బిల్లును పార్లమెంట్‌కు పంపవద్దని రాష్ట్రపతిని కోరాం: సీఎం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్క్షప్తి చేశామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేందమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు బుధవారం సాయంత్రం రాష్ట్రపతిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ, కౌన్సిల్ లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్వవస్థీకరణ బిల్లు-2013 ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశామని సీఎం తెలిపారు.
చరిత్రలో అసెంబ్లీలో తిరస్కరించిన తర్వాత ఏ రాష్ట్రం ఏర్పాటు జరుగలేదు అని సీఎం కిరణ్ తెలిపారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అని సీఎం అన్నారు. ప్రజలందరి కోరిక మేరకే విభజన చేపట్టాల్సి ఉంటుంది అని అన్నారు. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో విభజన జరిగితే బాగుంటుందన్నారు. కాని విభజన జరిగితే తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని రాష్ట్రపతికి తెలిపామని సీఎం మీడియాతో అన్నారు. విభజన జరిగితే జలాల వివాదాలు చోటుచేసుకుంటాయి, విద్యుత్ సమస్యలు తెలెత్తే అవకాశం ఉంది ఆయన అన్నారు.
రాష్ట్రపతి, రాజ్యాంగంపై మాకు పూర్తి నమ్మకం ఉంది అని సీఎం అన్నారు. అసెంబ్లీ, మండలి తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌కు పంపవద్దని రాష్ట్రపతిని కోరామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి నాలుగు పేజీల వినతిపత్రాన్ని సమర్పించినట్టు సీఎం తెలిపారు. రాష్ట్రపతి విచక్షణ మేరకే ఆర్టికల్ 3ని ఉపయోగించాలి సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రతినిధులు కలిసిన తర్వాత రాష్ట్రపతితో సీఎం ఏకాంతంగా భేటి అయ్యారు.