
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించేలా మూడు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సాగునీరందని ప్రాంతాలకు నీరు అందించేలా రూ.160 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసింది. నకిరేకల్ నియోజకవర్గంలో 8,058 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కట్టంగూరు మండలం, చెరువు అన్నారం గ్రామ పరిధిలో అయితిపాముల ఎత్తిపోతల పథకాన్ని రూ.122 కోట్లతో నిర్మించనుంది.
మొత్తం నాలుగు పంపులను వినియోగిస్తూ 80 క్యూసెక్కుల నీటిని తరలించేలా ఈ ఎత్తిపోతలను నిర్మించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామం వద్ద వీర్లపాలెం ఎత్తిపోతలను రూ.29.20 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 2,500 ఎకరాలకు నీరిస్తారు. ఇదే నియోజకవర్గంలోని వేములపల్లి గ్రామం సమీపంలో తోపుచెర్ల ఎత్తిపోతలను రూ.10.19 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 315 ఎకరాలకు నీరందనుంది. ఇప్పటికే నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో నెల్లికల్, దున్నపోతుల గండి, బొంతపాలెం, కేశవాపురం, పొగిళ్ల, ముక్త్యాల, జా¯Œ పహాడ్, అంబాభవాని, కంబాలపల్లి, ఏకేబీఆర్ వంటి ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మొత్తం రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.