నేను చేసిన తప్పేంటి: పొన్నాల
‘గేమ్’ భూ కేటాయింపులు నా పరిధిలో లేవు
సాక్షి, హైదరాబాద్: గేమింగ్ యానిమేషన్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (గేమ్) పార్కు భూ కేటాయింపుల్లో తనకేమీ సంబంధంలేదని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టంచేశారు. దానిలో తాను చేసిన తప్పేమిటో చెప్పాలన్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు తనపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. గురువారమిక్కడ పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీఐఐసీ స్వాధీనంలో ఉన్న ఆ భూమిలో కొంత భాగాన్ని గతంలో బయోడైవర్సిటీ, మెట్రోరైలు, ట్రాన్స్‌కోలకు కేటాయించగా.. మరికొంత భూమిని గేమ్ పార్కు నిర్మాణానికిచ్చారు. శంకుస్థాపన నిర్ణయం కూడా సీఎం, అధికారులు తీసుకున్నారు. అలాంటప్పుడు నన్ను టార్గెట్ చేయడమేంటి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేయడం ద్వారా ఆ భూమిని వారికి కావాల్సిన పారిశ్రామికవేత్తకు దక్కేలా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు ప్లాన్ చేసినట్లు కన్పిస్తోందన్నారు.