కృష్ణా జలాల పునఃపంపిణీపై ఎస్‌ఓసీ దాఖలు చేయాల్సిందే
ఏపీకి స్పష్టం చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్
ఈ నెల 29లోగా ఎస్‌ఓసీ దాఖలు చేయాలని ఆదేశం
మే 15–17 మధ్య తదుపరి విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు, తమకు మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రం జారీ చేసిన అదనపు విధివిధానాల (టీఓఆర్)పై స్టేట్‌మెంట్ ఆఫ్ కేస్ (ఎస్‌ఓసీ) దాఖలు చేసేందుకు జూన్ చివరి దాకా గడువు పొడిగించాలన్న ఏపీ విజ్ఞప్తిని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 తిరస్కరించింది. ఈ నెల 29లోగా ఎస్‌ఓసీని దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాతి నుంచి రెండు వారాల్లోగా ఎదుటిపక్షం దాఖలు చేసే ఎస్‌ఓసీపై కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ట్రిబ్యునల్ విధించిన మార్చి 20 గడువు నాటికి తెలంగాణ ఎస్‌ఓసీ దాఖలు చేయగా ఏపీ ఇంకా దాఖలు చేయలేదు.
మే 15 నుంచి 17 వరకు తదుపరి విచారణ నిర్వహిస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతోపాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణ మధ్య పునఃపంపిణీ కోసం కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు విధివిధానాలను (టీఓఆర్) జారీ చేస్తూ కేంద్రం 2023 అక్టోబర్ 10న గజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సోమవారం ఢిల్లీలో సమావేశమై అదనపు టీఓఆర్‌పై విచారణ చేపట్టింది.
దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు వినిపించారు. ఏపీ గడువు పొడిగింపు అభ్యర్థనను తెలంగాణ వ్యతిరేకించింది. ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి ఉన్నందున స్టేట్మేంట్ ఆఫ్ కేసును దాఖలు చేయలేమన్న ఏపీ వాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కోడ్ అమల్లో ఉన్నా ఎస్‌ఓసీ దాఖలు చేశామని పేర్కొంది. కేసుల విచారణపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, కాలయాపన కోసమే ఏపీ గడువు పొడిగింపు కోరుతోందని ఆరోపించింది. వాదనలు అనంతరం ఏపీ వాదనలను ట్రిబ్యునల్ తిరస్కరించింది.
1,050లో 789 టీఎంసీలు మావే: తెలంగాణ
ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల వాటాలో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు సమర్పించిన ఎస్‌ఓసీలో తెలంగాణ కోరింది. నిర్మాణం పూర్తై వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత (డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment