీ లేదా కమిషన్ సిఫార్సు చేయాలనే విధానాన్ని కూడా పాటించలేదు. శాసనసభ, శాసనమండలి తిరస్కరించిన బిల్లును కేంద్రం అనైతికంగా పరిగణనలోకి తీసుకుంది. పదేళ్లు అధికారంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం పదవీకాలం చివరిలో అది కూడా మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికల షెడ్యూలు వెలువడుతున్న నేపథ్యంలో ఇంత ముఖ్యమైన అంశాన్ని తెరమీదకు ఎందుకు తెచ్చింది?
రాజ్యసభలో కూడా లోక్‌సభ పరిస్థితే పునరావృతమైంది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారని తాము భావించడం లేదు గనుక సవరణలు ప్రతిపాదించలేకపోయామన్న బీజేపీ, చివరకు రాజ్యసభలో 20 పై చిలుకు సవరణలు ప్రతిపాదించింది. అవి కూడా ఏ మాత్రం స్పష్టత లేని విధంగా పెట్టారు. వాటికి అంగీకరించనిదే బిల్లును ఆమోదించేది లేదన్నారు. తరవాత ఏమైందో గానీ, అందుకు పూర్తి విరుద్ధంగా, లోక్‌సభలో మాదిరిగానే ఉద్దేశపూర్వకంగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదానికి పూర్తిగా సహకరించారు. తమ సవరణలు వేటినీ అంగీకరించకున్నా ఇలా సహకరించడం ఆశ్చర్యం కలిగించింది. తమ సవరణలపై ఓటింగ్ జరగాలన్న బీజేపీ కోరితే సభ ఆర్డర్‌లో లేనందున అందుకు అనుమతించలేనన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు, మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించేందుకు మాత్రం అది అడ్డు రాలేదు.
చావు దెబ్బ కాదా?
ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీలు బిల్లులో అంతర్భాగం కాదు. మరి వాటికి చట్టబద్ధత ఉందా? అవి చట్టం ముందు నిలబడతాయా? ఇవన్నీ ప్రశ్నలే. త్వరలో ఇంటికి వెళ్లనున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలకు వచ్చే ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా? విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఏమిటో స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక ప్రోత్సాహకాల విషయమూ అంతే. పైగా పారిశ్రామికీకరణను, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు తదితరాలను రెండు రాష్ట్రాలకూ ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అలాంటప్పుడు, హైదరాబాద్ ఐటీ, ఉత్పాదక రంగాల్లో తన వాటాకు అసలే నోచుకోని ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందగలదు? పైగా అక్కడ తొలి ఏడాదే రూ.15,000 కోట్ల భారీ ఆదాయ లోటు ఏర్పడుతుంది. అది ఏడాదికేడాదికి పెరుగుతూ పోతుంది. ఆర్థిక వృద్ధికి కేంద్రమైన హైదరాబాద్ లేకుండా ఈ లోటును పూడ్చుకోవడం ఎప్పటికీ సాధ్యపడదు. కానీ కేవలం తొలి ఏడాది లోటును మాత్రం కేంద్ర బడ్జెట్ నుంచి పూడుస్తామని ప్రకటించి ఊరుకున్నారు. తర్వాతి లోటునెలా పూడుస్తారంటే స్పష్టత లేదు. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకోవడానికి కనీసం మరో 20 ఏళ్లైనా పడుతుంది. ఆంధ్రప్రదేశ్ పాలిట ఇది చావుదెబ్బే అవుతుంది.
కృష్ణా నది కింద ఉన్న 11 జిల్లాల ఆయక ట్టులో రెండున్నర జిల్లాలు తెలంగాణలో ఉంటే, ఎనిమిదిన్నర జిల్లాలు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. నదీ ముఖద్వారం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో ఉంది. సీమాంధ్ర జిల్లాల భవిష్యత్తు దృష్ట్యా ఈ ముఖద్వారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ‘మార్చడానికి వీలులేని ప్రాంతం’గా ప్రకటించాలి. ఎందుకంటే అల్మట్టి, బాబ్లి వంటి ప్రాజెక్టుల కారణంగా మన రాష్ట్రం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలతో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది.
కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు జీవగర్ర అయిన దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాములకు సంబంధించిన గేట్లు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండింట్లోనూ ఉన్నందువల్ల వాటి సరిహద్దులను, యాజమాన్యాలను, నిర్వహణ సంబంధిత నిర్దేశిక సూత్రాలను స్పష్టంగా పేర్కొనాలి.
ఛత్తీస్‌గఢ్ మాదిరిగానే జరుగుతుందేమో!
కొత్త రాజధాని నిర్మాణానికి నిధులెలా వస్తాయి? కేంద్రం ఏ విధంగా ఆర్థిక సాయం చేస్తుందనే అంశంపై స్పష్టత లేదు. రాజధాని అంటే కేవలం శాసన సభ, మండలి, హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ భవనాలు మాత్రమే కాదని గుర్తించాలి. అన్యాయంగా హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందకుండా చేశారనేది గుర్తించాలి. అందుకనుగుణంగా పరిహారం ఇవ్వాలి. కొత్త రాజధానికి ఎంత సమయంలో నిధులు కేంద్రం సమకూరుస్తుందనే విషయాన్ని కూడా బిల్లులో పొందుపరచలేదు. సాదాసీదా మెట్రో వ్యవస్థ ఏర్పాటుకే రూ.20 వేల కోట్లు, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కనీసం రూ.5 వేల కోట్లు కావాలనే విషయం ఆలోచించాలి. అందుకే, నిర్ణీత వ్యవధిలో కేంద్రమే సొంత ఖర్చుతో రాజధానిని నిర్మించాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటైనప్పుడే దానికి రూ.10 వేల కోట్లు అవసరముండగా, రాష్ట్రం ఏర్పడి పద్నాలుగేళ్లయినా ఇప్పటికే కేంద్రం ఇచ్చింది కేవలం రూ.400 కోట్లు మాత్రమే! ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అలాగే జరుగుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ భయాందోళనలను పారదోలే విధంగా పరిష్కారానికి పూనుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వ మూలధనమున్న సింగరేణి బొగ్గు గనుల సంస్థే రాష్ట్రంలో ఏకైన విద్యుదుత్పాదన వనరు. అలాంటి కంపెనీలో అవశేష ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వడం లేదు. కాబట్టి కనీసం రాష్ట్రం నుంచి వెలికి తీసే సహజవాయువు (ఆన్-షోర్, ఆఫ్-షోర్)పై రాయల్టీని కేంద్రం తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలి. ఎందుకంటే సహజవాయవు వెలికితీత వల్ల భూకంపం, మత్స్య సంపద వేటకు భంగం వంటి దుష్ఫలితాలను ఎదుర్కోబోయేది ఆ రాష్ట్రమే. దానివల్ల స్థానికంగా ఉత్పత్తయ్యే సహజ వాయువు సరసమైన ధరకు అందుబాటులోకి వస్తుంది.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు కనీసం పదిహేనేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఈ లేఖలో నేను వివరించిన అంశాలన్నింటినీ చట్టబద్ధతకు నిలబడేలా పరిష్కరించాలని కోరుతున్నాను.
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి