అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. వాటి పరిశీలన అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులెవరో గురువారం తేలనుంది. ఇప్పటికే బీఫాంతో నామినేషన్ వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు రెబెల్‌గా నిలిచిన వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. తీరొక్క విధంగా నచ్చజెబుతూ.. బతిమిలాడుతూ.. బరి నుంచి తప్పించేం దుకు నానా పాట్లు పడుతున్నారు. ‘అన్నా.. జర నీ దయనే’ గెలిస్తే మనకు మంచి భవిష్యత్ ఉంటుందని.. పోటీ నుంచి తప్పుకోవాలని సర్ది చెబుతున్నారు. కలిసికట్టుగా పనిచేసి.. పార్టీ ప్రతిష్టను నిలబెడుతూ విజయం వైపు పయనిద్దామంటూ సూచిస్తున్నారు.
సాక్షి,ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ పత్రాల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రతి అంశం కీలకం కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఓట్లు చీలడంతోపాటు బలమైన ప్రత్యర్థి గెలుపునకు దోహదపడే అవకాశం ఉండడంతో ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా.. స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేసిన వారిని బుజ్జగించేందుకు.. అనునయించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వారిని ఒప్పించేందుకు.. మెప్పించేందుకు ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఫజల్ అహ్మద్‌తో కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు సమావేశమై.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి విరమించుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక వైరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రాములునాయక్ కూటమి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఆయనను పోటీ నుంచి తప్పించేందుకు ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలమయ్యాయి. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త వర్గం ఆయనకు తోడ్పాటు అందిస్తుండడంతో తాను రంగంలో ఉండి తీరుతానని రాములునాయక్ సొంత పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇల్లెందులో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వారిలో అనేక మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బాణోత్ హరిప్రియ నామినేషన్ వేయగా.. తిరుగుబాటు అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, దళ్‌సింగ్, చీమల వెంకటేశ్వర్లు, కిషన్‌నాయక్ తదితరులు నామినేషన్లు వేశారు. వీరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇల్లెందులో గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కు మెండుగా ఉన్న సమయంలో తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉండడం పార్టీకి శ్రేయస్కరం కాదని, ప్రభుత్వం ఏర్పడితే అనేక అవకాశాలు వస్తాయని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో మాట్లాడేందుకు అవసరమైతే టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అశ్వారావుపేటలో ప్రజాకూటమి ఎన్నికల పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన సున్నం నాగమణి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వారిలో పలువురు ఇప్పటికే ప్రజాకూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు బహిరంగ మద్దతు ప్రకటించగా.. నాగమణి మాత్రం ఎన్నికల బరిలో దిగడంతో ఆమెను బరిలో నుంచి తప్పించడానికి ఇటు టీడీపీ.. అటు కాంగ్రెస్ నేతలు తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో ఓ ముఖ్య నేత ఆశీస్సులతో టికెట్ కోసం ప్రయత్నించిన సున్నం నాగమణి నామినేషన్ ఉపసంహరణకు సైతం ఆ ముఖ్య నేత ద్వారా నాగమణిని ఒప్పించేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. వైరా నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి బాణోతు విజయ నామినేషన్ దాఖలు చేయగా.. తిరుగుబాటు అభ్యర్థిగా లాల్‌సింగ్ నామినేషన్ వేశారు. ఆయన చేత నామినేషన్ ఉపసంహరింప జేయడానికి సీపీఐ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. పాలేరు వంటి స్థానాల్లో స్వతంత్రులు అత్యధికంగా నామినేషన్ దాఖలు చేయగా.. వారు ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేసేందుకు ఆయా పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment