పీడితుల కోసమే జీవితం అంకితం | Sakshi Guest Column On Makhdoom Mohiuddin | Sakshi
Sakshi News home page

పీడితుల కోసమే జీవితం అంకితం

Published Sun, Feb 4 2024 12:18 AM | Last Updated on Sun, Feb 4 2024 12:18 AM

Sakshi Guest Column On Makhdoom Mohiuddin

మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌

తెలుగు నేలపై జన్మించి ప్రజలకొరకు జీవితాన్ని అర్పించిన అరుదైన కమ్యూనిస్ట్‌ నేత కామ్రేడ్‌ మఖ్దూమ్‌. సింగరేణిలో ఆయన చాలా కాలం ఏఐటీయూసీ బాధ్యుడు. అయన కుమా రుడు కూడా ఉద్యోగం చేసేవాడు.

సింగరేణితో అయన అనుబంధం విడ దీయరానిది. బొగ్గు బావుల్లో దిగి కార్మికుల సమస్యలను అయన తెలుసుకునే వారు. ఆయన కవితలు ఇక్కడ ఇప్పటికీ పలు కార్యక్రమాల్లో  వినిపిస్తుంటాయి. ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడైన ఆయన మెదక్‌ జిల్లా ఆందోల్‌లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. మఖ్దూమ్‌ పూర్తిపేరు అబూ సయీద్‌ మహ్మద్‌ మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ ఖాద్రి. వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్‌ నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. 

తండ్రి గౌస్‌ మొహియుద్దీన్‌ నిజాం ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మఖ్దూమ్‌ చిన్నతనంలోనే (నాలుగేళ్ళయినా రాకముందే) తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆయన తన బాబాయి బషీరుద్దీన్‌ వద్ద పెరిగాడు. 1929లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చేరాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖల’ను ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. 

మఖ్దూమ్‌ కవిగా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్‌ షా నాటకానికి ‘హోష్‌ కె నా ఖూన్‌’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయి పోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన
శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్‌ ఫ్రంట్‌’
సంపాదించి చదివేవాడు.

నాగపూర్‌ కామ్రేడ్ల సహాయంతో 1930–40లలో హైదరాబాదులో ‘స్టూడెంట్స్‌ యూనియన్‌’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులావ్‌ు హైదర్, రాజ బహు దూర్‌ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు. ‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’ అనే ఇక్బాల్‌ కవితను నినదించేవాడు. అక్తర్‌ హుస్సేన్‌ రాయ్‌పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాదులో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు.

చార్మినార్‌ సిగరెట్‌ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, ఆల్విన్, షాబాద్‌ సిమెంట్‌ వంటి అనేక కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్‌ అధ్యక్షుడయ్యాడు. అహోరాత్రులూ వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్‌ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. నల్లగొండ జిల్లా హుజూర్‌ నగర్‌ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్‌ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు.

మఖ్దూమ్‌ బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్‌ను శుభ్రంచేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం ఆయన దినచర్యల్లో భాగాలయ్యాయి. మఖ్దూమ్‌ ప్రతీ ఉదయం ఒక్క పైసాతో తందూరీ రొట్టె తిని సాయంత్రం వరకు గడిపేవాడు. ఆయన మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు.

తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆ బాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావించాడు. అందరూ కలిసి భోజనం చేసే ‘దస్తర్‌ఖాన్‌’ల గురించి కల గన్నాడు. హైదరాబాదు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి ఆయన. నిజావ్‌ు పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరా టానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం అనుభవించాడు. 

1969 ఆగష్టు 25వ తేదీన గుండెపోటుతో ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. హైదరాబాదు లోని సి.పి.ఐ. తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి ‘మఖ్దూమ్‌ భవన్‌’ అంటూ ఆయన పేరే  పెట్టారు. సింగరేణిలో ఏఐటీయూసీ అనుబంధంగా యూని యన్‌ నిర్మించడంలో మఖ్దూమ్‌ కీలకంగా వ్యవహారించాడు. మరో యోధుడు దేవూరి శేషగిరి, రాజ్‌ బహద్దూర్‌ గౌర్‌ తదితరులతో కలిసి ‘ఎర్రజెండా యూనియన్‌’ నిర్మించాడు. మఖ్దూమ్‌ సేవలు చిరస్మరణీయం.
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ ‘ 99518 65223
(నేడు మఖ్దూమ్‌ జయంతి) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement