దావత్‌ కోసం వెళ్లి.. పిడుగుకు బలై..  | Three Dead As Lightning Strike Hits In Jangaon District | Sakshi
Sakshi News home page

దావత్‌ కోసం వెళ్లి.. పిడుగుకు బలై.. 

Published Fri, Oct 7 2022 1:43 AM | Last Updated on Fri, Oct 7 2022 1:43 AM

Three Dead As Lightning Strike Hits In Jangaon District - Sakshi

జఫర్‌గఢ్‌/ఖమ్మం/గార్ల:  దసరా పండుగ సందర్భంగా పార్టీ చేసుకునేందుకు గ్రామ శివార్లకు వెళ్లిన స్నేహితులపై పిడుగు పడింది. దీనితో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం సాగరం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌవుతాపురం గ్రామానికి చెందిన నేరెళ్లి శివకృష్ణ (22), మరుపట్ల సాంబరాజు (22), నేరెళ్లి వంశీకృష్ణ, వొజ్జల సందీప్, పాలకుర్తి మండలం బొమ్మెరకు జిట్టబోయిన సాయికుమార్‌ (23) స్నేహితులు.

అంతా కలిసి దసరా పార్టీ కోసం బుధవారం సాయంత్రం సాగరం గ్రామ శివారుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో వాన మొదలవడంతో అంతా కలిసి పక్కనే ఉన్న మర్రిచెట్టు కిందకు వెళ్లి నిల్చుకున్నారు. కాసేపటికే ఆ చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీనితో నేరెళ్ళి శివకృష్ణ, జిట్టబోయిన సాయికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు మిగతా ముగ్గురిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మరుపట్ల సాంబరాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. వీరిలో నేరెళ్లి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

చెరువు మత్తడి చూడటానికని వెళ్లి.. 
మహబూబాబాద్‌ జిల్లా గార్లలో వానకు నిండి మత్తడి పోస్తున్న చెరువును చూసేందుకు అక్కడి వడ్డెర బజారుకు చెందిన వేముల సంపత్‌ (27), ఆలకుంట శేఖర్, రూపన్‌ రమేశ్, విజయ్‌ వెళ్లారు. కాõదÜపటికే జోరువాన మొదలవడంతో చెరువు కట్టపైనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో వేముల సంపత్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. శేఖర్, విజయ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

కాస్త దూరంగా ఉన్న రూపన్‌ రమేశ్‌ పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాడు. స్థానికులు శేఖర్, విజయ్‌లకు గార్ల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడు సంపత్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. 

ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్‌తండాలో బుధవారం సాయంత్రం కోళ్లను కప్పేందుకు ఇంటి బయటికి వచ్చిన మూడు జమ్మ (68) అనే వృద్ధురాలు.. కొద్దిదూరంలో పిడుగుపడటంతో శబ్దానికి గుండె ఆగి కన్నుమూసింది. 

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌పై గురువారం వేకువజామున పిడుగు పడటంతో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 

కడెం మండలంలోని లక్ష్మీసాగర్‌ గ్రామంలో ఇంటిపై పిడుగుపడటంతో భుక్యా రాజేశ్‌ అనే వ్యక్తి ఇంట్లోని టీవి, ఫ్రిజ్, విద్యుత్‌ వైరింగ్‌ కాలిపోయాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. రాజేశ్‌ భార్య స్వరూపకు గాయాలయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement