* రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదం.. ముంపు గ్రామాలపై గెజిట్ నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. తదనుగుణంగా గురువారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014కు తొలి సవరణ ఇది. చట్టంతోపాటే ఇదీ అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు లేనందున రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) ఆర్డినెన్స్, 2014గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం రెండో భాగంలోని సెక్షన్ 3లో ఖమ్మం జిల్లాను నిర్వచిస్తూ ‘2005 జూన్ 27వ తేదీ నాటి సాగునీటి శాఖ విడుదల చేసిన జీవో ఎం.ఎస్.111 ప్రకారం ఉన్న రెవెన్యూ గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సీతారామనగరం, కొండ్రేకలను మినహాయించి’ అని నిర్వచించారు.
నిర్వాసితులకు అక్కడే పునరావాసం కల్పించేందుకు వీలుగా మండలాలను యూనిట్‌గా తీసుకుని సీమాంధ్రలో కలపాలన్న డిమాండ్ మేరకు గత యూపీఏ ప్రభుత్వం మార్చి 2న ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్‌లో నిర్ణయించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, చట్టం అమల్లోకి రాక ముందే హడావుడిగా సవరణ తేవడం సమంజసంగా ఉండదన్న భావనతో రాష్ట్రపతి ఆ ఫైలును తిప్పిపంపారు. దీంతో తాజాగా ఎన్‌డీఏ ప్రభుత్వం మంగళవారం కేబినెట్‌లో ఆ సవరణను ఆమోదించింది. దీని ప్రకారం ఖమ్మం జిల్లాను పునర్‌నిర్వచించారు.
పాల్వంచ డివిజన్‌లోని కుకూనూరు, వేలేరుపాడు, బూర్గుంపాడు (రెవెన్యూ గ్రామాలు పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెండి, మోతెపట్టినగర్, ఉప్పుశాక, నకిరీపేట, సోంపల్లి గ్రామాలు మినహా), మండలాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలు మినహాయిస్తూ ఖమ్మం జిల్లాను నిర్వచించారు. అంటే ఈ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమవుతాయి.
పోలవరం ఆర్డినెన్స్‌కు ఓకే
Published Fri, May 30 2014 1:35 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM
Advertisement