పంట సాగుకు రైతుబంధు.. 24 గంటల నిరంతర విద్యుత్‌తో పంటలకు జీవకళ.. వృద్ధాప్యంలో ‘ఆసరా’.. మిషన్ భగీరథ, మరెన్నో సంక్షేమ పథకాలు.. ఇలా టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన ఒక్కో పథకాన్ని పేరుపేరునా గుర్తు చేసుకున్నారు ప్రజలు. టీఆర్‌ఎస్‌కి జై కొట్టారు. గత ప్రభుత్వాల కన్నా కేసీఆర్ పాలన బాగా ఉందంటూ కితాబునిచ్చారు మెజారిటీ ప్రజలు. మరికొందరు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. రాహుల్‌గాంధీ ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీపై కొంత సానుకూలత కనిపించింది. ‘సాక్షి’ బృందం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ – విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై ఎన్నికల నేపథ్యంలో జనం నాడి తెలుసుకోవడానికి రోడ్‌షో నిర్వహించింది. నల్లగొండ లోక్‌సభ పరిధిలోకి వచ్చే చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట.. ఏపీ సరిహద్దులోని కోదాడ మండలం రాంపురం క్రాస్‌రోడ్డు వరకు 183 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ‘టీఆర్‌ఎస్ పాలన ఎలా ఉంది?, ఏయే వర్గాలకు లబ్ధి చేకూరింది?, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు’.. తదితర ప్రశ్నలపై జనం స్పందన కోరింది. కొందరు.. కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ తమకు తెలుసని, టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు ఇంతవరకు వినలేదని చెప్పారు. ఇంకొందరు అభ్యర్థి ఎవరనే పట్టింపు లేదని, కేసీఆర్‌ను చూసి టీఆర్‌ఎస్‌కు వేస్తా’మని చెప్పారు. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్ బ్రిడ్జ్‌లు, సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుపై డిమాండ్లు వినవచ్చాయి.- సాక్షి, నెట్‌వర్క్
కమర్షియల్ ‘సాగు’భూమి
చౌటుప్పల్ ప్రాంతం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించింది. జాతీయ రహదారి వెంట వ్యవసాయ పొలాలు కన్పించడం చాలా తక్కువ. రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలు, ఇళ్లే ఎక్కువగా ఉన్నాయి. సాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూములు పడావుగా మారగా, చాలా వరకు రియల్ వెంచర్లుగా మారుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఉపాధినిచ్చే ‘పార్క్’
దండు మల్కాపురం గ్రామ శివారులో సుమారు 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ చౌటుప్పల్ ప్రాంతానికి తలమానికంగా మారనుంది. ఈ పార్క్ ప్రారంభమైతే యువతకు ఉపాధి లభిస్తుం ది. ‘రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా ప్రారంభించాలి. స్థానికులకు ఉద్యోగాల కల్పనకు ఇది దోహదం చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది’ అన్నారు చౌటుప్పల్‌కు చెందిన మల్లేశ్.
సాగునీటి ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెరగాలి
చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేయాలని స్థానికులు కోరారు. చిట్యాల మండలంలోని ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వలు అసంపూర్తిగా ఉన్నాయని, నార్కట్‌పల్లి మండలంలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తే బాగుంటుందని అన్నారు. ‘మా వట్టిమర్తి గ్రామానికి సాగునీటిని అందించే ధర్మారెడ్డిపల్లి కాల్వల నిర్మాణం ఆలస్యమవుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది’ అన్నారు చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నర్రా గోపాల్‌రెడ్డి. కట్టంగూర్ మండలం, ముత్యాలమ్మ గూడేనికి చెందిన మరియమ్మ మాత్రం.. ‘మాకు ఎలాంటి ఉపాధి మార్గం లేదు. కూలీ పని చేస్తున్నాను. టీఆర్‌ఎస్ గెలిస్తేనే మంచిగా ఉంటది. ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్ చెప్పిన వాళ్లే గెలుస్తారని అనుకుంటున్నారు మా ఊళ్లో’ అంటూ మనసులోని మాట చెప్పింది. ‘ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. రాహుల్‌గాంధీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తానన్నా’రు అని కేతేపల్లి మండలం ఇనుపాములకు చెందిన నలమాద భిక్షం చెప్పుకొచ్చారు.
మెట్ట సాగు.. బాగు బాగు
సూర్యాపేట పరిధిలోని వ్యవసాయ భూములకు బోర్లు, బావులు, మూసీ కాలువలే ఆధారం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తుండడంతో జాతీయ రహదారి వెంట వరి పొలాలు పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. గతంలో భూగర్భ జలాలున్నా కరెంట్ లేకపోవడంతో ఇక్కడ పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేవి. ఇప్పుడు మొత్తం భూమి సాగవుతోంది. మూసీ ప్రాజెక్టు ఎడమ కాలువ నీళ్లతో రబీలో కూడా జాతీయ రహదారి వెంట వరి సాగు చేశారు. జాతీయ రహదారికి ఇరువైపులా రాయినిగూడెం నుంచి టేకుమట్ల వరకు పచ్చని పొలాలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. పంటలు బాగానే ఉన్నాయని, రైతుబంధు కింద పెట్టుబడి అందుతుందని, మళ్లీ టీఆర్‌ఎస్‌కే జై కొడతామన్నారు రైతులు.
డబుల్ బెడ్‌రూం.. మిషన్ భగీరథ..
దురాజ్‌పల్లి సమీపంలో ఇమాంపేట వద్ద మిషన్ భగీరథ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యింది. నల్లగొండ జిల్లాలోని అవంతిపురం నుంచి ఈ ప్లాంట్‌కు నేరుగా పైపుల ద్వారా నీళ్లు వస్తాయి. ఇక్కడ శుద్ధి చేసిన జలాలను జిల్లాలోని గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ఆనవాలుగా స్థానికులు చెప్పారు. జాతీయ రహదారి పక్కనే చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారు. ‘ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ పథకాలనే అనుసరిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయడంలో తప్పు లేదు’ అని చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన తన్నీరు వెంకట్ తెలిపారు.
మంచిగ చేస్తున్రు కానీ..
కేసీఆర్ బాగా చేస్తున్నాడు. అభ్యర్థి ఎవరో తెలియదు, కానీ కేసీఆర్‌ను చూసే ఓటేస్తాం. గీత కార్మికులు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు ఇస్తామంటున్నారు. చనిపోయిన తరువాత ఇచ్చుడు కాదు.. ముందు మేం బతకడానికి ఆర్థిక సాయం చేయాలి.– కేశగాని జగ్గయ్య,గీత కార్మికుడు,ముకుందాపురం
పథకాలుఅందుతున్నాయి
కేసీఆర్ మాకు గొర్రెల పథకం ప్రవేశపెట్టిండు. మాకు మంచిగానే పథకాలు అందుతున్నాయి. నేను గొర్రెల పథకానికి ఎంపికవడంతో గొర్రెలు ఇచ్చారు. దీంతో మాకు జీవనోపాధి లభిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మరల కేసీఆర్ నిలబెట్టిన మనుషులకే ఎక్కువ మంది మద్దతునిస్తున్నారు.– జాల యాదయ్య. జీవాలపెంపకందారుడు. ముత్యాలమ్మగూడెం. కట్టంగూర్ మండలం
మందులకుడబ్బులున్నాయి
వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. గవర్నమెంట్ పెన్షన్‌తో బాగానే ఉంటున్నా. పెన్షన్‌ని రెండు వేలు చేస్తారంట. ఆరోగ్యం బాగా లేకుంటే భయం లేదిప్పుడు. మందులు కొనుక్కోవడానికి చేతిలో డబ్బులుంటున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కే నా ఓటు.– కొత్తపల్లి కోటయ్య,మాదారం
సంతలో చింత
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. భువనగిరి, నల్లగొండ ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాన్ని నిర్ణయించే ఎన్నికలివి. ప్రాంతీయ పార్టీలు గెలిచినా ఏమీ చేయలేవు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరుడు మంచిది కాదు. ఇటువంటి ఫిరాయింపులను ఏ పార్టీ ప్రోత్సహించకూడదు. మా కట్టంగూర్ సంతలో సమస్యలను పరిష్కరించాలి.
– కోల లింగస్వామి,చేవుగోని రాజు.సంతలో మోకు చిరువ్యాపారులు. కట్టంగూర్
అభివృద్ధి జరిగింది..
నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మద్దతునివ్వాలో నిర్ణయించలేదు. లోక్‌సభ పరిధిలో అభివృద్ధి జరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్ నగర్‌లో అభివృద్ధి చేసిండు. – కోల వెంకటరమణ,రాయినిగూడెం, సూర్యాపేట
Comments
Please login to add a commentAdd a comment