సంప్రదాయాలు పాటించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
సంప్రదాయాలు పాటించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
Published Sat, Oct 26 2013 2:28 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మెజార్టీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఉన్నాయని, కనీసం సంప్రదాయాలు, విధానాలు పాటించడం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన లాంటి కీలకమైన విషయాన్ని కేంద్ర మంత్రివర్గం టేబుల్ అంశంగా తీసుకోవడం శోచనీయమని తెలిపారు. రాష్ర్ట విభజన బాధితుడిగా మీరైనా సంప్రదాయాలను పాటించాలని, అందులో భాగంగా ముందుగా తీర్మానాన్ని అసెంబ్లీకి పంపించాలని కోరారు. అసెంబ్లీ తీర్మానం అనంతరమే బిల్లును రాష్ట్రపతికి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత రాష్ట్రపతి నుంచి బిల్లు అసెంబ్లీకి వచ్చేలా చూడాలన్నారు. ఈ మేరకు సీఎం శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్ర విభజన విషయంలో సంప్రదాయాలను పాటిస్తూ తొలుత రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని, అప్పటివరకు తెలంగాణ నోట్‌పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోరాదని కోరారు. కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలన్నీ సంప్రదాయాలను తోసిపుచ్చే విధంగా ఉన్నాయన్నారు. గతంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు అనుసరించిన నియమ నిబంధనలు, సంప్రదాయాలను ఇప్పుడు విస్మరించారని పేర్కొన్నారు.
అప్పట్లో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేసిన విషయం గుర్తుచేశారు. 2009 డిసెంబర్ 9న అప్పటి హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనలో ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం..అందుకు అవసరమైన తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెడతాం’’ అని చెప్పారని గుర్తుచేశారు. అదే నెల 23వ తేదీన చిదంబరం మరో ప్రకటన చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలతో విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత, ఏకాభిప్రాయం సాధించాకే కేంద్రం ముందుకు వెళ్తుందని చెప్పారని సీఎం తన లేఖలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన రాజ్యసభలో ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ విభజన విషయంలో ప్రత్యేకంగా హైదరాబాద్ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాతనే, రాజ్యాంగం, గతంలో అనుసరించిన విధానాల ఆధారంగా ముందుకు వెళ్తామని ప్రకటించిన విషయం గుర్తు చేశారు. రాష్ట్ర విభజన నీటిపారుదల నిర్మాణాలను నిట్టనిలువునా చీల్చుతుందని, ఇది గతంలో ఏ రాష్ట్రంలో, దేశంలో జరగలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ రాజధానిగా ఉండటం వల్లనే ఇక్కడ ఉద్యోగాలు, విద్య, వైద్య మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని, రాష్ట్ర విభజనతో ఈ అవకాశాలను మెజారిటీ ప్రజలు కోల్పోతారని సీఎం ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉన్న రాజధానిని కొత్తగా ఏర్పాటు చేస్తు న్న రాష్ట్రానికి ఇవ్వడం అనేది కూడా ఎక్కడా జరగలేదన్నారు. జీవోఎంలో జలవనరులు, పట్టణాభివృద్ధి, విద్యుత్, మానవ వనరులు వంటి కీలక శాఖల మంత్రులు, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు ఉంటారని ముందుగా పేర్కొనప్పటికీ వారు లేకుండా కమిటీ ఏర్పా టు చేయడం అనేక అనుమానాలకు తావు ఇస్తోందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని సిఫారసులను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. సీమాంధ్ర సమస్యలపై పార్టీ తరఫున ఏర్పాటైన ఆంటోనీ కమిటీ పని పూర్తికాకముందే విభజన దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు సంబంధించి రాజ్యాంగంలోని అధికరణం 371 (డి) గురించి ఎలాంటి కసరత్తు జరగలేదని తెలిపారు. దీన్ని విస్మరించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.
Advertisement
Advertisement