నిప్పు రాజేసిన నీళ్లు | Fluoride Problem in Nalgonda Lok Sabha Constituency | Sakshi
Sakshi News home page

నిప్పు రాజేసిన నీళ్లు

Published Sat, Mar 30 2019 10:56 AM | Last Updated on Sat, Mar 30 2019 10:56 AM

Fluoride Problem in Nalgonda Lok Sabha Constituency - Sakshi

ఏదైనా సమస్యను ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే.. ఆ సమస్య పరిష్కారం కోసం సాగిస్తున్న ఉద్యమం.. ఉద్యమ ఎత్తుగడలు ఎంతో ముఖ్యం. సరిగ్గా ఈ సూత్రం ఆధారంగానే ప్రపంచ వ్యాప్తంగా ఫ్లోరైడ్‌ పీడకు చిరునామాగా.. పర్యాయపదంగా నిలిచిన నల్లగొండ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను ఉలిక్కిపడేలా చేసింది. సాగునీటి కోసం అల్లాడిన రైతులు.. తాగునీరు లేక ఎండిన గొంతులు.. ఫ్లోరైడ్‌ విషపు నీరుతాగి జీవాన్ని కోల్పోయిన బాధితులు.. వెరసి అతి సామాన్యులు అసామాన్యంగా పోరాడి తెగువ చూపారు. నల్లగొండ జిల్లాకు జరిగిన జల వివక్షపై ఎనభయ్యో దశకంలో జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన జల పోరాటం పార్లమెంటు ఎన్నికలను వేదికగా మార్చుకుంది. సాగునీటి విషయంలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూనే.. తాగు, సాగు నీటి కోసం, ఫ్లోరైడ్‌ శాప విముక్తి కోసం సామాన్యులే సైనికులుగా సాగిన ‘జల సాధన సమితి’ ఉద్యమం చేపట్టిన కార్యక్రమాలు, ఆచరించిన వ్యూహాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. పోస్టు కార్డుల ఉద్యమాలు, మనీయార్డర్లు, పాదయాత్రలు వంటి రూపాలతోపాటు ‘మాస్‌     నామినేషన్లు’ సంచలనం సృష్టించాయి.-ఎన్‌.క్రాంతీపద్మ /నల్లగొండ

ఏం జరిగిందంటే..
జల వివక్షను   వివరించడం, న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనడం ధ్యేయంగా జలసాధన సమితి ఉద్యమిస్తున్న రోజులవి. సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో వాస్తవానికి 1994లోనే మాస్‌ నామినేషన్లు వేస్తామని ప్రకటించినా.. అప్పటికి తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. 1996 ఎన్నికలు మాత్రం ఇందుకు వేదికయ్యాయి. దానికి ముందు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి జల సాధన సమితి నేతృత్వంలో స్వతంత్ర అభ్యర్థులుగా భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నామని నాటి జిల్లా కలెక్టర్‌ నీలం సహానికి ముందుగానే నోటీసిచ్చారు. అప్పటి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌కు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి.. ఇలా ప్రతీ ఒక్కరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. రూ.వెయ్యిలోపే నామినేషన్‌ డిపాజిట్‌ మొత్తం ఉండడం కూడా ఉద్యమకారులకు కలిసి వచ్చింది. ఆ ఎన్నికల్లో 582 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉద్యమకారులు, రైతులు, ఫ్లోరైడ్‌ బాధితులు, మహిళలు, వృద్ధులు ఇలా.. అన్ని వర్గాల వారూ నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 480 మంది బరిలో మిగిలారు. పెద్దసంఖ్యలో పోటీ నెలకొనడంతో నల్లగొండ లోక్‌సభ స్థానానికి జరగాల్సిన ఎన్నిక       నెల పాటు వాయిదా పడింది. ఇంతమంది అభ్యర్థులతో తయారైన బ్యాలెట్‌ పేపర్‌ ఏకంగా పుస్తకమే అయ్యింది. చివరికి ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం ఎంపీగా గెలిచారు.

ప్రభావం చూపిన వ్యూహం
నాటి వ్యూహాన్నే ఈ ఎన్నికల్లో ఆర్మూరు పసుపు రైతులు అనుసరిస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి దాదాపు 175 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాటి మాస్‌ నామినేషన్లతో దేశంలో పలువురు నాయకులు స్పందించారు. వారిలో బాల్‌థాకరే ఒకరు. ఏ సమస్యపై సామాన్యులు ఇంతగా తెగించి నామినేషన్లు వేశారో పూర్వాపరాలు తెలియని ఆయన.. ‘పుట్టగొడుగులెక్కన పార్టీలు పుడుతున్నాయి. అందుకే ఇన్ని నామినేషన్లు..’ అని వ్యాఖ్యానించారని చెబుతారు. మాస్‌ నామినేషన్ల వ్యూహకర్త, జలసాధన సమితి స్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ ‘ఈ ఎన్నికలు నాకు తృప్తినివ్వలేదు. పదివేల నామినేషన్లు వేయించాలనుకున్నాం. కనీసం వెయ్యి నామినేషన్లు వేసి బరిలో నిలవగలిగినా ఎన్నికలు జరిగే అవకాశమే ఉండేది కాదు..’ అని తన ఆత్మకథలాంటి ‘జల సాధన సమరం’లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement