సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఏపీ తరలించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే సహకరించిందని, కేంద్రం వద్ద ఈ దిశగా సానుకూలంగా సంతకాలు చేసింది కేసీఆర్ సర్కారే అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ 12.5 టీఎంసీల నీళ్ళు వాడుకునేందుకు వీలుగా ప్రాజెక్టులు కడితే, తెలంగాణలో కనీసం రెండు టీఎంసీలు వాడుకునే ప్రాజెక్టులు కూడా లేవని విమర్శించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చకు రేవంత్ బదులిచ్చారు.
కాళేశ్వరంపై నివేదికలు సభలో పెడతాం
‘కాళేశ్వరం అవినీతిపై మాట్లాడితే, కృష్ణా ప్రాజెక్టులు అప్పగించారంటున్నారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ లక్షా 47 వేల కోట్ల మేరకు అంచనాలు వచ్చాయని, రూ.97,500 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఇచ్చారని, ఇంకో రూ.10 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతాచేసి కాళేశ్వరం కింద 90 వేల ఎకరాలకు కూడా నీళ్ళు అందలేదన్నది వాస్తవం కాదా? దీనిపై విజిలెన్స్ నివేదికలు సభలో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని రేవంత్‌రెడ్డి అన్నారు.
మరణ శాసనం రాసింది బీఆర్‌ఎస్ సర్కారే
‘కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ కేంద్రానికి అప్పగించిందనే వాదనలో అర్థం లేదు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును 2014 పునరి్వభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. 2014 నుంచి 2023 వరకు బోర్డు సమావేశాలకు వెళ్ళింది వాళ్ళే. ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే ఏపీ పోలీసు లు ఏకే 47 తుపాకులతో నాగార్జున సాగర్ డ్యాంపైకి ఎలా వచ్చారు? వాళ్ళ పులుసు తిని అలుసు ఇచ్చింది బీఆర్‌ఎస్. రాయలసీమకు వెళ్ళి మంత్రి రోజా పెట్టిన రాగి సంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది మీరు కాదా? మీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి కట్టింది.
మీ కళ్ళ ముందే కదా వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డి పాడును 44 వేల క్యూసెక్కులకు పెంచింది. జీవో నంబర్ 203కు నీ ఇంట్లోనే కదా పునాది వేసింది. 8 టీఎంసీలు తరలించేందుకు అనుమతించింది బీఆర్‌ఎస్సే. ఇప్పుడు 12 టీఎంసీలు వెళ్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ 796 ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద కట్టారు. ఏపీ ఒక పక్క ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే, వీళ్ళు చేసిందేమిటి? రాజీవ్ గాంధీ టన్నెల్ ప్రాజెక్టులో ఒక్క కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు. కల్వక్తురి లిఫ్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎస్‌ఎల్‌బీసీ పరిస్థితీ ఇదే. కృష్ణా జలాలపై మరణ శాసనం రాసింది బీఆర్‌ఎస్ సర్కారే. కృష్ణా జలాలు 2015లో కేంద్రానికి అప్పగించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. 811 టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఏపీకి కేటాయిస్తే, 512 టీఎంసీలు ఏపీకి ఇవ్వడానికి అధికారికంగా సంతకం పెట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ రైతుల హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు..’అని సీఎం ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment