
కమ్యూనిస్టు విప్లవోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి రహస్యజీవితం గడుపుతూ 1976 జూలై 28న అనారోగ్యంతో అమరులయ్యారు. భారత విప్లవ రాజకీయ రంగంలో 35 ఏళ్లకు పైగా వెలుగొంది ‘టీఎన్’గా సుపరిచితులై పీడిత ప్రజల హృదయాలలో ఆయన శాశ్వత స్థానం సంపాదించారు.
కా‘‘ తరిమెల నాగిరెడ్డి 1917 ఫిబ్రవరి 11న అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో పుట్టారు. తాను భూస్వామ్య కుటుంబంలో జన్మించినా దేశంలో కొనసాగుతున్న ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయటానికి, దోపిడీ పీడనలులేని సమ సమాజస్థాపనకు తన సర్వస్వాన్ని అర్పించి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందారు.
విద్యార్థి దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బెనారసు విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా 1939లో ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఈయనే. బెనారసు విశ్వవిద్యాలయంలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. లా చదువుకు స్వస్తిచెప్పి ఎం.ఏ. పట్టాతో విశ్వవిద్యాలయాన్ని వదలగానే యువకులను ఉద్యమాల్లోకి సమీకరించే కృషిని ప్రారంభించారు. కార్మికులు, రైతాంగం కొరకు ఉద్యమించారు.
1940లో ‘యుద్ధం దాని ఆర్థిక ప్రభావం’ అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించి నందుకు 23 ఏండ్ల యువకునిగా ఉన్నప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను అనుభవించారు.తన కంచుకంఠంతో పండిత పామరులను ఉర్రూతలూగించి కమ్యూనిస్టు విప్లవ రాజకీయాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులో ఆయన ఉపన్యాసాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆసక్తితో, శ్రద్ధతో వినేవారు.
భారత విప్లవోద్యమ రంగంలో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ)తో కలిసి మనదేశ పీడిత ప్రజల విముక్తికి అవసరమైన సరైన విప్లవపంథాను రూపకల్పన చేయడంలో, ఈ విప్లవ పంథాను దేశమంతటా ప్రచారంచేసి వ్యాపింపచేయటంలో టీఎన్ చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన పాలకుల తీవ్రనిర్బంధానికి గురయ్యారు. అరెస్టులు, జైలుశిక్షలు, అజ్ఞాతవాసాలకు వెరువలేదు. ఆయనపైనా, మరో 60మందిపైనా పెట్టిన కుట్రకేసు విచారణ సందర్భంగా జైలులో ఉన్నపుడు (1970–72) ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై ‘తాకట్టులో భారతదేశం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. దానిని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు. సరైన మార్క్సిస్టు లెనినిస్టు విశ్లేషణతో ఆ పుస్తకంలో ఆయన చేసిన నిర్ధారణలు నేటికీ అక్షరసత్యాలే. అవి కమ్యూనిస్టు విప్లవకారులకు, ప్రజాతంత్రశక్తులకూ భావి కార్యాచరణకు మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి.
1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తన బావ సంజీవరెడ్డిని ఓడించి అనంతపురం శాసనసభ్యునిగా తొలిసారిగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ళ వయస్సులోనే మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తన రాజకీయ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. 1969 మార్చిలో తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామాచేసి అసెంబ్లీలో సంచలనాత్మకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. పాలకవర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెడ్తూ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధానాలను, భూస్వాముల ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.
దేశాభివృద్ధికంటే రక్షణ చర్యలకే ప్రాధాన్యతనిస్తూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే చర్యలను అసెంబ్లీ, పార్లమెంటు చేపట్టకుండా ఈ సంక్షోభ తీవ్రతను మరింతగా పెంచే ప్రజావ్యతిరేక విధానాలను అవి అవలంబిస్తున్నాయని చెప్తూ ‘‘జనాల్ని కదిలిస్తే తప్ప పాలకుల దోపిడీ, దౌర్జన్యాలు అంతం’’ కావని వ్యాఖ్యానించారు.
1975లో డీవీతో కలిసి యూసీసీఆర్‌ఐ (ఎమ్‌ఎల్) ను స్థాపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన జీవితకాలమంతటా అత్యున్నత విప్లవ ప్రమాణాలను పాటించారు. ఆయన స్మృతి నిరంతరం ప్రజలను విప్లవ కర్తవ్యోన్ముఖులను చేస్తూనే వుంటుంది.
సి. భాస్కర్ ‘ యూసీసీఆర్‌ఐ (ఎమ్‌ఎల్)
Comments
Please login to add a commentAdd a comment