రాష్ట్ర విభజన అంశంలో సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు రాసిన లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పరిశీలనార్థం పంపారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంలో సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు రాసిన లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పరిశీలనార్థం పంపారు. విభజన ప్రక్రియలో గత సంప్రదాయాలను విస్మరించి, ఇష్టానుసారం ముందుకెళ్లరాదని సూచిస్తూ, సీఎం శుక్రవారం రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఫ్యాక్స్‌లో అందిన ఈ లేఖను ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలమేరకు రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర హోంశాఖకు పంపినట్టు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఏ ముఖ్యమంత్రి లేఖనైనా పరిశీలన, తదుపరి చర్యలకోసం సంబంధిత శాఖకు లేదా ప్రధాని కార్యాలయానికి పంపుతారని, అలాగే కిరణ్ లేఖనూ పంపారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విభజనపై జీవోఎం కసరత్తు సాగుతున్నందున సీఎం లేఖపై ప్రభుత్వపరంగా ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు ఉండబోవని, జీవోఎం తదుపరి సమావేశంలో దీనని పరిశీలించే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
ఆ లేఖ సంగతి తెలియదు: దిగ్విజయ్
సీఎం లేఖపై స్పందించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ నిరాకరించారు. విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించగా ‘లేఖ విషయం నాకు తెలియదు’ అంటూ వెళ్లిపోయారు.